రాజు రాజరాజ చోళుడికి ఒక రోజు సందేహం వచ్చింది. "ఈ ప్రపంచంలో అందరికీ సంతోషాన్ని ఇచ్చేదేదీ?" అని. పరిపరి విధాలా ఆలోచించాడు.
ఈ ప్రశ్నకు సరైన పండితులే కాకుండా సాధారణ ప్రజలు కూడా సమాధానం చెప్పమని దండోరా వేయించాడు. పైగా అందరికీ ఆనందం కలిగించే వస్తువును రాజసభలోని కొలువు కూటంలో పెట్టాలని చెప్పాడు. ఎవరి సమాధానం సరిగ్గా ఉంటుందో వారికి వెయ్యి బంగారు నాణేలు బహుమతిగా ఇస్తానని చాటింపు వేయించాడు.
ప్రజలు బాగా ఆలోచించి, తమకు నచ్చిన వస్తువులను తెచ్చి కొలువు కూటంలో పెట్టారు. మరుసటి రోజు రాజు వచ్చి చూశాడు. మండపం నిండా ప్రజలు తెచ్చిన వస్తువులే కనిపించాయి. రాజు ఒక్కొక్క వస్తువును పరిశీలించడం మొదలుపెట్టాడు.
రాజరాజ చోళుడి పరిశీలన:
సిరిసంపదలు: మొదట కొంత బంగారం కనిపించింది. దానికింద "సంపద నిజమైన సంతోషం" అని రాసి ఉంది. అయితే రోగంతో ఉన్నవారికి, ఇప్పటికే కోట్లకు పడగెత్తిన ధనవంతులకు ఈ సంపద ఎలా ఆనందాన్ని ఇస్తుంది? అని రాజు దాన్ని పక్కన పెట్టేశాడు.
సంగీతం: తర్వాత ఒక సంగీత వాయిద్యం కనిపించింది. దానికింద "సంగీతమే సంతోషం" అని ఉంది. చెవులు వినపడని వారికి ఈ సంగీతం ఎలా ఆనందాన్ని ఇస్తుంది? అని దాన్ని కూడా తిరస్కరించాడు.
అందమైన పూలు: ఆ తర్వాత కొన్ని పూలు ఉన్నాయి. చూస్తే కంటిచూపు లేనివారికి పూల అందం ఎలా తెలుస్తుంది? అంటూ దాన్ని వదిలేశాడు.
తీపి పదార్థాలు: ఆ పక్కనే తీపి పదార్థాలు ఉన్నాయి. జబ్బు పడినవారికి తీపి తింటే ఆరోగ్యం మరింత పాడవుతుంది కదా అని దాన్ని కూడా రాజు ఒప్పుకోలేదు.
చివరకు రాజు ఒక పెద్ద శివలింగం దగ్గరకు వచ్చాడు. ఆ శివలింగం కింద ఒక విగ్రహం ఉంది. ఆకలితో ఉన్న ఒక చిన్న పిల్లాడికి ఒక తల్లి ప్రేమగా అన్నం పెడుతున్నట్లు ఆ విగ్రహాన్ని మలిచారు. దాని కింద "అన్బే శివమ్" (ప్రేమే దైవం) అని రాసి ఉంది. ఈ విగ్రహాన్ని చెక్కిన శిల్పిని వెంటనే పిలవమని రాజు సూచన చేశాడు.
బక్కచిక్కిన శరీరంతో ఉన్న ఒక పేద శిల్పి రాజు ముందుకు వచ్చాడు. రాజు అతడిని చూసి, "ఈ విగ్రహాన్ని చెక్కింది నువ్వేనా? దీని వెనుక ఉన్న అంతరార్థం ఏంటో చెప్పు" అని అడిగాడు.
శిల్పి నమస్కరించి ఇలా చెప్పాడు: "ప్రభూ! శివలింగం కింద ఒక తల్లి ప్రేమతో పిల్లలకు అన్నం పెడుతున్నట్లు చెక్కాను. ఈ ప్రపంచంలో రూపాన్ని చూడలేనివారు, నిజమైన మాటలు వినలేనివారు, మాట్లాడలేనివారు సైతం అనుభవించగలిగేది ఒక్క 'ప్రేమ' మాత్రమే. అలాగే జబ్బు పడినవారు కూడా అందరి నుంచి కోరుకునేది ఈ ప్రేమనే. మాత్రమే. ఆ ప్రేమ స్వరూపమే ఈ దేవుడు."
శిల్పి చెప్పిన మాటలకు రాజు ఎంతో మురిసిపోయాడు. తన ప్రశ్నకు అద్భుతమైన సమాధానం దొరికిందని మెచ్చుకున్నాడు. "నువ్వు గొప్ప శిల్పివి, నేను కట్టిస్తున్న తంజావూరు బృహదీశ్వరాలయానికి నువ్వే శిల్పిగా పని చేయి" అని కోరాడు. అతనికి వెయ్యి బంగారు నాణేలు బహుమతిగా ఇచ్చి, ఆ పేద శిల్పి జీవితాన్ని వెలుగుమయం చేశాడు.
ప్రేమకు లొంగని ప్రాణి ఈ ప్రపంచంలో ఏది లేదు. ప్రాణికోటి అంతటికీ అసలైన సంతోషాన్ని పంచేది ఆ ప్రేమ ఒక్కటే!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి