కొంచెం ముందుకు వెళ్లగానే ఒక అందమైన సరోవరం కనిపించింది. దానినిండా కలువలు, తామరలు వికసించి ఉన్నాయి. వాటిని చూడగానే జయసేనుని మనసు పరవశించింది. "ఆహా! ఈ భయంకరమైన అరణ్యంలో ఇంత సొగసైన దృశ్యం కనులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించింది" అనుకుంటూ అటుగా అడుగులు వేశాడు.
అంతలోనే, "దీని అందాలకు, ఆకర్షణకు లోనై ఆ నీటిలో అడుగు వేయకూడదు" అని గండాబేరుండం చెప్పినవి మరలా జ్ఞప్తికి తెచ్చుకుంటూ వెనుతిరిగే సమయానికి, నీటి నుండి ఒక మొసలి పువ్వులపై వాలిన ఒక కొంగును నోట కరుచుకోవడం చూసి అవాక్కయ్యాడు. "ఆహా! ఈ అందమైన దృశ్యం వెనుక ఎంత ప్రమాదం పొంచి ఉంది!" అని రివ్వున వెనుతిరిగి ముందుకు సాగాడు జయసేనుడు.
అతని కనులు అన్ని దిశలను పరిశీలించడం మొదలుపెట్టాయి. "గమ్మత్తుగా ఇక్కడి సమయం స్తంభించిందా ఏమి? పగలూ రాత్రీ లేదు, ఎప్పుడూ ఒకేలా ఉంటోంది. ఇది కూడా వక్రమల్లు మాయలో ఒక భాగం అనుకుంటా! అప్పుడే నా అన్వేషణ మొదలై ఒక రోజు గడిచినట్టుంది. సూర్యుని గమనం, చంద్రుని ఆగమనం రెండూ అగమ్యగోచరం" అనుకుంటూ ఆ అడవిలో ఎన్నో వింతలను చూస్తూ, వాటిని దాటుకుంటూ నడుస్తున్నాడు.
ఒక చోట శాఖోపశాఖలుగా విస్తరించిన అశ్వత్థ వృక్షం దర్శనమిచ్చింది. "ఈ కఠినమైన కానలో ఇంతటి దేవతా వృక్షం కనిపించడం అదృష్టమనే చెప్పాలి. ఇది త్రిమూర్తుల స్వరూపంగా భావిస్తారని పెద్దల నానుడి. దాని నీడన కొంతసేపు సేదతీరుదామనుకుంటే కింద ఏదైనా ప్రమాదం సంభవించవచ్చు. దానికంటే చెట్టు ఎక్కడం మంచిది" అని అనిపించింది జయసేనునికి.
అనుకున్నదే తడవుగా ఆ వృక్షరాజానికి నమస్కరించి చెట్టు పైకి ఎగబాకాడు. ఒక విశాలమైన కొమ్మపై వీపును ఆన్చి కనులు మూసుకున్నాడు. కొంత తడవు గడిచిన పిమ్మట మరలా ఏదో జంతువు పరుగిడుతూ వచ్చే శబ్దం చెవులకు సోకింది. "ఓరి దేవుడా! ఏదో ప్రమాదం ముంచుకొచ్చేట్టు అనిపిస్తోంది" అని ఊపిరి బిగబట్టి శబ్దం వచ్చిన దిశగా దృష్టి సారించాడు. ఈసారి ఆపద జంతు రూపంలో కాదు, ఒక భీకర రాక్షసుని రూపంలో రాబోతోంది. "ఇక ఆ దైవమే నాకు దిక్కు" అని భగవంతుని వేడుకున్నాడు.
అనుకున్నట్టే ఆ రాక్షసుడు ఈ అశ్వత్థ వృక్షం వద్దనే ఆగడం గమనించాడు. దాదాపు వాడు తలెత్తి చూస్తే కనిపించేంత ఎత్తులోనే ఉన్నాడు జయసేనుడు. "ఇలా అనుకుంటూ కాసింత పైకి మరియు వాడి దృష్టిలో పడకుండా వెనక్కి జరగాలి" అనుకున్నాడు. ఈ క్రమంలో ఒక చిన్న కొమ్మ విరిగి వాడి పక్కనే పడింది. చెట్టుపై ఏదో ఉన్నట్టు తోచి ఆ రాక్షసుడు తల ఎత్తి పైకి చూశాడు.
: సశేషం...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి