వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
150. నిరవద్యా (చతురక్క్షరీ)
151. నిరంతరా (చతురక్క్షరీ)
నూట ఏభైఒకటవ నామ మంత్రము:
ఓం నిరంతరాయై నమః
నిరంతరా; అంతరా = ఖాళీ, హద్దు, ఛిద్రము / రంధ్రము
తనకు ఏ అవకాశమూ / ఖాళీ గానీ, హద్దు గానీ లేదని. తానే అంతటికీ, అన్నిటికీ అవకాశము, హద్దు అని ప్రకటితమైన పరాత్పరిని చూసి వశిన్యాది వాగ్దేవతలు జగన్మాతను "నిరంతరా" అని కీర్తించారు. ఏ హద్దులూ లేకుండా, ఏ అవకాశమూ తీసుకోకుండా తన సాధకుల మనోభీష్టాలను ఈడేర్చుతున్న కాత్యాయనికి నమస్కారము.
పరమాత్మ, పరాత్పరి యందు ఎవరైతే అవకాశ భావాన్ని కలిగి ఉంటారో, వారు అజ్ఞానం అనే చీకటిలో కొట్టుకుపోతూ ఉంటారు. ఈ అజ్ఞాన అహంకారములో తలమునకలై ఉన్న వీరు, వారికి వారే హద్దులు ఏర్పరుచుకుని పరమేశ్వరి అయిన శ్రీమాతకు దూరంగా ఉండిపోతారు. వీరి దహరాకాశంలో బిందు రూపంలో ఉన్న పరమేశ్వరిని సాధన ద్వారా తట్టి లేపిన తన సాధకులకు అన్ని హద్దులూ చెరిపేసి, సాధకుల జ్ఞాన నేత్రాన్ని తెరిపించి, ఎంతో మక్కువతో తనలో చేర్చుకునేదే అమ్మ అయిన శ్రీమాత. అందుకనే, పరాభట్టారికను "నిరంతరా" అన్నారు.
లలితా పరాభట్టారిక సర్వాంతర్యామి, సర్వవ్యాపి. సృష్టి, స్థితి, లయములు చేస్తూ త్రికాలలో కూడా ఉన్నది. అభిన్నమైన, అఖండమైన, శాశ్వతమైన రూపంలో ఉన్నది. ఈ పరాత్పరికి హద్దులు గానీ, ఖాళీ సమయము కానీ ఉండే వీలు లేదు. ఇంతటి సర్వవ్యాపి అయిన శ్రీమాతను నమ్మి కొలిచే వారిపట్ల నిరవధికంగా అమ్మ అనుగ్రహం చూపుతునే ఉంటుంది. మామూలూగా అంతఃకరణలో ధ్యానం చేసుకునే భక్తులకు, కఠోరమైన తపస్సు చేసి తనను చేరే సాధకులకు మధ్య అమ్మ చూపే కరుణకు ఏమాత్రమూ బేధము ఉండదు. ఎటువంటి హద్దులూ ఉండవు. సర్వకాల సర్వావస్థలలో తనవారిని అందరినీ సమదృష్టితో చూసేదే అమ్మ.
ఎంత సామాన్యమైన తల్లి కూడా, తను కన్న సంతానంలో, ఒకరి మీద ఎక్కువ ప్రేమ, శ్రద్ధ, వేరొకరి మీద తక్కువ అభిమానం, ఆత్మీయత చూపించదు. మరి శ్రీమాత, జగన్మాత కదా, భక్తులకు, సాధకులకు మధ్య అంతరం ఎలా చూపిస్తుంది. అందుకనే, ఆ ఆనంద నిలయవాసిని(కాశీ), కదంబవన వాసిని "నిరంతరా" అని పిలువబడుతోంది.
శ్రీమాతను, మనలో ఉన్న అన్ని బేధ భావాలను పోగొట్టి, అంతరాలను తొలగించి, తన దగ్గరకు తీసుకునే త్రికాలజ్ఞురాలిగా గుర్తెరిగి, తనను పూజించే తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న శ్రీమాతను పూజించేటప్పుడు ఓం నిరంతరాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి