స్వయంకృతం : - సరికొండ శ్రీనివాసరాజు


సతీశ్, రాజేశ్ మంచి స్నేహితులు. కలసి ఆడుకుంటారు. వీరిద్దరూ ఎప్పుడూ ఒకరితో ఒకరు కలిసి ఆడుకోవడం తప్ప మూడో వ్యక్తిని ఆటల్లోకి చేర్చుకునే వారు కాదు. సతీశ్ చదువులో ఎప్పుడూ మొదటి ర్యాంకు సాధించేవాడు. రాజేశ్ ఎప్పుడూ చదువులో వెనుకబడే వాడు. ఈ విషయంలో సతీశ్ స్నేహితునికి ఎంత హితబోధ చేసినా చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లు అయింది. 
         ఒకసారి పరీక్షలు జరుగుతున్నాయి. విద్యార్థుల నెంబర్లను సీరియల్ గా వేయకుండా జంబ్లింగ్ చేశారు. సతీశ్ వెనక రాజేశ్ నెంబర్ వేశారు. రాజేశ్ సతీశుతో "నీ వెనుక నేను కదా! పరీక్షల్లో నువ్వు రాసే జవాబులు నాకు చూపించరా! ప్లీజ్!" అని బతిమాలాడు. అప్పుడు సతీశ్ "నేను నీకు ఎన్నోసార్లు హితబోధ చేశాను. అయినా మిత్రుని మాటను పెడచెవిన పెట్టి, చదవకుండా ఎంజాయ్ చేస్తున్నావు. ఇకనుంచి అయినా కష్టపడి చదువు."' అని అన్నాడు. సతీశ్ రాజేశుకు తాను రాసే జవాబులను చూపించలేదు. దాంతో రాజేశుకు సతీశ్ మీద కోపం వచ్చింది. రాజేశ్ సతీశుతో మాట్లాడడం మానేశాడు. 
        ఎప్పటిలాగే ఈసారి రాజేశ్ తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాడు. అందరిని పిలిచాడు. కానీ మొదటిసారి సతీశును పిలవలేదు. రాజేశ్ పుట్టినరోజు వేడుకలు ముగిసినాయి. మరునాడు పాఠశాలకు వచ్చిన సతీశును వేంకటేశం "నిన్న నీ ప్రాణాలు మిత్రుని పుట్టినరోజుకు ఎందుకు రాలేదురా నువ్వు?" అని అడిగాడు. "నాకు ఆ మధ్య నా పుట్టినరోజు వేడుకల సందర్భంగా మా తాతయ్య నాకు 2000 రూపాయలు బహుమతిగా ఇచ్చాడు. ఏదైనా నాకు ఇష్టమైనది కొనుక్కోమని అన్నాడు. కానీ అవి ఖర్చు చేయకుండా నా ప్రాణ మిత్రుడు రాజేశ్ పుట్టినరోజు సందర్భంగా అతనికి బహుమానంగా ఇవ్వాలని అనుకున్నాను. కానీ ఎందుకో వాడు నన్ను పిలవలేదు. ఆ 2000 రూపాయలను పేద విద్యార్థి అయిన సురేశుకు ఇవ్వాలని అనుకున్నాను. ఆ రెండు వేల రూపాయలతో అతనికి స్టడీ మెటీరియల్ కొని ఇచ్చి, అతని వెంటే ఉంటూ అతనిని చదువులో ప్రోత్సహిస్తూ నన్ను మించే అంత ప్రతిభగల విద్యార్థిగా చేయాలని అనుకున్నాను." అన్నాడు సతీశ్. వీరికి తెలియకుండా దూరం నుంచి ఇదంతా చూస్తూ వీరి సంభాషణ వింటున్న రాజేశ్ సిగ్గుతో తల దించుకున్నాడు. 
కామెంట్‌లు