ఉదయం లేవగానే ఫోను లోకి చూడటం, అలా చూస్తూ టైం గడిపేయటం, ఇక ఇప్పుడు ఏం వెళతాంలే, అని వాకింగ్ వాయిదా వేయటం జరిగిపోతుంటుంది అప్పుడప్పుడు. ఈ రోజు కూడా అలాగే ఫోను చూస్తూ ఉండగా ‘పమిడికల్వ మధుసూదన్’ గారి డోపమైన్ సీక్రెట్, 'Temptation Bundling’ వీడియో కనపడింది.
‘Pair something you want to do with something you should do!’ కొన్ని ఇష్టమయిన పనులలో కలిగే ఇన్స్టంట్ ఆనందం కోసం అవసరమైన పనులు వాయిదా వేయొద్దనీ, ఆ అవసరమైన పనితో ఒక బాగా ఇష్టమయిన పనిని జోడించి చేసుకోవాలని ‘జేమ్స్ క్లియర్, చెప్పిన ‘ఆటమిక్ హాబిట్స్’ గురించిన విశ్లేషణే ఆ వీడియో సారాంశం.
అది చూసి కూడా వాకింగ్ వాయిదా వేయటం బుద్దిగల పని కాదు కదా! అని అనుకుని వెంటనే లేచి, వాకింగ్ కోసం పరిగెత్తాను. మరి ఇప్పుడు, ఎంతో అవసరమైన నా వాకింగ్ తో ఏం కలపాలి అనుకోగానే ఇంకేముంది అనూ నీ ‘వాకింగ్ కబుర్లే’ అని టక్కున చెప్పింది మనసు. ఇంకేం పద, ఇవాళ ఏ కబురు దొరుకుతుందో చూద్దాం అనుకుంటూ నడిచాను.
ఉదయం ఏడున్నర సమయం వాతావరణం హాయిగా ఉంది. అలా చకచకా నడుస్తూ చుట్టూ గమనించాను. నా ముందు చాలా మంది, ఒంటరిగానూ, జంటలుగానూ నడుస్తున్నారు. అబ్బో ఇవాళ చాలామందే కనపడుతున్నారే! వాతావరణం బాగుండటం వల్లనేమో అనుకున్నా.
అలా అనుకుంటూ ఉండగా టక్కున అనిపించింది – హేయ్, ఈరొజు నేను కరెక్ట్ దిక్కులో నడుస్తున్నట్టున్నానే, అంటే అందరూ నా ఎదురుగానే నడిచి వెళ్తున్నారు, నన్ను దాటుకునీ వెళ్తున్నారు. ఆపోసిట్ డైరెక్షన్ లో ఎవరూ లేరు, అనుకోగానే నాకు ఇంతకు ముందు వచ్చిన ఒక అనుమానం గుర్తొచ్చి పెదవులపైకి చిరునవ్వు వచ్చింది. ‘అందరూ నాకు ఆపోసిట్ డైరెక్షన్ లో నడుస్తున్నారు. ‘ఏ దిక్కు నడవాలి? ఏ దిక్కు నడిస్తే మంచిది?’ అన్నదే ఆ అనుమానం.
Good observation!, అని నన్ను నేను మెచ్చుకుంటూ అలా నడుస్తూ ఉండగా అసలు వాకింగ్ టైంలో అందరూ ఏం చేస్తారు? అనే డౌట్ వచ్చింది. మరి డౌటు వస్తే తీర్చుకోవాలి కదా! ఇక నా వాకింగ్ నేను చేస్తూనే, ఒక్కొక్కరినీ సైలెంట్ గా గమనిస్తూ ముందుకి నడిచాను.
ఒకతను ఫోన్లోకి చూస్తూ నడుస్తున్నాడు. ఒక జంట వీడియో కాల్ లో ఉన్నారు. బహుశా ఎవరో దూరంగా ఉన్న కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నట్టు ఉన్నారు. ఒకరిద్దరు హెడ్ ఫోన్స్ పెట్టుకున్నారు, బహుశా పాటలు వింటున్నారేమో. ఒకతను ఇయర్ పాడ్స్ పెట్టుకుని ఎవరితోనో మాట్లాడుతున్నారు. ఆఫీస్ రిలేటెడ్ కాల్ అయ్యుంటుంది. ఏదో సీరియస్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. ఇంత పొద్దున్నే ఆఫీస్ కాలా? ఏమోలే, ఏదైనా ఆఫ్ షోర్ కానీ, లేదా, ప్రీ ప్లానింగ్ లాటివి అయ్యుండొచ్చు! మరో ఇద్దరు ఇయర్ పాడ్స్ పెట్టుకుని ఎవరితోనో నవ్వుతూ జోకులేస్తూ మాట్లాడుతున్నారు. అలా కొంతదూరం వెళ్ళి ఒక ఆవిడ పక్కగా నడుస్తూ ఉండగా లలిత సహస్ర నామం వినపడుతూ ఉంది. తన భుజానికి తగిలించుకున్న చిన్న బ్యాగ్ లో ఫోన్ ఆన్ చేసి పెట్టుకుని, అది వింటూ వాకింగ్ చేస్తూ ఉంది.
అలా అందరినీ చూస్తూ ఉంటే అనిపించింది, మ్…మ్…మ్…మ్…. అందరూ వాకింగ్ తో పాటు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. ఒక అవసరమయిన అలవాటు కోసం లేదా ఒక కష్టమయిన పనికి ఒక ఇష్టమయిన దాన్ని కలిపేస్తున్నారు. సో….'Temptation Bundling’, is happening everywhere. జేమ్స్ క్లియర్ గారో, మధుసూదన్ గారో, వీటి గురించి చెప్పే పనిలేదు కదా, అని నేను నవ్వుకుంటూ ఉండగా…
ఒక నగ్న సత్యం మనసున మెదిలింది. ఎక్కడా మనిషి ఫోనుని వదలలేదు కదా! అందరికీ ఇష్టమయినది ఫోనా? లేక ఫోన్లో దొరికేవా? అందరికీ కావలసింది ఫోన్లోనే దొరికితే ఇక చుట్టూ చూసేదెవరు?
ఇంతకీ, మనిషి ఫోనుని వదలలేకపోతున్నాడా? లేక ఫోను మనిషిని వదలనంటుందా?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి