- పిఠాపురంలో ఆధ్యాత్మిక చైతన్యం
- ఘనంగా బ్రహ్మర్షి హుస్సేన్ షా 121వ జయంతి ఉత్సవాలు
- , విస్తాలి శంకరరావు, , వేమూరి లక్ష్మీ కాంతిలకు హుస్సేన్ షా కవి పురస్కారం
- ఘనంగా బ్రహ్మర్షి హుస్సేన్ షా 121వ జయంతి ఉత్సవాలు
- , విస్తాలి శంకరరావు, , వేమూరి లక్ష్మీ కాంతిలకు హుస్సేన్ షా కవి పురస్కారం
పిఠాపురం, సెప్టెంబర్ 09 : సామాజిక, ఆధ్యాత్మిక దృక్పథమే మానవాళికి దిక్సూచి అని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి అన్నారు. మతమతాంతర విమర్శలు లేకుండా మానవుడు ఈశ్వరుడుగా పరిణామము చెందే విధానానికి దిక్సూచిగా నిలిచిన మహోన్నతమైన "షా తత్వం" గ్రంధాన్ని మానవాళికి అందించిన మహోన్నతుడు సప్తమ పీఠాధిపతి బ్రహ్మర్షి హుస్సేన్ షా అని ప్రముఖ కవి, విశ్లేషకుడు, సాహితీ వేత్త, విస్తాలి శంకరరావు అన్నారు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం సప్తమ పీఠాధిపతి బ్రహ్మర్షి హుస్సేన్ షా 121వ జయంతి సందర్భంగా ఉమర్ ఆలీషా సాహితీ సమితి ఆధ్వర్యంలో బుధవారం పిఠాపురంలోని పీఠం ప్రధాన ఆశ్రమంలో, సాహితీ సమావేశం, ఉమర్ హుస్సేన్ షా కవి స్మారక పురస్కార ప్రదానం కార్యక్రమాలు నిర్వహించారు. ఉమర్ ఆలీషా సాహితీ సమితి కార్యదర్శి దాయన చంద్రజీ సభా నిర్వహణలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ప్రస్తుత పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కవి విస్తాలి శంకరరావు, గిడుగు రామూర్తి పంతులు మనుమరాలు ప్రముఖ సామాజిక వేత్త వేమూరి లక్ష్మీ కాంతిలకు హుస్సేన్ షా కవి స్మారక పురస్కారాలను అలాగే ఒక్కొక్కరికీ 50 వేల నూట పదహారు రూపాయల నగదు పురస్కారాలను అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పురస్కార గ్రహీత విస్తాలి శంకరరావు మాట్లాడుతూ ఆధ్యాత్మిక బోధనలు, విద్యా సామాజిక అంశాలు సంక్షేమ కార్యక్రమాలు సాహిత్యాన్ని ప్రజలకు అందించడం అనే మూడు అంశాలను ప్రజలకు అందించాలానే లక్ష్యమే శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నందలి తొమ్మిది మంది పీఠాధిపతుల షా తత్వ గ్రంథమని వెల్లడించారు. 91 అధ్యాయాలతో ఈ గ్రంధాన్ని హుస్సేన్ షా రచించారని తెలిపారు. మానవుడు తన జీవితంలో ఎదుర్కొనే ప్రతి విషయానికీ ఈ గ్రంధంలో పరిష్కారం లభిస్తుందని వెల్లడించారు. ఇప్పటికే 8 సార్లు ముద్రింపబడిన మహోన్నత గ్రంధం షా తత్వ గ్రంథమని వెల్లడించారు. హుస్సేన్ షా కవి పరంజ్యోతి అనే మహత్తరమైన గేయ కవిత ద్వారా మానవుడు పరంజ్యోతిగా మారు విధానమును తెలియజేసారని పేర్కొన్నారు. మానవునిలో ఆధ్యాత్మిక జీవన తత్త్వము ఏర్పడాలంటే జ్ఞానాన్ని ప్రసాదించే సద్గురువుల విశిష్ఠత సమాజంలో విస్తరింపబడాలని అన్నారు. మతాతీత ఆధునిక మానవతా దేవాలయంగా విరాజిల్లుతున్న మహోన్నత పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అని పేర్కొన్నారు. మరొక పురస్కార గ్రహీత వేమూరి లక్ష్మీకాంతి మాట్లాడుతూ ఆధ్యాత్మిక తత్వ ప్రభోదం, సామాజిక సేవా కార్యక్రమాలను రెండు నేత్రాలుగా చేసుకుని వందలాది సంవత్సరాలుగా వేదాంత విద్యను కాలానుగుణ్యంగా మానవాళికి అందజేస్తున్న మహోన్నత పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అన్నారు. బ్రహ్మర్షి హుస్సేన్ షా కవి పురస్కారాన్ని అందుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు. తదుపరి పీఠాధిపతి ఉమర్ ఆలీషా మాట్లాడుతూ మానవునిలో ఆధ్యాత్మిక విలువలు లోపించడం వల్లనే మానవత్వపు విలువలు రోజురోజుకూ నశించిపోతున్నాయని ఆధ్యాత్మిక, తాత్త్విక జ్ఞానాన్ని తెలుసుకోక పోవడం వలన మానవుడు ద్వేషం, అసూయ, పగ, ప్రతీకారం, వంటి చెడు గుణాలకు లోను కాబడి ప్రపంచ వినాశనానికి పూనుకుంటున్నాడని ఆవేదన వ్యక్తంచేసారు. మానవుడు ఆధ్యాత్మికతను పెంపొందించుకోవడంతో పాటుగా సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా పాలుపంచుకోవాలని సూచించారు. ఆధ్యాత్మిక చైతన్యమే సామాజిక చైతన్యానికి బీజం వేస్తుందని తెలిపారు. సామాజిక నేత్రం, ఆధ్యాత్మిక నేత్రాలను వృద్ధిచేసుకుంటే తాను కోరుకునే ముక్తికి మార్గం సుగమ మౌతుందని అన్నారు. ప్రస్తుత సమాజంలో ప్రతివ్యక్తీ ఆధ్యాత్మిక, తాత్త్విక జ్ఞానాన్ని పెంపొందించు కోవాల్సిన ఆవశ్యకతను సభకు వివరించారు. ధ్యాన, జ్ఞాన, మంత్ర సాధనలతో కూడిన త్రయీ సాధనను అవలంబించడం ద్వారా మానవుడు తనలోని అరిషడ్వర్గాల ప్రభావాన్ని స్థాయి చేసుకోగలుగుతాడని తెలిపారు. బ్రహ్మర్షి హుస్సేన్ షా 121వ జయంతిని పురస్కరించుకొని సాహితీ వేత్తకు, సామాజిక వేత్తకు పురస్కారాలను అందించడం సంతోషం కలిగించిందని అన్నారు. 34 సంవత్సరాలనుండి భీమవరం కేంద్రంగా డాక్టర్ ఉమర్ అలీషా సాహితీ సమితిని విజయవంతంగా నడిపిస్తున్న సమితి సభ్యులను అభినందించారు. అనంతరం దశాబ్దాల కాలంగా పీఠానికి సేవలందిస్తున్న సభ్యులు త్సవటపల్లి మురళీ కృష్ణ, పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, డాక్టర్ పింగళి ఆనందకుమార్, కె.స్వర్ణలత దంపతులకు సభలో విశిష్ట సేవా పురస్కారాలను అందించి ఒక్కొరకీ 10 వేల నూట పదహారు రూపాయల నగదు పురస్కారాలను అందజేశారు. తదుపరి పీఠాధిపతి ఉమర్ ఆలీషాను సభలో ఘనంగా సత్కరించారు. అనంతరం అనంతపురంనకు చెందిన సాహితీ వేత్త వెంకటేశ్వరరావు రూపొందించిన సద్గురు సాయి స్వరూపం గంధాన్ని పీఠాధిపతి సభలో ఆవిష్కరించారు. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరపున విద్యార్ధినీ విద్యార్థులకు స్కాలర్ షిప్స్ పంపిణీ, కుట్టుమిషన్ల పంపిణీ, యువ వాలంటీర్లకు నూతన దుస్తుల పంపిణీ, ధాన్యపు కుచ్చుల పంపిణీ చేపట్టారు. పీఠం సభ్యురాలు ఉమా ముకుంద సంగీత పర్యవేక్షణలో సభ్యులు ఆలపించిన కీర్తనలు సభికులను రంజింప చేసాయి. ఈ కార్యక్రమంలో పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, గీతావధాని యర్రంశెట్టి ఉమామహేశ్వరరావు, పీఠం సెంట్రల్ కమిటీ సభ్యులు, ఎన్.టి.వి.వర్మ, ఎ.వి.వి.సత్యనారాయణ, సాహితీ సమితి కోశాధికారి వడ్డాది శ్రీ వెంకటేశ్వర శర్మ, వడ్డి విజయలక్ష్మి, టి.వి.వి.కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి