మనసు తోటలో మమతల పందిరి: - చంద్రకళ.దీకొండ


మామూలు మధ్యతరగతి ఇంటనే పుట్టాను
మమకారపు పరమాన్నం తింటూ పెరిగాను!

నాన్న కష్టంతో చదివి ఎదిగాను
అమ్మ  ప్రేమతో మనిషిగా మసిలాను!

అన్నదమ్ముల అనుబంధంతో  అన్నీ నేర్చాను
అక్కచెల్లెళ్ల  ఆత్మీయతతో మురిసి ఒదిగాను!

కుటుంబ పునాదిపై ఆశల మేడలు కట్టాను
పెంచిన  రెక్కలతో ఉన్నతస్థానాన్ని పొందాను!

విదేశాల మోజుతో విమానంలో విహరించాను
పీపీలికాలయ్యాయి కుటుంబబంధాలు విహంగవీక్షణలో!

అహంకారమనే పసిడిపంజరంలో
బందీని అయ్యాను
అస్తిత్వాన్ని అందించిన మూలాలనే మరిచాను!

ఆడంబరాలు,అట్టహాసాల ఊయలలూగాను
సంపాదన  సంబరాల ఊబిలో మునిగాను!

వెలుగుదివ్వెలా తిమిరాన్ని తొలగించింది బోసినవ్వు
అమ్మ త్యాగాన్ని తలపుకు తెచ్చింది
ఆ మల్లెపువ్వు!

నాన్న వ్యక్తిత్వపు విలువ గురుతుకొచ్చింది
మమకారపు పరమాన్నం రుచి మళ్లీ తెలిసింది!

అలముకొన్న  అహం  అంతా తొలగింది
మన సు  తోటలో మమతల పందిరి వెలసింది!

నేను అనే అక్షరం చెరిగిన క్షణమే...
'మనం' అనే మహాకావ్యానికి తొలి పుట తెరుచుకుంటుంది.
************

కామెంట్‌లు