హలో పిల్లలూ! మామూలుగా పూలతో, ఆకులతో కొమ్మలతో అమ్మాయిలను సృష్టించాం. అయితే చెట్టు తీగలతో ఇంతవరకు అమ్మాయిని చెయ్యలేదు. అందుకే పూల తీగలతో ఈరోజు ఆడపిల్లను తయారు చేశాను. సన్నని కాండంతో వేరే చెట్టు మీద ఆధారపడుతూ అల్లుకుంటూ పెరిగే మొక్కల్ని తీగజాతి మొక్కలు అంటారు. చెట్లు, గోడల ఆసరాతో పందిరి మీదకు పాకుతాయి. కాండం అత్యంత సన్నగా ఉండటం వలన సొంతంగా నిలబడలేవు మధుమాలతి, తీగమల్లె, రాధా మనోహరం, మార్నింగ్ గ్లోరీ, కాగితం పూలు వంటివన్నీ తీగలుగా పెరిగి అల్లుకుంటాయి. మా బెంగళూరు ఇంట్లో గ్రిల్ కు అల్లుకున్న పూల తీగల్ని కత్తిరించి ఇందులో వాడుకున్నాను. ఈ తీగజాతి మొక్కలకు సూర్యరశ్మి తగిలితేనే బాగా పూస్తాయి. కనీసం రోజూ ఐదారు గంటల ఎండ అవసరం. నీరు కూడా తగినంత ఉంటేనే పెరుగుతాయి. ముఖ్యంగా తీగలు పాకడానికి గ్రిల్స్, తాడు, జాలీలు, తీగలు ఏర్పాటు చేస్తే ఇంటిని నందనవనంగా మారుస్తాయి. పూలతో పాటు పండ్లు, కూరగాయలను ఇచ్చే తీగజాతి మొక్కలు కూడా ఉన్నాయి. కొద్దిగా ఆధారం దొరికితే చాలు దానిని పట్టుకొని ఎగబాకటం ఈ తీగ జాతుల లక్షణం. చాలా చోట్ల గమనించినప్పుడు కరెంటు స్తంభాలకు, మోడు చెట్లకు సైతం తీగ జాతులు అల్లుకుని రకరకాల ఆకారాల్ని సృష్టిస్తూ అందాన్ని అందిస్తాయి. ద్రాక్ష వంటి పండ్లు, సోర, కాకర వంటి కూరగాయలు, జాజి, మల్లె వంటి పూలు తీగజాతికి చెందిన మొక్కలు.
ఒక కాగితం మీద బొమ్మను వేసి దాని మీద తీగల్ని పరుచుకుంటూ వచ్చాను. అమ్మాయి వేసుకున్న గౌనుకు గులాబీలు కుట్టాను. ఈ పూల తీగల్ని జుట్టు వలె అమర్చాను. తలమీద కిరీటం వలె గులాబీలను అమర్చాను. లాంగ్ ఫ్రాక్ వేసుకున్న పాప అందంగా తయారైంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి