ఊ అనేస్తే పోలా!: - కొత్త విరిత
 

మనకి రకరకాల భావోద్వేగాలు ఉంటాయి ప్రేమ, కోపం, జాలి, బాధ, అసూయ, కన్నీళ్లు… ఇంకా బోలెడన్ని.అవి ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు వస్తాయో మనకే కొన్నిసార్లు అర్థం కాదు.అర్థం కాకపోయినా పర్లేదు… వచ్చిన ప్రతిదానికీ మనం జీవితాంతం అద్దెకు ఉంచాల్సిన అవసరం లేదు.
కోపం వచ్చింది కదా అని పక్కవాడిని తన్నేసి, గొడవపడి, చివరికి మనకే తలనొప్పి తెచ్చుకోవడం ఎందుకు?భావోద్వేగం వచ్చిందంటే అది ఒక నోటిఫికేషన్ మాత్రమే… వెంటనే రిప్లై ఇవ్వాల్సిన మెసేజ్ కాదు!బాధ వచ్చింది కదా అని రోజంతా దానితో కూర్చోవాలా?
ప్రేమ వచ్చింది కదా అని అవతలివాళ్ల చుట్టూ జీవితాన్ని ప్యాక్ చేసి పంపాలా?
జాలి వేసిందని ప్రతి ఒక్కరి సమస్యను మన భుజాల మీద మోసుకోవాలా?
అసూయ వచ్చిందని మన ప్రశాంతతను వాళ్ల విజయానికి బహుమతిగా ఇవ్వాలా?
కన్నీళ్లు వస్తే రానివ్వండి… అవి కూడా మనసుకి అప్పుడప్పుడూ వచ్చే వర్షమే. ఏడ్చి కళ్ళు తుడిచేసుకోవటం అంత ఉత్తమం ఇంకోటి లేదు. అక్కడితో ఆ బాధ పూర్తిగా పోకపోయినా,కాసేపటికి దానినుండి బయట పడతాం.భావన రావడం మన చేతిలో ఉండకపోవచ్చు… కానీ దాని వెంట ఎంత దూరం నడవాలో మాత్రం మన చేతిలోనే ఉంటుంది.
కోపం వచ్చిందా? ఊ అనేయండి.
బాధ వచ్చిందా? ఊ అనేయండి.
ప్రేమ వచ్చిందా? అదీ ఊ అనేయండి.
కన్నీళ్లు వచ్చాయా? వాటినీ వచ్చి పోనివ్వండి.
ప్రతి భావోద్వేగానికి కుర్చీ వేసి, “ఇక్కడే ఉండండి” అని ఆహ్వానం ఇవ్వాల్సిన అవసరం లేదు.
వచ్చేవి వస్తాయి, 
పోయేవి పోతాయి.
మన పని వాటిని ఆపడం కాదు… వాటితో కలిసి మనమే కొట్టుకుపోకుండా ఉండటం.అందుకే… భావం ఏదైనా, ముందు ఒకసారి “ఊ…” అనేసి వదిలేయండి. అంతే… జీవితం చాలా తేలిక అవుతుంది! 
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
ఊ..... 😆 Super
అజ్ఞాత చెప్పారు…
Nice
అజ్ఞాత చెప్పారు…
ఉ annanu super write up 👌👌