వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
183. నిష్పరిగ్రహా (పంచాక్క్షరీ)
184. నిస్తులా (త్ర్యక్క్షరీ)
నూట ఎనభై నాల్గవ నామ మంత్రము:
ఓం నిస్తులాయై నమః
నిః + తులా = నిస్తులా = సాటిలేనిది / పోలికలు చేయలేనిది / దృష్టాతములు లేనిది
తనకు సాటి మరియే శక్తి లేదనీ, తాను ఉపమానములు లేనిదాననీ తెలియచేస్తూ, ప్రకటితమైన పరాత్పరిని చూసిన వశిన్యాది వాగ్దేవతలు, శ్రీలలితా పరాభట్టారికను, "నిస్తులా" అని కీర్తించారు. తనకు తానే సాటిగా ప్రకిటతమై, తన వారిని అందరినీ సమదృష్టితో చూసే శ్రీమహారాజ్ఞికి నమస్కారము.
"తుల" అంటే తూకము. "నిస్తులా" అంటే తూకము వేయలేనిది. పరబ్రహ్మ స్వరూపిణి అయిన శ్రీమహారాజ్నికి సమానమైనవారు, ఆమెతో సరిసమానంగా తులతూగ గలవారు ఎవరూ ఉండరు. ఎందువలన అంటే, ఆ పరబ్రహ్మ స్వరూపిణి కి ముందు ఎవరూ లేరు. తరువాత ఎవరూ లేరు. వర్తమానంలో అసలు కానరారు. కనుకనే, శ్రీమాతను, "నిస్తులా" అని కొలిచారు, అమ్మ కరుణతో జ్ఞాన సంపన్నులైన వశిన్యాది వాగ్దేవతలు.
"హేతుదృష్టాంతవర్జితేతి"అని ఉపనిషద్వాక్యము. రామచంద్రమూర్తి లాగా ధర్మ జీవనప్రయాణం చేయాలి, బలి చక్రవర్తి లాగా దానగుణం కలిగి ఉండాలి, ధర్మరాజు లాగా ఋజువర్తన కలిగి ఉండాలి అని మనకు, మన పెద్దవారు చెప్పగా విన్నాము. ఇవి అన్నీ కూడా, మన జీవనం ఎలా ఉండాలో, సోదాహరణంగా మనకు వివరించడానికి పనికివచ్చే వాక్యాలు. అయితే, మన చరాచర జగత్తులో అమ్మను ఎవరితోనూ పోల్చలేము. అమ్మ చూపించే పనితనము, సమస్యలను దాటే నేర్పరితనము, ఓర్పు మొదలైన విషయాలలో అమ్మకు, అమ్మే సాటి. అమ్మ అంటే ఇలా ఉండాలి, అని చూపించడానికి ఉదాహరణలు ఉండవు. చూపాలి అంటే, మళ్ళీ అమ్మనే చూపించాలి. మరి, తానే నిత్య, నిరాకులా, నిర్మోహా, నిర్లేపా, అయి పరబ్రహ్మ స్వరూపిణి అయిన శ్రీమహారాజ్ని, "నిస్తులా" అయి తీరుతుంది కదా!
పోనీ, ఈ చరాచర జగత్తులో దేనితోనైనా శ్రీమాతను పోల్చుదాము అంటే, ఈ జగత్తులోని సకల జీవరాసులలో "ఆత్మ"గా ఉన్నది, శ్రీహరి ప్రియయే కదా. జగన్మాత యొక్క ఆధారము తీసుకోకుండా, ఏ శరీరమైనా మనగలదా. మన ఉఛ్వాస నిశ్వాసలలో ఉన్నది కూడా, అమ్మే కదా. అందుకే కదా అన్నారు, "శ్వాస ఉంటే శివం - శ్వాస ఆగితే శవం"అని. ఈ జగత్తు లోని అన్ని తత్వములలో వెలుగొందుతున్నది మహా కాళీ, మహా సరస్వతి, మహా లక్ష్మి రూపమైన పరదేవతా స్వరూపం "ఆద్యాశ్రీమహాలక్ష్మి"యే. అమె "నిస్తులా".
ఫలానా వస్తువు లేదా శక్తి తో సమానం అని చెప్పడానికి వీలులేని, వీలుకాని, బ్రహ్మైక స్వరూపిణి, శ్రీవిద్యా స్వరూపిణి అయిన శ్రీమహారాజ్నిని తానొక్కతే అని తెలుసుకుని, తనను పూజించే తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న శ్రీమాతను పూజించేటప్పుడు ఓం నిస్తులాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి