గగనాన ఎగిరేను వర్ణాల హారం: - వరలక్ష్మి యనమండ్ర


గగనాన ఎగిరేను వర్ణాల హారం
గర్వాన నిలిపేను స్వేచ్ఛా విహారం

కుంకుమ వన్నెలో త్యాగాల మంటలు
వీరుల నెత్తుటిలో పండేటి పంటలు

తెలుపు వర్ణమింక శాంతి కీర్తనలు
సత్యాహింసలదే నిత్య ప్రార్థనలు

పచ్చని రంగింక భూమాత సిరులు
పంటల పొలాలలో పరిమళించు తరులు

నడుమన చక్రమింక ధర్మపు నడకలు
ఇరవై నాలుగింటి కాలపు అడుగులు

అశోకుని బోధలే అమృతపు జల్లులు
తరతరాల చరితకు వెలుగించు మల్లెలు

బడిపిల్లల చేతులే వందన సందళ్ళు
వృద్ధుల కనులలోన ఆనంద కన్నీళ్ళు

పండుగల వేళలో ఎగిరేటి ఆశలు
పోరాట త్యాగాలే నింపేటి కాంతులు

భాషలు మతాలన్ని దాటేటి బంధాలు
భిన్నత్వమందున ఏకత్వపు రంగులు

జెండా ఎగిరేదే మన గుండె లోగిళ్ళు
వర్ణాలు వెలిగేదే మన స్వప్న శిఖరాలు

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
త్రివర్ణ పతాకం గురించి అత్యద్భుతంగా వర్ణించి రాసారు అక్క 👌👌👌👏👏