రాత్రి కాస్త లేట్ గా పడుకున్నాను. అయినా నిద్ర బాగా పట్టినట్టుంది. అందుకే త్వరగానే, ఉత్సాహంగానే లేచాను. అయితే ఇంట్లో కాస్త పని ఉండటంతో వాకింగ్ వెళ్ళడం కొంత లేట్ అయింది. దగ్గర దగ్గర ఎనిమిది అవుతున్నట్టుంది టైం. పిల్లలు, పేరెంట్స్ స్కూల్ బస్సు దారి పట్టారు. పిల్లల కంటే ఎక్కువ పేరెంట్సే స్కూలు బ్యాగులు మోస్తారు. ఏంటో, ఈ పేరెంట్స్ ఉన్నారే! పిల్లలని మరీ గారాబం చేస్తారు అనిపించింది. చాల్లే, ఆ బ్యాగులు ఏమన్నా తక్కువ బరువు ఉన్నాయా అయినా ఎవరి అవసరం ఏంటో, ఎవరి శక్తి ఏంటో? వై టు బి జడ్జ్‌మెంటల్, అని మనసు హెచ్చరించింది. ఓకే, ఓకే అని దానికి చెప్తూ ముందుకు నడిచాను.
అలా వెళ్తూ ఉంటే కొంచెం దూరంలో ఒక దగ్గర ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ నుంచి కిందికి వేలాడుతున్న ఒక చీర, సెకండ్ ఫ్లోర్ బాల్కనీ నుంచి కిందికి వేలాడుతున్న ఒక బెడ్‌షీట్ కనిపించాయి. ఇలా బట్టలు వేలాడెయ్యటం వల్ల తమకు అసౌకర్యంగా ఉందనే కంప్లెయింట్స్, వెయ్యొద్దనే రిక్వెస్ట్ మెసేజులూ వస్తూనే ఉంటాయి వాట్సాప్ గ్రూపులలో. అయినా అక్కడక్కడా ఇలాటివి జరుగుతూనే ఉంటాయి. ఆ బట్టలు ఆరేసే వాళ్లకు తెలియకపోవటమో, పట్టించుకోకపోవటమో, లేదా ఏదేనా త్వరగా ఆరాలి అనే అవసరం వల్లనో ఇలాటివి జరుగుతూ ఉంటాయి.
అలా చూస్తూ, అలోచిస్తూ, నడుస్తూ ఉండగానే ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో ఏవో మాటలు వినిపించాయి. తలెత్తి చూస్తూ ముందుకి నడిచా. కాలు మడత పడ్డట్టు అయి నడక తూలి ముందికి పడబోయాను. హుమ్ … చూపు పైన పెట్టుకుని నడిస్తే ఎదురు దెబ్బలు తప్పవు మరి అనుకున్నాను. కాలు నొప్పిగా అనిపించి, కాస్త పక్కకి నడిచి అక్కడే ఒక బెంచి మీద కూర్చుండి పోయాను. అక్కడే కూర్చుని, మళ్ళీ అటు చూసా. ఆ ఫ్లాట్స్ లో ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ లో ఒకమ్మాయి పైకి చూస్తుంది, సెకండ్ ఫ్లోర్ బాల్కనీ లోంచి మరొక అమ్మాయి, ఒక పెద్దావిడ కిందికి చూస్తున్నారు.
ఫస్ట్ ఫ్లోర్ అమ్మాయి - “ఏంటండీ ఇది, పొద్దున్నే కాస్త కాఫీ కప్పులతో హాయిగా బాల్కనీలో వచ్చి కూర్చుందామంటే ఇలా మీ బెడ్షీట్లు మా మొఖం మీద వేలాడుతున్నాయి. కాస్త చూసుకోవాలి కదా!” అంటుంది.
సెకండ్ ఫ్లోర్ అమ్మాయి - “సారీ అండీ, మా అమ్మకు తెలియక వేసింది,” అంటూ ఆ బెడ్‌షీట్ పైకి లాగి, “ఇలా వెయ్యొద్దమ్మా ఇక్కడ!” అంటూ లోపలికి వెళ్ళింది.
ఆ అరుపులు వినపడి, ఏం జరుగుతుందో చూద్దామని కాబోలు, ఒక పెద్దావిడ, ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలోకి వచ్చింది. అప్పుడే ఒక వింత జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఒకావిడ, “అరుణా! ఇదేంటమ్మాయీ, మీ చీర మా సిటౌట్‌లోకి వేలాడుతుంది!” అంటూ ఫస్ట్ ఫ్లోర్‌లోని అమ్మాయిని కేకేసింది. ఎవరి తప్పు వారికి కనపడదు కదా! అని అనిపించింది ఒక క్షణం నాకు.
అంతలో ఆ అమ్మాయి కిందికి తొంగి చూసి, నాలుక్కరుచుకుని, అయ్యో సారీ ఆంటీ అంటూ చీర పైకి లాగుతూ, ఏంటత్తయ్యా ఇది అంది ఆ పెద్దావిడని చూస్తూ. అయ్యో, ఒక మడత జారి పోయినట్టుందే, చూసుకోలేదు అంటూ ఆవిడ చీర తీసుకుని లోపలికి వెళ్ళింది. ఉఫ్…, అంటూ తల పట్టుకుంది ఆ అమ్మాయి. తనకి గిల్టీగా అనిపించి ఉంటది కదా!
అక్కడ కూర్చునే నా కాలు కాస్త అటూ ఇటూ ట్విస్ట్ చేసుకున్నా కాసేపు. నొప్పి కాస్త సర్దుకున్నాక మెల్లిగా లేచి నడక సాగిస్తూ ఈ సంఘటన గురించే ఆలోచించాను. మోడ్రన్ లైఫ్ తెలిసిన అమ్మాయిలు కాస్త ఆలోచిస్తారు. పాత తరం వారి అలవాట్లు వేరు కదా! ‘హాబిట్స్ ఆర్ హార్డ్ టు డై’ అంటారు గా!
అయితే, ఇప్పుడు ఆ రెండు ఇళ్లలో ఏదైనా వాగ్వివాదం జరుగుతూ ఉండొచ్చా? ఆ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ్ని విసుక్కుంటూ ఉంటారా, మీ వల్ల మాట పడాల్సి వచ్చిందీ అని! ఇలాటి విషయాల్లో సాధారణంగా, చిన్న వాళ్ళు చెలరేగి పోతూ ఉంటారు, పెద్దవాళ్ళు చిన్న బుచ్చుకుంటూ ఉంటారు మరి.
ఆ…, అంతగా ఏం ఉండదులే అనూ! నువ్వు ఎక్కువ ఆలోచించేస్తున్నావు! ఇప్పుడు వాళ్లేమైనా తగూపడ్డారా? ఈగోలకు పోకుండా వెంటనే సారీ చెప్పేసుకున్నారు. అంతేనేమోలే! నిజమే, ఆ పిల్లలను మెచ్చుకోవాలి. వాదులాడుకోలేదు.
సరే, మరి ఇంతకీ, ఇప్పుడు, ఆ పెద్దవాళ్ళు ఏమనుకుంటూ ఉండి ఉంటారు? ఏంటో ఈ పట్నం అలవాట్లు! మనింట్లో మనం బట్టలారేసుకుంటే తప్పుట! అనుకుంటూ ఉండొచ్చు. మరి ఆ ఇద్దరమ్మాయిలూ ఏమనుకుంటూ ఉండి ఉంటారు అనుకున్నాను. ఈ అత్తగార్లున్నారే…! అనుకుంటున్నారా. మ్…మ్… ఇద్దరూ అత్తగార్లు కాదేమో, అయితే, ఈ పెద్దోళ్ళున్నారే…! అనుకుంటున్నారా…?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి