అలల నురుగులను మేనుకద్దుకున్న మల్లికవు!
నీహారము చల్లదనం దాచెను నీ రేకులు!
మండు వేసవిలో స్వాంతననిచ్చు విరి తావులు!
నల్లని త్రాచు వంటి జడలో మెరిసే మణి!
విరహాగ్నిని రగిలించే ఆరణి!
అత్తరుగా గుభాళిస్తూ..
పువ్వులలో ప్రకాశిస్తూ..
చూచిన మది పులకరిస్తూ..
పూజలలో పలుకరిస్తూ..
శశాంకుడు వెన్నెలను కుమ్మరించాడేమో!
దినకరుడు కిరణ కాంతి అరువిచ్చాడేమో!
స్వచ్ఛతకు నువ్వు వీలునామా వ్రాసి ఇచ్చావేమో!
వల్లమాలిన అభిమానం నీపై పెంచుకుంటినేమో!
మల్లిక!
కావ్య కన్యక!
వసంత ఋతువుకై అభిసారిక!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి