కాలంక్రీనీడ (కాలమే కాలనాగు): - అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగామ -9640748497


మనిషికి మనిషికే 
అగర్భశత్రువై
వ్యక్తిగత స్వార్థమే
ప్రేమాభిమానాలను
అడుగంటిస్తుంటే?

చిన్ననాడు ఒకరంటే మరొకరికి వల్లమాలిన ఇష్టం
కరెన్సీ నోట్లు మసకబార్చిన వైనం 

ఒకరు ఎదిగితే
మరొకరు పడదోస్తున్న తీరు 
ఈర్ష్య అసూయలు
సహజాతిసహజమై
కుట్ర కుతంత్రాలే!
నిత్య కృత్యమై 
మనిషిని మనిషే 
దోపిడి చేస్తుంటే?

శ్రమజీవనం చేతకాక 
ఎగదోయడం
పడదోయడం 
అబద్ధాలతో అంటకాగడం
తీపిమాటలతో బురిడీ కొట్టించడం

సమూహంలో మంచి మానవత్వపై ప్రసంగాలు 
ఒంటరిగున్న వేళ సాటివారి
పతనానికి పథకరచనలు

మాయికత్వమే
మానవత్వంగా ఊరేగుతూ కడుపులో కత్తులు దాచుకొని 
కరుణామయులుగా ప్రకటించుకోవడం

వేషం,భాష 
ప్రేమాతిశయం 
ఇవే తమ ఏకైక అస్త్రాలుగా
ప్రయోగిస్తూ 
పరమహంసను  
పోకిరీయంటూ  బట్టకాల్చి మీద వేయడం

నిజానిజాలు అనాథలై
అబద్ధాలే ఆత్మీయనేస్తాలే
మంచిమమత
చూపకూడని బ్రహ్మపదార్థమై

రాత్రికిరాత్రే శ్రీమంతుడవ్వాలన్న పేరాశ
కాల సర్పం సమయం కోసం చూస్తుంది 
ఈ పరమకంత్రీలను క్రీనీడై వెంటాడుతూనే ఉంది 
సరియైన కాలమ్మురాగానే
కాటేసి తీరుతుంది 
తస్మాత్ జాగ్రత్త 
మిగుల పొంగిన పాలు పొయ్యి పాలు
కాలం ఎవడికి బానిసకాదు
ప్రతీ ఒక్కరు కాలాన్ని  అనుసరిస్తూనే
మనుగడ కొనసాగించాల్సిందే
కామెంట్‌లు