శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - భాగం - 167
 

వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
145. నిర్వికారా (చతురక్క్షరీ)
146. నిష్ప్రపంచా (చతురక్క్షరీ)
నూట నలభైఆరవ నామ మంత్రము:
ఓం నిష్ప్రపంచాయై నమః
ప్రపంచము = సంచయము / విస్తారము; భూమి మొదలైన గుంపులు లేనిది
ఈ జగత్తు యొక్క నిర్వహణ, పరిపాలనా భారం మొత్తం తానే వహిస్తూ, సకల బ్రహ్మాండాలకూ అతీతమై ఉన్నది తానే, అని దర్శనం ఇస్తున్న చిన్మయరూపిణిని చూసిన వశిన్యాది వాగ్దేవతలు శ్రీలలితా పరాభట్టారికను "నిష్ప్రపంచా" అని కీర్తించారు. ఈ జగత్తు తనకు అంటకపోయినా, తనలోనే ఉన్న ఈ చరాచర జగత్తు రక్షణ భారం వహిస్తున్న శ్రీమాతకు నమస్కారము.
పంచభూతాలు అయిన భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము; పంచతన్మాత్రలు అయిన రూపము, రసము, వాసన, స్పర్శ, శబ్దము; పంచజ్ఞానేంద్రియాలు అయిన చెవి, చర్మము, కళ్ళు, నాలుక, ముక్కు మరియు పంచకర్మేంద్రియాలు నోరు, చేతులు, పాదాలు, పాయువు, ఉపస్థల కలయికతో ఏర్పడిందే ప్రపంచము. పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచజ్ఞానేంద్రియాలు మరియు పంచకర్మేంద్రియాలు ఇవి ఏవీ కూడా పరమేశ్వరికి అంటవు. అమరవు. అందువల్లనే అమ్మ కు ప్రపంచముతో సంపర్కము ఏర్పడే అవకాశం లేదు. కనుకనే, కాత్యాయని "నిష్ప్రపంచా" అయ్యింది.
పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచజ్ఞానేంద్రియాలు మరియు పంచకర్మేంద్రియాలు వీటన్నిటికీ మూలమైనది "శ్రీమాత". మట్టి తో రకరకాలైన పాత్రలు తయారు చేయవచ్చు. పాత్రలు పగులుతాయి, నశిస్తాయి. కానీ, మట్టి శాశ్వతముగా ఉంటుంది. అలాగే, అన్నిటికీ ప్రాణశక్తి రూపిణి అయిన పరమేశ్వరి ఏ ప్రపంచంలోనూ ఉండదు. తాను సృష్టించిన ప్రపంచాలు, వాసనలు, నశించినా కూడా జగన్మాత, పరబ్రహ్మము, నిత్యమూ, సత్యమూ, శాశ్వతమూ. అందుకే, "నిష్ప్రపంచా".
జగన్మాత అయిన తనను సూక్ష్మరూపిణిగా, సర్వాంతర్యామి గానూ, సకల శక్తి స్వరూపిణిగానూ భావించి నిత్య అయిన తనను పూజించే తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న  శ్రీమాతను పూజించేటప్పుడు   ఓం నిష్ప్రపంచాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
కామెంట్‌లు