సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 

 

సామెత -340 : ఇల్లు ఈగల పాలు -దొడ్డి దోమల పాలు
****
"ఇల్లన్నంక అందరు సరింగ ఉండాలె.ఒక్కలు సరింగ లేకపోయినా ఇల్లంత ఆగమాగమే అవ్వా!"
 "అవును శెల్లే! నువ్వన్నది కరష్టే గని ఎవలిల్లు సరింగ లేక ఆగమైంది? మనూల్లె అందరిండ్లు బాగే గద!"
 "గదే అవ్వా మన కిట్టయ్య మావోళ్ళు తెల్సుగద.గాయిన ఉన్నంత కాలం సుచి సుబ్బరం అన్కుంట ఇంట్లోళ్ళకి శెప్పిందే శెప్పేవాడు.ఇల్లు అద్దం లెక్క మెర్శిపోయేది. ఇంట్లె అందరు రోగం నొప్పి లెవ్వకుండ గప్పుడే కోశి కట్టిన పూల శెండ్లోలె నిగనిగ లాడ్తుండేటోళ్ళు.
 "గాళ్ళింటికి బొయ్యొచ్చినోళ్ళు గాళ్ళ పద్దతి, యవ్వారం సూశి శానా మందిరి నేర్సుకునేటోళ్ళు."
"అవును శెల్లే! ఇల్లొక్కటే గాదు గా పసుల కొట్టం సుత సుబ్బరంగ ఉండేది. పెండ రొచ్చు తొక్కిడి వడ్డ గడ్డి తీశి ఇంటికి దూరంగా వెట్టిన పెంటగడ్డల ఏశి ఎర్వు సుత సేశేటోళ్ళు. గాళ్ళ గొడ్లు ఏ జల్మల జేసుకున్న పున్నెమో గాల్లింట్ల ఉన్నయనేటోళ్ళు. గవీటికి సుత తానాలు జేయిచ్చుడు.కుడ్తి దాగినంక వాటి మూతులు తుడ్పిచ్చుడు. గొడ్ల మందల బోతుంటే 'ఓ గియ్యి కిట్టయ్య మావోళ్ళవి సూడుండ్రి వందల మందలో ఉన్న ఊకెనో శెప్పొచ్చు అనేటోళ్ళు."
 "అవునవ్వా! గింతెందుకు గాల్లింట్ల పన్జేసే జీతగాళ్ళు సుత సుబ్బరంగ పనోల్ల లెక్క గాకుండ గా పని జేయించేటోళ్ళ లెక్క అగవడేటోళ్ళు.
 "ఎప్పుడైతే మావఁ వొయిసు మీద వడి మూలకు బడ్డడో అగ్గో గప్పన్నించి ఇంటి తరీకే మారిపోయిందవ్వా! ఎవల్ది ఆళ్ళే.ఇట్టారాజ్యం. ఇంటినిండ ఎక్కడ తిని అక్కడే కంచాలు.వొండుకున్న వాటి మీద శిబ్రేకులు సరింగ పెట్టాలె గద.గది సుత వొల్లంగక వొదిలేసుడు."శవ్వా శవ్వా! శవ్వా!" గీ నడ్మల కిట్టయ్య మావఁని  ఎట్టుండో సూట్టానికి ఎల్లిన. ఇంటినిండ గవులు ఆసన.ఈగలైతే ఇంటినిండ జుబ్బుమంటున్నాయి. మావఁ కోడలు శాయి బెడ్తనని పెట్టిచ్చింది గయ్యన్ని సూశినతర్వాత ఒక్క బుక్క సుత తాగబుద్ది గాలె.గా గిలాసు గక్కడ గిట్ల బెట్టిన్నో లేదో జుబ్బున ఈగలాలి "యాక్ థూ!డోకొచ్చినంత పనైంది అవ్వా!"
 "ఇల్లే గట్లుందంటే గా గొడ్ల కొట్టం ఇంకా అద్వాన్నం. పాపం గా బర్రెలు,ఆవులు వాటి పెండ రొచ్చులో పొర్లాడుకుంట తోకతో మీదాలిన దోమల్ని గొట్టుకుంటుంటే శానా పాపం అన్పిచ్చింది."
 అయిన గని గిన్నేళ్ళు మావఁ శేతికింద ఉండి గా మాత్తరం నేర్సుకోలేదు గాల్లేం మడుసులవ్వా"?
" మరీ గంత అనాగరీకంగనా ఉండుడు.తల్సుకుంటెనే కడ్పుల తిప్పుతుందన్కో."
గందుకే శెల్లే! గస్మంటోళ్ళని సూశే మన పెద్దోళ్ళు"ఇల్లు ఈగల పాలు- దొడ్డి దోమల పాలు " అన్నరు.గిప్పుడు గా ఇల్లు మడుసున్న ఇల్లు లెక్క ఉందా? ఇంటి నిండ ఈగల రాజ్జెం - దొడ్డంత దోమల రాజ్జెం.గా కొంప పడావ్ వడ్డట్టే వుంది.గందుకే గీ నడ్మల గా ఇంటోళ్ళు త్యాప త్యాపకు సుస్తి అయితుర్రు.వొచ్చిన ఆమ్దాని అంత గట్లనే కర్సయి పోతుండె.గాళ్ళ ఆలకాలు సూశినవ్ గద.నవిశి నవిశి మంచంల నించి లేశి తిర్గినట్టుర్రు.
"గాళ్ళ వల్ల సుట్టుపక్కల ఉన్నోళ్ళ ఇండ్లల్లకి సుత ఈగల,దోమల వొచ్చి ముసుర్తున్నయి అవ్వా!"
"గంతే వుంటది శెల్లే !నట్టం గాళ్ళకే గాదు సుట్టున్నోళ్ళకి సుత."
"గదండీ సంగతి! "ఇల్లు ఈగల పాలు -దొడ్డి దోమల పాలు" అంటే గిదే మరి. 
కామెంట్‌లు