వింత కోరికలు (విదేశీ జానపద హాస్య కథ) - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
 

ఒక ఊరిలో ఒక కుమ్మరి ఉన్నాడు. అతను కష్టపడి కుండలు చేస్తే ఆయన పెళ్ళాం వాటిని వీధివీధి తిరుగుతూ అమ్ముకొని వచ్చేది. వాళ్ళిద్దరూ చానా మంచోళ్ళు. వచ్చినదాంట్లో కొంచెం తిని కొంచెం దాచుకునేవాళ్ళు. అనవసరమైన ఆడంబరాలకు, అందని కోరికలకు దూరంగా ఉండేవాళ్లు. దాంతో గుంతలు లేని రహదారిలా వాళ్ళ సంసారం హాయిగా గడిచిపోతా ఉండేది. ఆ దంపతులకు ఒక చిన్న ఇల్లు ఉంది. ఇంటిముందు ఒక మంచి మామిడి మొక్క నాటారు. వాళ్లకు బాగా పాలిచ్చే ఒక ఆవు కూడా ఉంది. ఇంటిముందు సాయంకాలం చల్లగాలికి హాయిగా కూర్చోవడానికి ఒక అరుగు కట్టుకున్నారు. మామిడి చెట్టు పెరిగి పెద్దగై తీయని పళ్ళు ఇచ్చేది. ఆవు ఇచ్చే చిక్కని పాలు కావలసినన్ని వాడుకొని మిగతావి పసిబిడ్డలు వున్న తల్లులకు వూరికే ఇచ్చేవాళ్ళు.
ఒకసారి ఆ కుమ్మరి కుండలు చేయడానికి కావలసిన మట్టి తీసుకొని రావడానికి పక్కనే ఉన్న అడవిలోకి పోయాడు. అలా పోతూవుంటే ఒకచోట ఒక ముసలాయన కనపడ్డాడు. పాపం ఆయన దారిలో పొరపాటున చూసుకోక ఒక గాజుముక్క మీద కాలేశాడు. అంతే అది కసక్కున లోపలికి దిగింది. పాపం ఆ నొప్పికి అడుగు తీసి అడుగేయడం కష్టంగా మారింది. బాధతో విలవిలలాడిపోతా ఉన్నాడు. ఆ దారిలో బండ్లు గానీ, గుర్రాలు గానీ ఏమీ పోవు. అంతా కాలినడకనే వెళ్లాలి. చానామంది ఆ ముసలాయనను చూస్తా వున్నారే గానీ, ఎవరూ పలకరించడం లేదు. పట్టించుకోవడం లేదు. 
కానీ కుమ్మరిది నెమలీకలాంటి అందమైన మనసు కదా... దాంతో ''ఏం తాతా... ఏంది నీ బాధ. అట్లా కుంటుకుంటా నడవలేక నడుస్తా వున్నావు'' అని అడిగాడు. తాత కళ్ళనీళ్ళతో జరిగిందంతా చెప్పాడు. పక్క ఊరికి చేరాలంటే ఇంకా రెండు మైళ్ళు నడవాలి. దాంతో కుమ్మరి ''తాతా... ఈ రక్తం కారుతున్న కాలుతో అంత దూరం ఒక్కడివే నడవలేవు. అలా అని క్రూర మృగాలు తిరిగే ఈ అడవిలో విశ్రాంతీ తీసుకోలేవు. కొంచెం ఓపిక పట్టు. నిన్ను ఎలాగైనా సరే మీ ఇంటి దగ్గరకు చేరుస్తా'' అన్నాడు. ఆ కుమ్మరిది కష్టపడి పని చేసే ఒళ్ళు గదా... దాంతో ఆ ముసలాయనను ఎత్తి భుజం మీద వేసుకున్నాడు. మధ్య మధ్యలో ఆగుతూ ఆయాసం తీర్చుకుంటూ ఆఖరికి చీకటి పడే సమయానికంతా వాళ్ళింటికి చేర్చాడు. 
ఆ ముసలాయనకు కొన్ని మంత్ర శక్తులు ఉన్నాయి. కానీ అవి ప్రాణం పోతున్నా సరే సొంతానికి అస్సలు వాడుకోకూడదు. దాంతో అతను ఆ కుమ్మరితో ''నాయనా... ఎక్కడ సాయం చేయవలసి వస్తుందో అని చూసీ చూడనట్లు వెళ్లిపోతున్న కాలమిది. కానీ నువ్వు నీ పనులన్నీ పక్కనపెట్టి ఏమాత్రం పరిచయం లేని నాకోసం ఇంత కష్టపడ్డావు. నీలాంటి వాళ్ళు ఉన్నందువల్లనే ఇంకా ఈ భూమి మీద వానలు పడతా ఉన్నాయి, పసిపిల్లలు చిరునవ్వులు నవ్వుతా ఉన్నారు. అందుకే నాకున్న మంత్రశక్తులతో నీకు మూడు వరాలు ఇస్తా. ఏం కావాలో కోరుకో'' అన్నాడు.
ఆ కుమ్మరి ఆలోచించాడు. ఎంత ఆలోచించినా అతనికి ఏం కోరుకోవాలో తోచలేదు. అంతలో ఇంటి ముందున్న అరుగు గుర్తుకు వచ్చింది. హాయిగా సాయంకాలం పూట మొగుడూ పెళ్ళాలు ఇంటి ముందు కూర్చుని కబుర్లు చెప్పుకోవడానికని దానిని కట్టించుకున్నారు. కానీ ఆ వీధిలో పనీపాటా లేని సన్నాసులంతా ఎప్పుడు పడితే అప్పుడు ఆ అరుగు మీద కూర్చుని గట్టిగా అరుచుకుంటూ, నవ్వుకుంటూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. దాంతో పాపం ఆయన పెళ్ళాం ''మనం విశ్రాంతి తీసుకుందామని దీన్ని కట్టుకుంటే ఆఖరికి దీనివల్లే మనకు మనశ్శాంతి లేకుండా తయారైంది. వీళ్ళ పీడ ఎప్పుడు విరగడవుతుందో ఏమో'' అని బాధ పడేది. 
అది కుమ్మరికి గుర్తుకు వచ్చింది. 
వెంటనే ఆ ముసలాయన వంక తిరిగి ''తాతా... మా ఇంటి ముందు ఒక అరుగుంది కదా... దానిమీద మేము తప్ప ఎవరు కూర్చున్నా, కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్లు అట్లాగే దానికి అతుక్కుపోవాల. నేను లేవమని చెప్పే వరకు ఎవరూ లేవకూడదు'' అన్నాడు.
''ఏ మిద్దెలో, మేడలో... నగలో, నవరత్నాలో... కోరుకుంటాడు అనుకుంటే ఇలాంటి వింత కోరిక కోరుకున్నాడే'' అని నవ్వుకొని ''సరే... అలాగే. ఈరోజు నుంచి నువ్వు కోరుకున్నది కోరుకున్నట్లే జరుగుతుంది. ఇక రెండో కోరిక కోరుకో'' అన్నాడు.
కుమ్మరి ఆలోచించాడు. ఆయనకు ఇంటి ముందున్న మామిడి చెట్టు గుర్తుకు వచ్చింది. అది ఎండాకాలంలో తీయని పళ్ళు కాస్తుంది. తాము తిన్నన్ని తిని మిగిలినవి ఇంటి చుట్టుపక్కల వాళ్లకు వూరికే ఇస్తూ ఉంటారు. కానీ దారిన పోయే అవలాగాళ్లు కొందరు ఆ చెట్టుకు పళ్ళు కాయడం మొదలు లావు లావు రాళ్ళు తీసి వాటిని రప్ప రప్ప రప్ప కొడతా వుంటారు. కాయలు రాలడం సంగతి దేవుని కెరుక. ఆ రాళ్లు తగిలి ఇంటి కిటికీలు, తలుపులు విరిగిపోతా వున్నాయి. దాంతో ఆ కుమ్మరి పెళ్ళాం ''ఏందో తియ్యని పండ్లనిస్తాది. చల్లని నీడనిస్తాది అని దీన్ని నాటితే పళ్ళ సంగతి దేవునికెరుక. ఏ రాయి ఎప్పుడు తగిలి ఎవరి మూతిపళ్ళు రాలతాయో అని భయం భయంగా వుంది. వీళ్ళ పీడ ఎప్పుడు విరగడవుతాదో ఏమో'' అని ఒకటే బాధ పడతా ఉంటుంది. అది గుర్తుకు వచ్చి ''తాతా... మా ఇంటి ముందు మంచి మామిడి చెట్టు ఒకటి ఉంది. దాని కాయల కొరకు కనబడిన వాళ్లంతా రాళ్లు తెచ్చి కొడతా ఉన్నారు. ఆ బాధ భరించలేను. ఇకపై రాళ్లతో కొట్టినోళ్లు కొట్టినట్లు సర్రున పోయి ఆ చెట్టుకే అతుక్కుపోవాల. నేను వదలమని చెప్పేంతవరకు ఎవరూ బయటపడకూడదు'' అన్నాడు.
ఆ వింత కోరికకు ఆ ముసలాయన పక పక నవ్వుతూ ''సరే సరే... ఈరోజు నుంచి నువ్వు కోరుకున్నది కోరుకున్నట్లే జరుగుతుంది గానీ కనీసం ఆ మూడవ కోరికన్నా మంచిది కోరుకో. జీవితాంతం హాయిగా కాలు మీద కాలేసుకుని బతకడానికి కావలసినవి'' అన్నాడు.
దానికి ఆ కుమ్మరి ''తాతా... ఉండేది ఇంట్లో ఇద్దరం. సొంతంగా నిజాయితీగా సంపాదించుకుని తింటావుంటే ఉండే మజా ఊరికే తేరగా వచ్చేదాంట్లో ఉండదు. సొంత ఇల్లుంది. సంపాదించుకొని తినడానికి కావలసిన శక్తి ఉంది. ఇంకెందుకు మిద్దెలు, మూటలు'' అన్నాడు. ఆ ముసలాయన కుమ్మరి మంచితనానికి ఆశ్చర్యపోయి ''సరే నీ ఇష్టం. ఇక చివరి కోరిక కోరుకో'' అన్నాడు.
కుమ్మరి ఆలోచించసాగాడు. 
వాళ్ళ ఇంట్లో ఒక గోనెసంచి ఉంది. అందులో ఆయనకు కావలసిన వస్తువులన్నీ ఉంటాయి. వాళ్ళింటికి ఎప్పుడూ చుట్టుపక్కల వున్న చిన్నపిల్లలు వస్తుంటారు. వచ్చినవాళ్ళు ఊరికే కూర్చోకుండా, ఆడుకోకుండా ఆ సంచీలోని వస్తువులన్నీ తీసి ఇల్లంతా చెల్లాచెదురు చేస్తారు. దాంతో ఆయన పెళ్ళానికి రోజూ అవన్నీ వెతికి మరలా సంచిలో వేసేసరికి తల ప్రాణం తోకకు వస్తూవుంది. దాంతో అసలు పిల్లలే ఇంటికి రాకుండా అరిచి తరిమి వేయసాగింది. కానీ కుమ్మరికి చిన్నపిల్లలన్నా, వాళ్ళ ముద్దుముద్దు మాటలన్నా చానా ఇష్టం. ఆ సంచీలోని వస్తువులు పిల్లలు కింద పడవేయకుంటే చాలు, ఆయన పెళ్ళాం ఆ పిల్లలను ఏమీ అనదు కదా'' అనిపించింది. 
వెంటనే ''తాతా... మా ఇంటిలో ఒక గోనెసంచి ఉంది. దాంట్లో ఏమి వేసినా సరే లోపల అలాగే అతుక్కుపోవాల. నేను ఊడి రమ్మనేంతవరకు ఏదీ ఊడి రాకూడదు'' అన్నాడు. ఈ వింత కోరికకు ఆ ముసలాయన నవ్వుకుంటూ ''సరే ఈరోజు నుంచి నువ్వు కోరుకున్నది కోరుకున్నట్లే జరుగుతుంది పో'' అన్నాడు.
దాంతో కుమ్మరి సంబరంగా ఇంటికి వచ్చి జరిగిందంతా పెళ్ళానికి చెప్పాడు. ''హమ్మయ్య... మంచి కోరికలు కోరావు. ఇకపై మనం హాయిగా ఉండవచ్చు'' అని ఆమె సంబరపడింది. 
ఆ రోజు నుంచి అరుగు మీద కూర్చున్నవాళ్లు కూర్చున్నట్లు ఆ అరుగుకే అతుక్కుపోసాగారు. 
చెట్టు కాయలకు రాళ్లు విసిరిన వాళ్ళు విసిరినట్లు ఆ చెట్టుకే అతుక్కుపోసాగారు.
దాంతో ఆ విషయం ఆ నోటా ఈ నోటా పడి ఊరంతా తెలిసిపోయింది. 
అప్పటినుంచి ఆ అరుగు మీద ఎవరూ కూర్చోవడమూ లేదు, చెట్టు కాయలు కొట్టడమూ లేదు. చిన్నపిల్లలు ఇంటిలోకి వచ్చినా సంచీలోని వస్తువులు చెల్లాచెదరు కాకపోవడంతో పిల్లల్ని ఆమె ఏమీ అనేది కాదు. కుమ్మరి ఆనందంగా, పిల్లలతో మాట కలుపుతూ, కథలు చెబుతూ, ఉల్లాసంగా కుండలు చేసుకునేవాడు. 
కానీ రోజులు ఎప్పుడూ ఎక్కడా ఒకేలా ఉండవు కదా...
రాజులు బంటులవుతుంటారు. ఓడలు బళ్ళు అవుతుంటాయి.
ఒకసారి ఆ ఊరికి పెద్ద కరువు వచ్చింది. వానలు లేక మామిడి చెట్టు పూర్తిగా ఎండిపోయింది. తినడానికి పచ్చగడ్డి లేక ఆవు పాలు ఇవ్వడం మానేసింది. డబ్బులు లేక జనాలు కుండలు కొనడం ఆపేశారు. దాంతో వాళ్లకు రోజురోజుకీ ఇల్లు జరగడం కష్టం కాసాగింది. ఒక పూట తింటే ఒక పూట పస్తు పడుకోవడం మొదలుపెట్టారు. ఎలాగా బతకడం అని భయపడతా వుంటే ఒకరోజు వాళ్ళ ఇంటికి ఆ ముసలాయన వచ్చాడు. వీళ్ళ బాధలు చూసి చానా బాధపడ్డాడు. ''ఇప్పుడు నాకు వరాలు ఇచ్చేంత శక్తి లేదు. కాకపోతే నాకు ఒక బ్రహ్మరాక్షసుడు బాగా తెలుసు. వాన్ని రేపు మీ ఇంటికి పంపుతా. వాడు పెద్ద తిండిపోతు. వాన్ని గనక సంతోషపెడితే మీ కోరికలన్నీ ఇట్టే తీర్చేస్తాడు. ఈసారైనా మీ పేదరికం పోయేలా మంచి కోరికలు కోరుకోండి'' అని చెప్పి వెళ్ళిపోయాడు.
వాళ్లు ఆ తిండిపోతు రాక్షసుడిని ఎట్లా సంతోష పెట్టాలా అని రోజంతా బాగా ఆలోచించారు. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ వచ్చిన కాడికి అమ్మేసి కావలసినవన్నీ కొనుక్కొచ్చారు.
ఆ తర్వాత రోజు మధ్యాహ్నం ఆ బ్రహ్మరాక్షసుడు మంచి ఆకలితో ఆవురావుమంటూ వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఆ రాక్షసునికి ఆహ్వానం పలుకుతూ కడుక్కోవడానికి చల్లని నీళ్ళిచ్చి, తుడుచుకోవడానికి మెత్తని బట్టనిచ్చారు. పది విస్తర్లు ఒకదానితో ఒకటి కలిపి కుట్టి ఆ రాక్షసుని ముందు వేశారు. పెద్ద వెడల్పాటి గిన్నె నిండా భక్షాలు, అరిసెలు పెట్టి చెంబు నిండా నెయ్యి పోశారు. అవి తినగానే చందమామంత గుండ్రని రాగి ముద్దను వేడివేడిగా పళ్లెంలో పెట్టి బకెట్టు పల్లీల పచ్చడి గుమ్మరించారు. నంజుకోవడానికి గంపనిండా కరకరలాడే వడియాలు కారాలు పెట్టారు. బిందె నిండా తియ్యని పాయసం చేసి అందించారు. రకరకాల పిండివంటలు ప్రేమతో పెట్టారు. కడుపునిండా అవన్నీ తిన్నాక కొబ్బరికాయంత తాంబూలాన్ని వక్క, సున్నం, సుగంధ ద్రవ్యాలు సమపాళ్ళలో కలిపి అందించారు. దాన్ని నములుతూ ఎర్రగా పండిన నాలుకను అద్దంలో చూసుకుంటూ ''ఈ మధ్యకాలంలో ఇంత రుచికరమైన తిండి ఎప్పుడూ తినలేదు. రుచీపచీలేక అల్లాడుతున్న నాలికకి అమృతం లాంటి భోజనాన్ని అందించారు. చెప్పండి మీకోసం ఏమి చేయాలో'' అన్నాడు ఆనందంగా. 
అప్పుడు కుమ్మరి జరిగిందంతా చెప్పి ''అయ్యా... మా పేదరికం పోగొట్టి జీవితాంతం హాయిగా కాలు మీద కాలు వేసుకుని సుఖంగా బతికేలా వరం ఇవ్వండి'' అని అడిగాడు. దానికా రాక్షసుడు కాసేపు ఆలోచించి ''చూడు మిత్రమా... ఈ లోకంలో ఒకటి కావాలి అంటే ఒకటి వదులుకోవాల్సిందే. మీ పేదరికాన్ని ఇప్పటికిప్పుడే మాయం చేస్తాను... కానీ నేను తిరిగి ఏడు సంవత్సరాల తర్వాత మీ ఇంటికి వస్తాను. అప్పుడు మీలో ఎవరో ఒకరు నాతో పాటు అడవికి వచ్చేసి నాకు కడుపునిండా కమ్మని వంటలు చేసి పెడుతూ అక్కడే వుండాలి. మీకు ఇష్టమేనా'' అని అడిగాడు.
కుమ్మరి ఆలోచించాడు. ఇలాగే వుంటే తిండి లేక ఇంకో నెలలో చావడం ఖాయం. ఏడు సంవత్సరాలలో ఉండేది ఎవరో, పోయేది ఎవరో, ఎవరికి తెలుసు. రోజూ తిండికి వెతుక్కుంటూ చావడం కన్నా కొంతకాలమన్నా కడుపునిండా తిని కమ్మగా పడుకోవచ్చు కదా అనుకొని 'సరే' అన్నాడు. అంతే రాక్షసుడు చెయ్యెత్తి 'మీ కోరిక నెరవేరుగాక' అంటూ మాయమయ్యాడు.
ఆ మరుక్షణమే ఆ ఊరిలో భూమమ్మ తడిసి ముద్దయ్యేలా పెద్ద వాన కురిసింది. దాంతో వాడిపోయిన మామిడి చెట్టు మరలా చిగురించింది. వట్టిపోయి బక్కచిక్కిన ఆవు మరలా కళకళలాడుతూ బిందెపాలు ఇవ్వడం మొదలుపెట్టింది. కుండలకు గిరాకీ పెరిగింది. ఒకటికి నాలుగు కుండలు అమ్ముడుపోవడం మొదలైంది. నాలుగు మెతుకులకు వెతుకులాడుతున్న వాళ్లు కాస్తా నలుగురికి అన్నం పెట్టే స్థాయికి చేరుకున్నారు.
హాయిగా ఆడుతూ పాడుతూ కాలం గడిచిపోసాగింది.
బ్రహ్మరాక్షసుని గురించి వాళ్లు పూర్తిగా మరిచిపోయారు.
నెమ్మదిగా ఏడు సంవత్సరాలు గడిచిపోయాయి.
వెంటనే బ్రహ్మరాక్షసుడు ముందే చెప్పినట్టు కుమ్మరి ఇంటికి వచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం మొగుడూ పెళ్ళాలలో ఒకరు తన వెంట రమ్మని పిలిచాడు. కుమ్మరి ఏమీ చేయలేక 'సరే' అని ఆ రాక్షసునితో ఇంటి బయటకు వచ్చాడు. అంతలో వానికి తన వరాల సంగతి గుర్తుకు వచ్చింది. వెంటనే బ్రహ్మరాక్షసునితో ''అయ్యా... నా పెళ్ళాం నిన్ననే తీయని పూర్ణం కర్జికాయలు, కరకరలాడే కారంబూందీలు చేసి ఇంటిలో పెట్టింది. మనం అడవిలో పోయేటప్పుడు దారిలో తినడానికి అవి మూటగట్టుకుని వస్తాను. కాసేపు ఆ అరుగు మీద కూర్చో'' అన్నాడు. 
బ్రహ్మరాక్షసుడు పెద్ద తిండిపోతు కదా... దాంతో లొట్టలు వేసుకుంటూ ''అలాగే... పో పోయి ఒక్కటి కూడా మిగలకుండా అన్నీ తొందరగా మూటగట్టుకుని రాపో'' అంటూ అరుగు మీద కూర్చున్నాడు. 
అంతే... కూర్చున్నవాడు కూర్చున్నట్టు అట్లాగే అరుగుకు అతుక్కుపోయాడు. కుమ్మరి తినుబండరాలన్నీ మూటగట్టుకుని బయటకొచ్చి ''దా పోదాం'' అన్నాడు. బ్రహ్మరాక్షసుడు లేవబోయాడు. కానీ లాభం లేదు. ఎంత ప్రయత్నించినా ఒక్క ఇంచు కూడా పైకి లేవలేక గిలగిలా కొట్టుకున్నాడు. 
అప్పుడు ఆ కుమ్మరి ''అయ్యా... నా ఆజ్ఞ లేనిదే నువ్వు ఒక్క ఇంచు కూడా కదలలేవు. ఎప్పటికీ దానికి అలాగే అతుక్కుని ఉంటావు'' అన్నాడు నవ్వుతూ. దాంతో రాక్షసుడు ఇంక వేరే దారి లేక ''సరే మిత్రమా... నన్ను గనక వదిలిపెడితే నీకు మరో ఏడు సంవత్సరాల సమయం ఇస్తా. సరేనా'' అన్నాడు. కుమ్మరి సరేనంటూ రాక్షసుడిని వదిలివేశాడు.
నెమ్మదిగా మరలా ఏడు సంవత్సరాలు హాయిగా ఎటువంటి సమస్యలు లేకుండా గడిచిపోయాయి.
బ్రహ్మరాక్షసుడు తిరిగి వచ్చాడు.
ఈసారి ముందు జాగ్రత్తగా అరుగును పొరపాటున కూడా తాకకుండా దూరంగా నిలబడి ''మిత్రమా... దా... పోదాం'' అన్నాడు. కుమ్మరి బయలుదేరాడు. మామిడికాయల చెట్టు కిందికి రాగానే ''ఒక్క నిమిషం... మంచి మాగిన మామిడిపళ్ళు ఓ నాలుగు కోసుకుంటాను. దారిలో తినడానికి పనికి వస్తాయి'' అంటూ చెట్టెక్కి మంచి దోర దోర పళ్ళను కోసుకుంటూ ఆ బ్రహ్మరాక్షసునితో ''నీకు కూడా కావాలంటే కొన్ని కోసుకో. అమృతం లెక్క బాగా తియ్యగా ఉంటాయి'' అన్నాడు. ఆ కమ్మని పళ్ళను చూస్తావుంటే రాక్షసునికి నోరూరింది. దాంతో కొన్ని కాయలు కోసుకుందామని మామిడి చెట్టు మీద చేయి వేశాడు. అంతే సర్రున పోయి ఆ మామిడి చెట్టుకు అలాగే అతుక్కుపోయాడు. దాని నుంచి బయటపడడానికి గిలగిలా కొట్టుకున్నాడు. కానీ ఏం లాభం లేకపోయింది. అది చూసి ఆ కుమ్మరి ''అయ్యా... నాకు మరో ఏడు సంవత్సరాలు సమయం ఇస్తానంటే నిన్ను వదిలిపెడతా. లేదంటే నీ ఇష్టం. అలాగే ఆ చెట్టుకు జీవితాంతం అతుక్కొని ఉంటావు'' అన్నాడు. బ్రహ్మరాక్షసుడు ఏమీ చేయలేక 'సరే' అని ఒప్పుకొని బయటపడ్డాడు.
నెమ్మదిగా మరలా ఏడు సంవత్సరాలు గడిచిపోయాయి.
మాట ప్రకారం మరలా వచ్చాడు బ్రహ్మరాక్షసుడు.
''ఇక ఈసారి నన్ను మోసం చేయలేవు. పద'' అన్నాడు కోపంగా కుమ్మరితో.
కుమ్మరి తాను వస్తువులు ఉంచుకునే సంచీ తీసుకొని బయలుదేరాడు. కొంచెం దూరం పోయాక కుమ్మరి సంచిలో దూరి కప్పలా గెంతుకుంటూ రాసాగాడు. అది చూసి రాక్షసుడు ''ఏమది ఎందుకలా గెంతుతూ వస్తున్నావు'' అన్నాడు. దానికా కుమ్మరి చిరునవ్వుతో ''ఏమీ లేదు. ఈ సంచిలో దూరి ఇలా గెంతుతూ వస్తుంటే చాలా తమాషాగా, మస్తు మజాగా ఉంటుంది. అదీగాక కొంచెం కూడా అలసట ఉండదు. ఎంత దూరమైనా సరే చెమట పట్టకుండా చేరుకోవచ్చు'' అన్నాడు.
దాంతో ఆ బ్రహ్మరాక్షసుడు ''అలాగా అయితే ఆ సంచీ నాకు కూడా ఒకసారి ఇవ్వు. నేను కూడా గెంతి చూస్తా'' అన్నాడు. కుమ్మరి 'సరే' అని సంచీ ఇచ్చాడు. బ్రహ్మరాక్షసుడు దానిలోనికి దూరాడు. 
అంతే... ఆ సంచీకి అలాగే అతుక్కుపోయాడు. బయటికి రాలేక గిలగిలా కొట్టుకుంటూ ''నువ్వు నేను వచ్చిన ప్రతిసారీ ఏదో ఒకరకంగా మోసం చేసి తప్పించుకుంటా ఉన్నావు. ఈసారి నువ్వే చెప్పు. ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా. కానీ మోసం మాత్రం చేయకూడదు. నాకు మాట ఇవ్వు'' అన్నాడు.
దానికి ఆ కుమ్మరి ''అయ్యా... ఇప్పటికే నాకు వయసు అయిపోతావుంది. ఇంకో ఏడు సంవత్సరాలు దాటితే పూర్తిగా ముసలోన్ని అయిపోతాను. అప్పుడు వచ్చి ఆ అడవిలో నీకు ఏం సాయం చేయగలను. కాబట్టి దయచేసి మమ్మల్ని శాశ్వతంగా వదిలేయి. నీ పేరు చెప్పుకొని బతుకుతాం. నువ్వు ఎప్పుడన్నా రా. నీకు నచ్చినవన్నీ ప్రేమగా చేసి పెడతాం. అదీగాక మొగుడూ పెళ్ళాలను వేరుచేయడం తప్పుగదా'' అన్నాడు.
బ్రహ్మరాక్షసుడు బాగా ఆలోచించి ''సరే... నువ్వు చెప్పేది కూడా నిజమే. మిమ్మల్ని వేరు చేసిన పాపం నాకెందుకు. ఇక ఇక్కడే వుండండి'' అన్నాడు. 
వాళ్ళు సంతోషంగా ఆ బ్రహ్మరాక్షసునికి వారం రోజులకు సరిపడా పిండి వంటలు మంచి రుచితో చేసి ఇచ్చారు. ఆ బ్రహ్మ రాక్షసుడు వాటన్నిటినీ మూటగట్టుకొని సంతోషంగా వాళ్ళను దీవించి వెళ్ళిపోయాడు. 
**********
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Wonderful sir 👌👌