విజయదశమి శుభాకాంక్షలతో
🎷🎸🎻🌼🌺🌻🌸🎷🎸🎻🎺🪷🙏🌹
వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
176. నిర్వికల్పా (చతురక్క్షరీ)
177. నిరాబాధా (చతురక్క్షరీ)
నూట డెభై ఏడవ నామ మంత్రము:
ఓం నిరాబాధాయై నమః
నిరాబాధా = బాధ లేనిది / బాధింపబడనిది
తనకు సృష్టికి ముందు గానీ, తరువాత గానీ ఎటువంటి బాధలు ఉండవు అని ఎరుకచేస్తూ దర్శనం ఇచ్చిన శ్రీచక్రరాజసింహాసనేశ్వరిని చూసిన వశిన్యాది వాగ్దేవతలు శ్రీలలితా పరాభట్టారికను "నిరాబాధా" అని కీర్తించారు. అమ్మకు ఎటువంటి బాధలూ లేకపోయినా, మన బాధలను, బంధనాలనూ నశింపచేసి, బ్రోచే శ్రీమాతకు నమస్కారము.
తన తలపులతోనే, మీననేత్రి, కన్నులు తెరచి సృష్టి చేయగల తల్లి. ఈ సృష్టియే తాను. తానే సృష్టి. కనుక, ఈ సృష్టి కి ముందు గానీ, తరువాత గానీ ఏబాధా లేని ఆనందైకస్వరూపిణి అయిన, "పశుపతి ప్రియవల్లభ" అయిన "అగజ", "నిరాబాధా" అయ్యింది.
బాధలూ, వేదనలు లేని స్థితి "నిరాబాధ" స్థితి. సంకల్పము సిద్ధించకపోతే బాధ కలుగుతుంది. అనుకున్న ఫలితం, రావాలి అనుకున్న సమయానికి రాకపోతే, వేదన కలుగుతుంది. పరబ్రహ్మ స్వరూపిణి అయిన శ్రీమహారాజ్ని తలపులు జరగకపోవడం, ఫలితాలు ఇవ్వకపోవడం వంటి పరిస్థితి ఉండదు, కదా! అందుకనే, పరాభట్టారికను "నిరాబాధా" అన్నారు.
"రావణబ్రహ్మ", అసిధారా వ్రతాన్ని కూడా ఎంతో ధీరత్వంతో పూర్తి చేయగలవాడు. శివునితో రుద్రతాండవానికి సమానంగా, రుద్రవీణ వాయించగలవాడు. సకల శాస్త్ర కోవిదుడు. సకల విద్యా విశారదుడు. పరమశివుని అనుగ్రహం పరిపూర్ణంగా కలవాడు. కానీ, జగన్మాత అయిన పరమేశ్వరిని కోరుకున్నాడు, గర్వం వలన కలిగిన అహంకారముతో. కినుక వహించిన తల్లి, వైదేహి అయి జన్మించి, దాశరధికి అర్థాంగిగా వచ్చి, రావణుని చేత అపహరించబడింది. తోటి రాజులను, దేవతలను, ఋషులను, మునులను అనేక ఇబ్బందులు పెడుతున్న రావణుని వధ, రాముని ద్వారా జరిపించింది. లక్ష్మణ స్వామి పేర్చిన యాగాగ్నిలో తన తనువు పునీతం చేసుకుంది. తద్వారా, ఆ శ్రీమాత, బాధ అనేది శరీరానికే కాని, ఆత్మకు కాదు అని నిరూపణ చేసింది. కనుకనే, నిత్యకల్యాణి అయిన యోగయోగీశ్వరి "నిరాబాధా" అని పిలువబడింది.
అంబగా, సీతాదేవిగా అవతరించిన పురాణేశ్వరి.... బాధ / వేదన అనేవి పాంచభౌతికమైనవే గానీ, ఆత్మసంబంధమైనది కాదు అని పలుమార్లు చెప్పకనే చెప్పింది. ప్రతీ సారీ, తను ప్రసాదించే జ్ఞానామృతంతో, మన అజ్ఞానంను పారద్రోలి, మనలను జ్ఞాన మార్గం వైపు ప్రయాణం చేయించేది శ్రీమాతయే అని నమ్మి, తనను పూజించే తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న శ్రీమాతను పూజించేటప్పుడు ఓం నిరాబాధాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి