"అదృశ్య వీరుడు " జానపద నవల. 4️⃣0️⃣✅వ భాగం: - నాగమణి రావులపాటి


 "ఏమిటి, నీవు చెప్పేది? ఆ మాయావి వక్రమల్లు గురించా! వాడి వలననే మాకీ ప్రారబ్ధం దాపురించింది. వాడు ఏ ఉద్దేశంతో ఈ అడవిని మాయామయం చేశాడో! తెలియదు గానీ, మమ్ములను రాక్షసులుగా మార్చి వాడికి అనుకూలంగా మలుచుకున్నాడు" అని ఆ రాక్షసుడు అనగానే, "అవునా! అసలు ఏమి జరిగింది? మీరూ అంటే! ఇంకా చాలామంది ఉన్నారా? మీరు మానవులేనా? నాకంతా అయోమయంగా ఉంది, సవిస్తారంగా చెప్పు" అని జయసేనుడు అన్నాడు.
"అలాగే వీరుడా. ఇది చాలా దట్టమైన అడవి. దీని మధ్యభాగంలో ఆదివాసి తెగకు సంబంధించిన చిన్న కుగ్రామం మాది. వందమంది దాకా ఉంటారు. ఈ అడవిలో దొరికే చిన్న చిన్న జంతువులను వేటాడటం, దుంపలు మొదలైన ఆహార పదార్థాలనే కాకుండా, మా పరిధిలో మాకు కావాల్సిన ఆహారం పండించుకుంటూ జీవనం సాగిస్తున్నాము.
నేను ఈ దగ్గరలో  కొండపై వున్న శివకేశవుల ఆలయంలో పూజారిని. నేను కొన్ని పూజల ద్వారా కొంత దైవబలం సంపాదించుకున్నాను. నేను సాత్వికమైన ఆహారమే భుజిస్తాను. ఆ గూడెం వాళ్లకు మంచిచెడులు వివరిస్తాను. నన్ను అందరూ గురువుగా భావిస్తారు.
ఈ వక్రమల్లు అనే మాంత్రికుడు దేనికోసమో తెలియదు కానీ, ఈ అడవిని మాయతో కమ్మేసాడు. మా గూడెం వాసులందరినీ రాక్షసులుగా మార్చేశాడు. రాక్షస ప్రవృత్తి కలిగినవారై వాడి అడుగులకు మడుగులొత్తుతూ, విచక్షణను కోల్పోయారు.మమ్ములనే కాక ఈ అడవిలోని జంతువులను చెట్టూ చేమలను సైతం వాటి స్వరూపాలను  మార్చేశాడు.
నా ఆకారం రాక్షసుడిగా మారినా, నా ప్రవృత్తిని మాత్రం వాడు మార్చలేకపోయాడు. నాకన్నీ తెలుసు, అయినా నేను నటించడం తప్పదు కదా! అందుకే ఎవరూ చూడకుండా వారానికి ఒకసారి ఇక్కడికి వచ్చి శివలింగం తయారు చేసుకుని పూజించి, మా ప్రజలను, నన్ను మానవులుగా మార్చమనీ, ఈ మాంత్రికుని చెరనుంచి విడిపించమనీ ఎప్పటిలా ఈ వాతావరణాన్ని యధాతధంగా వుండేటట్లు. చేయమని, వేడుకుంటాను.ఈ అడవిదాటి మేము ఎటూ వెళ్ళలేము.మా వారి వలన,ఇతర జంతువుల వలన, బ్రతికి బట్ట కట్టిన వారు ఎవరూ లేరు.కంట పెడితే కడతేర్చాక మానరు. దైవయోగం వలనే నీవు నాకు కలిసావు, అసలు విషయంధ వెళ్ళావంటే నీ రుణం ఉంచుకోను, నీకు తగిన సాయం చేయగలను" అని అన్నాడు జయసేనుడు.
:సశేషం...
కామెంట్‌లు