అవి జంతువుల పరుగులు! వాటి పదఘట్టానికి భూమి అదురుతోంది. ఆ శబ్దం దగ్గరయ్యే కొద్దీ అడవిలో అలజడి చెలరేగింది. నక్కల వంటి ఆకారాలు గల భయంకరమైన జంతువులు గుంపులుగా పరుగెత్తుకొస్తున్నాయి. వాటిని చూడగానే జయసేనుని మనసు కాస్త బీతిల్లిందనే చెప్పాలి. దడేలున పక్కకు జరిగాడు. ఒకటి దాదాపు పక్కనుంచి తాకినట్టు వెళ్ళింది. దైవయోగాన తృటిలో తప్పింది పెను ప్రమాదం.
"అవి భయంకర రూపంతో ఉండటమే కాదు, కనిపిస్తే క్షణంలో కరకరలాడించేవి నన్ను" అని అనుకుంటూ ఉండగానే... ఏదో అనుమానం వచ్చినట్లు తన పక్కనుంచి దాదాపు ఆనుకుని దూసుకువెళ్ళిన ఆ జంతువు ఆగి వెనకకు తిరిగి చూసింది. జయసేనుడు స్థాణువులా నిలుచిపోయాడు. ఎందుకంటే, ఏమాత్రం తాను కదిలినా తన ఉనికిని కనిపెట్టేంత సునిశితమైన దృష్టి ఉన్నట్లు తోస్తోంది. అలా రెండు అడుగులు ముందుకు వేసి, ఏమీ లేదని నిర్ధారణ చేసుకుని, మరలా ఆ గుంపును అనుసరించి కనుమరుగైపోయింది.
తను ఇక్కడ ఎంత ప్రమాదకరమైన ప్రదేశంలో ఉన్నాడో పూర్తిగా అర్థమైంది. అలాగే తన నడకను ముందుకు సాగించాడు. ఈ అడవి అంతా ఎంతో వింతగొలుపుతూ ఉంది. ఎందుకంటే ఇది అసహజమైన మాయతో కప్పబడినది. అందుకే ప్రతీదీ ఒక వింతే! సామాన్యమైన మనుష రూపంతో అడుగు కూడా పెట్టలేం. ఎంత అదృశ్య రూపంలో ఉన్నా, ఆ నక్కల కాళ్ళకింద పడితే నుజ్జునుజ్జు కావటం తథ్యం. వాడి ప్రాణాలను కాపాడటానికి వీటిని సృష్టించినట్లున్నాడు. ఎప్పుడూ చూడలేదు ఈ వింత ఆకారమైన జంతువులను! ఇంకెన్ని విచిత్రాలు చూడాలో ఇంకా ఎటువంటి ప్రమాదాలు ఎదుర్కోవాలో ఏమో! అని తలపోస్తూ ఒక కొండ లాంటి ప్రదేశాన్ని చూశాడు.
దానిని అధిరోహించి, గండాబేరుండం ఇచ్చిన ఫలాల్లో కొన్ని ఆరగించి, కాస్త నీటిని తాగి ఆకలి బాధను శాంతింపజేసుకున్నాడు. అతని అలసటకు కునుకు తోడై విశ్రాంతిని కలిగించింది. ఇంతలో కింద ఏదో భయంకరమైన శబ్దం చెవులకు సోకి దిగ్గున లేచి కూర్చున్నాడు. దూరం నుంచి ఒక రాక్షస పొట్టేలు పరుగెడుతున్న దృశ్యం కళ్ళబడింది. అది చూడటానికి పొట్టేలులా ఉన్నా, గుర్రం సైజులో ఉండటం కొంత ఆశ్చర్యానికి గురిచేసింది. దేవుని దయవలన ఈ ఎత్తైన ప్రదేశంలో ఉండబట్టి సరిపోయింది. లేనిచో తప్పించుకునే సమయం కూడా ఉండేది కాదు.
ఏది ఏమైనా ఈ అడవి అనేక ప్రమాదాలకు నెలవు. అని అనుకున్నవాడై, ఆ ఎత్తైన ప్రదేశాన్ని వీడి ముందుకు నడవటం ప్రారంభించాడు. సాధారణ గడ్డిపరకలు కూడా నిలువెత్తుగా దర్శనమిస్తున్నాయి. ముందు ఏముందో తెలుసుకోవటం కష్టతరంగానే ఉంది. అయినా తన అపూర్వమైన ఖడ్గంతో దారిని సుగమం చేసుకుంటూ చుట్టూ ఒకసారి పరికించి చూసాడు. అంతులేని అడవి... ఎటు వెళ్ళాలి? ఏమి చేయాలి? ఇంత భయంకరమైన ప్రదేశంలో వాడి పంచప్రాణాలను ఎక్కడ వెతికేది? అనుకుంటూ తోచిన వైపునకు నడవసాగాడు జయసేనుడు.
:సశేషం...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి