వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
175. భవనాశినీ (పంచాక్క్షరీ)
176. నిర్వికల్పా (చతురక్క్షరీ)
నూట డెభై ఆరవ నామ మంత్రము:
ఓం నిర్వికల్పాయై నమః
వికల్పము = ప్రత్యామ్నాయము / వైరి పక్షము (విరుద్ధ భావములు కలిగిన వారు)
రాహువును "శిరస్సు వంధ్యాపుత్రుడు" అని అంటారు. "రాహువు శిరస్సు లేని వాడు" అని ఒక అర్థం. "వంధ్యాపుత్రుడు" అనేది వ్యతిరేక భావాన్ని స్ఫురిస్తుంది. "వంధ్య = గొడ్రాలు / సంతానం కలుగనిది". మరి "వంధ్యాపుత్రుడు = గొడ్రాలికి కలిగిన కుమారుడు" అని కదా అర్థం. ఇలా శబ్దము వలన వచ్చే వ్యతిరేక భావాన్ని చెప్పేటప్పుడు, "వికల్పము" అంటారు.
తనకు ఏ విధమైన ప్రత్యామ్నాయము లేదు, అని తెలుపుతూ ప్రత్యక్షమైన అఖిలాండేశ్వరి అయిన శ్రీమహారాజ్ఞిని చూసిన వశిన్యాది వాగ్దేవతలు జగన్మాతను "నిర్వికల్పా" అని కొనియాడారు. తానొక్కతే లోకైక జనని అయిన శ్రీమాతకు నమస్కారము.
అజ్ఞానముతో లేని దానిని ఉంది అని ఊహించుకోవడం, అనిత్యమైన దానిని నిత్యమని ఊహించుకోవడం "వికల్పము" గా చెపుతారు. మనిషి యొక్క పుట్టుక, తన ప్రేరణతో జరగలేదని, అమ్మ ఆలోచనల పుణ్యమని తెలుసుకోకుండా, తానే అన్నీ అని, తనవే ఈ భార్యా, బిడ్డలు, సంపదలు అని, తానిక్కడ స్థిరనివాసిని అని, తనవలననే ఈ ప్రపంచంలో అన్ని పనులూ జరుగుతున్నాయి అని అనుకోవడమే "వికల్పము". ఎందువలన అంటే, ఇవి అన్నీ కూడా నిత్య సత్యాలు కావు. కేవలం మానవుల ఊహా జనితాలు మాత్రమే. ఈ భ్రాంతి కి కారణము, మన శరీర ధారణ మాత్రమే.
ఈ భ్రాంతి మానిసిక సంబంధమైనదే కానీ, ఆత్మ సబంధితం కాదు. పరబ్రహ్మ స్వరూపిణి అయిన శ్రీమాత నిత్య సత్యమూ, నిర్వికల్ప, నిర్లోభా అయినది జగన్మాత. ఈ స్థితిలో ఎటువంటి వికల్పములూ ఉండవు. ప్రకృతి ఒక్కటే. అమ్మే ప్రకృతి. అమ్మే ఈ చరాచర జగత్తు. కనుక, అమ్మకు ప్రత్యామ్నాయము లేదు. ఉండదు. అమ్మ చతుష్షష్టి కళలరూపాలలోనూ పరిపూర్ణ. ఆమే శ్రీవిద్య. ఆమె లేనిది, అణు మాత్రము కూడా లేదు.
అమ్మ కరుణ వలననే ఈ చరాచర జగత్తులో ప్రతీ కార్యము జరుగుతున్నది, ఈ జగత్తు సృష్టికి అమ్మే మూలం, అని ఏ సందేహాలు లెకుండా, పరమగురువు ఇచ్చిన జ్ఞానభిక్ష చేత, నిజమని త్రికరణశుద్ధిగా నమ్మి, తనను పూజించే తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న శ్రీమాతను పూజించేటప్పుడు ఓం నిర్వికల్పాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి