శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - భాగం - 206
 

వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
184. నిస్తులా (త్ర్యక్క్షరీ)
185. నీలచికురా (త్ర్యక్క్షరీ)
నూట ఎనభై ఐదవ నామ మంత్రము:
ఓం నీలచికురాయై నమః
నీల = నల్లని; చికురా = జుట్టు కలది
చిక్కటి అమావాస్య నడిరేతిరి నల్లదనంతో, మిలమిలా మెరిసే దట్టమైన, రింగురింగులు తిరుగుతూ, నున్నగా మఖమల్ వస్త్రం లాగా, చెరకుగడ లాగా పొడవైన కురలతో దర్శనం ఇచ్చిన వారాహీ దేవిని చూసిన వశిన్యాది వాగ్దేవతలు, జగన్మాతను, "నీలచికురా" అని కీర్తించారు. అజ్ఞానము అనే గాఢాంధకారములో దారితెన్నూ తెలియక కొట్టుకుపోతున్న మనలను, చిక్కటి నల్లని కేశసంపదతో ప్రకటితమై కాపాడే పరమేశ్వరికి నమస్కారము.

సాధారణంగా శరీరధారణ చేసిన మహిళలు, తమ తలపైన ఉన్న కురులను అందంగా ఉంచుకోవాలని చాలా శ్రమకు ఓరుస్తారు. తమ జత్తును నుదుటి పైకి ఉంగరాలు తిప్పుతూ ఉంచుకోవాలనీ, కురులు జఘన భాగాన్ని తడుముతూ ఉండేలా పొడవుగా పెంచుకోవాలని, తద్వారా, తమ అందాన్ని ఇనుమడింప చేసుకోవాలని తాపత్రయ పడతారు. కానీ, శ్రీమాత కురులు సహజంగానే ఎంతో పొడవుగా, ఒత్తుగా, ఉంగరాలు తిరుగుతూ, అమ్మ ముఖ సౌందర్యాన్ని ఎన్నోరెట్లు పెంపొందింప చేస్తున్నాయి. తన ప్రాణసమాన అయిన అంబ యొక్క కేశముల సౌందర్యానికి పరమేశ్వరుడు కూడా ఆ అన్నలమిన్నను చూస్తూ రెప్పవేయడం మర్చిపోయాడు. కనుకనే, లోభనాశినీ అయిన పరమేశ్వర ప్రాణ శక్తి, "నీలచికురా" అయ్యింది.
శ్రీమాత యొక్క ఆత్మ సౌందర్యాన్ని, బాహ్య సౌందర్యాన్ని ఎంతో చక్కగా వర్ణిస్తూ, "సౌదర్యలహరిని" మనకు ఇచ్చిన ఆది శంకరాచార్య ఇలా వర్ణించారు. అమ్మా! జగజ్జనని నీ దట్టమైన నల్లని కురులు, నీ ముఖపద్మము యొక్క అందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి. నీ మీననయనాల వెలుగులు ఆ నల్లని ముంగురులపై పడి, వాటి మెరుపు ఇంకా ఆనందాన్ని కలిగిస్తోంది. పద్మాలలో స్రవిస్తున్న మకరందాన్ని ఆస్వాదించడానికి సాధారణ తుమ్మెదలు ఉవ్విళ్ళూరుతాయి. కానీ, నీ ముఖపద్మము యొక్క అమృతధారలను ఆస్వాదిస్తూ మదనజనకుడే ఉన్నాడు. కనుక, పద్మముల సౌందర్యాన్ని నీ ముఖపద్మ సౌదర్యముతో పోల్చలేము. అందువలన, రుక్మిణీదేవి "నీలచికురా" అని పిలువబడుతుంది.
నల్లని కేశసంపదతో, దట్టమైన మబ్బలతో కప్పబడిన ఆకాశంలాగా కనిపిస్తూ, మబ్బుల చాటునుండి నును వెచ్చని స్పర్శను ఇస్తూ బయటకు వస్తున్న సూర్య శక్తి లాగా మనలను ఉత్తేజితులను చేయగలిగేది, శ్రీమాతయే అని పరమగురువు ద్వారా తెలుసుకుని, తనను పూజించే తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న  శ్రీమాతను పూజించేటప్పుడు   ఓం నీలచికురాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
కామెంట్‌లు