- కర్ణ పర్వము ప్రథమాశ్వాసము: 365 వ రోజు
ధృతరాష్ట్రుడు ఇరుపక్షాలలో మరణించిన జీవించి ఉన్నవారి గురించి తెలుసుకొనుట
సంజయుడు " మహారాజా ! మన పక్షమున భీష్మ, ద్రోణ, కర్ణ, వికర్ణ, వృషసేన, దుశ్శాసన, లక్ష్మణులు మరణించారు. వారిలో విరాజుడు, శతానీకుడు, విరాటుడు, ద్రుపదుడు, అభిమన్యుడు, ఘటోత్కచుడు, పాండ్యరాజులు మరణించారు " అన్నారు. ధృతరాష్ట్రుడు " సంజయా ! ప్రస్థుతం కురుసేనలో ఉన్న యోధులు ఎవరు " అని అడిగాడు. సంజయుడు " మహారాజా ! కౌరవసేనలో కృతవర్మ, శల్యుడు, శకుని, కృపాచార్యుడు, ఇంకా నీకుమారులు కొంత మంది కర్ణుడి కుమారులు కొంత మంది బ్రతికి ఉన్నారు. వీరి సాయంతో నీ కుమారుడు పాండవులను జయించగలను అని ధైర్యము వీడక ఆశతో ఉన్నాడు. ధృతరాష్ట్రుడు ఊరట చెంది " సంజయా ! మదించిన ఆంబోతువలె ఉన్న కర్ణుడు అర్జునుడి చేతిలో చావడం ఆశ్చర్యంగా ఉంది. కృష్ణార్జునులను ఇసుమంత కూడా లక్ష్యపెట్టని కర్ణుడు వారిని గెలుస్తానని చెప్తూనే మరణించాడు. ఈ కర్ణుడి అండ చూసుకునే కదా నా కుమారుడు పాండవులతో వైరము పెంచుకున్నది. అలాంటి కర్ణుడే లేనప్పుడు సుయోధనుడికి బ్రతుకెక్కడ. రేపటి నుండి యుద్ధము ఎలా చేయగలడు. ఇక యుద్ధము చేయడం వృధా.
ధృతరాష్ట్రుని నిరాశ
సంజయా ! ఇన్ని వార్తలు విన్న తరువాత కూడా నా గుండె పగలేదంటే ఇది గుండేనా లేక పాషాణమా ! నా బ్రతుకు చూసావా ! నా కుమారులు మనుమలు చనిపోయారని విని శిలలా ఉన్నాను. ఇక నా వల్ల కాదు. ఎక్కడైనా దూకుతాను లేకపోతే విషం తాగుతాను. లేకున్న ప్రాయోపవేశం చేస్తాను. ఇంతటి వార్తలు వింటూ బ్రతకడం వృధా " అంటూ బలవన్మరణనానికి పాల్పడ్డాడు. సంజయుడు " మహారాజా ! ఏమిటీ వెర్రి. నీ లాంటి చక్రవర్తి మనోధైర్యం సడలి ఇలా బేలగా మారవచ్చా. నీవు చదివిన చదువులు నీ గొప్పదనం ఒక్క సారి గుర్తుకు తెచ్చుకుని ధైర్యంగా ఉండు " అన్నాడు. సంజయా ! కర్ణుడి మరణం నాలో నిరాశ మిగిల్చింది. ఇక నా కుమారుడు ఎవరున్నారన్న ధైర్యంతో యుద్ధం చేస్తాడు. అంతటి కర్ణుడు మరణించాక మనం ఇక ఓడిపోతాము అన్న భావన కలిగి నాలో నిరాశ ఆవహించింది. భయపడకు అయినా నేను చావనులే అంత త్వరగా చచ్చే వాడినే అయితే నా కుమారుడు దుశ్శాసనుడు, కర్ణుడు చనిపోయారన్న మాట విన్నప్పుడే నా గుండె ముక్కలైయ్యేది. నాకిక దీర్ఘాయువే. ఒకప్పుడు అందరి గౌరవ మర్యాదలను అందుకున్న నేను ఇక నన్ను చూసి జాలి పడే వారి జాలి చూపులు ఎదుర్కో వలసిన దుర్ధశ దాపురించింది. వారి జాలి చూపులు నేను భరించ లేను. అయినా భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, దుశ్శాసనుడు ఒకరి తరువాత ఒకరు మరణిస్తుంటే నేను ఎలా తట్టుకుంటాను . కర్ణుడి చావు నాకు ఆశా నిపాతం అయింది. సుయోధనుడు గెలుస్తాడు అనుకోవడం ఇక అడియాస కదా ! మన సాహసాలు కోల్పోయాము కదా ! సుయోధనుడు గెలుస్తాడని అనుకోవడమిక కుంటి వాడు నడుస్తాడని అనుకోవడమే. ముసలి వాడు పడుచు వేశ్యల కొరకు ఆశపడటమే కదా ! సంజయా ! అనాడు ధర్మరాజు మనలో మనకు కలహం ఎందుకు సామరస్యంగా ఉంటాము అని వర్తమానం పంపినా మూర్ఖత్వంతో తిరస్కరించాను. ఇప్పుడు అనుభవిస్తున్నాను. భీష్ముడు శరతల్ప గతుడైన సమయాన అర్జునుడు భూగర్భ జలమును తెచ్చాడు. అతడి ప్రతిభ చూసి భీష్ముడు యుద్ధము మాని సంధి చేసుకొమ్మని అన్నప్పుడైనా విని ఉంటే ఇప్పుడీ దుర్గతి పట్టక పోను.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి