చక్కని రాజ మార్గము లుండగ….!: - అనురాధ బొడ్ల (సముద్రాల)-9989566696
 

ఈ రోజు సాయంత్రం వేళ వాకింగ్ కి బయలుదేరాను. ఆదివారం కనుకేమో, అంతటా సందడి వాతావరణం ఉంది. పిల్లలు సైకిల్స్ పైన, కిక్ స్కూటర్స్ పైన, స్కేట్ బోర్డ్స్ మీద రయ్యి రయ్యిన అటూ ఇటూ వెళ్తూ ఉన్నారు. జనాలు కూడా జంటలు గానూ, గుంపులుగానూ, కూర్చున్నవాళ్ళు కూర్చుని ఉన్నారు. నడిచే వాళ్ళు నడుస్తూ ఉన్నారు. నడిచే వాళ్ళలో యంగ్ కపుల్స్ ఎక్కువ కనపడ్డారు. ఇవాళ ఉద్యోగాలు లేవు కదా! రిలాక్సింగ్ మోడ్ లొ ఉన్నట్టున్నారు.‘  
ఎవరి దారి వాళ్ళది. ఎవరి మూడ్ వాళ్ళది. 
నేనూ నా దారిలో నడుస్తూ స్పోర్ట్స్ ఎరేనా దగ్గరికి చేరుతుండగానే, పిల్లల అల్లరి, కేకలు పెద్దగా వినపడుతున్నాయి. సహజమే కదా, ఆదివారం సందడి ఇక్కడేగా ఎక్కువ ఉండేది. మామూలు రోజుల్లో అయితే పిల్లలందరూ ట్యూషన్లతో, హోంవర్కులతో బిజీ. ఆదివారమేగా ఆటవిడుపు వాళ్ళకి. 
మా కమ్యనిటీలో స్పోర్ట్స్ ఎరేనా చాలా పెద్దది. ఆ ఏరియా అంతా నెట్స్ తో కవర్ చేసి ఉంటుంది. అందులోనే, అన్ని రకాల ఆటలకి సెక్షన్స్ గా ఉంటాయి. టెన్నిస్ కోర్ట్, ఫుట్బాల్ కోర్ట్, క్రికెట్ కోర్ట్, వాలిబాల్ కోర్ట్, ఇలా విభజించి ఉంటాయి. ఏది ఆడుకునే వాళ్ళు అది ఆడుకుంటూ ఉంటారు. ఈ రోజు అన్ని కోర్టులూ నిండుగా ఉన్నాయి. 
అలా ఆ  స్పోర్ట్స్ ఎరేనా పక్కగా నడుస్తుండగా, ఒక బాల్, బయటకు పడింది. అక్కడ ఆడుకునే ఒక పదేళ్ళ అబ్బాయి, ఆ నెట్ పైకి ఎక్కి, బయటకు దిగి, ఆ బాల్ తీసుకుని నెట్ లోపలికి విసిరేసాడు. అక్కడ ఉన్న పిల్లలు, అరే వద్దురా, అటునుంచి వెళ్ళు అంటున్నా, ఆ అబ్బాయి వినిపించుకోలేదు. ఆ తరువాత మళ్లీ ఆ నెట్ పైకి ఎక్కి లోపలికి దూకబోతుండగా, గమనించిన గార్డ్ విజిల్ ఊదుతూ పరిగెత్తుకొచ్చాడు.  గార్డ్ చూసేసాడు అన్న కంగారులో ఆ అబ్బాయి గబుక్కున లోపలికి దూకాడు. బోర్లా పడ్డాడు. అయ్యో! అనుకుంటూ కంగారుగా నెట్ దగ్గరికి వెళ్ళాను. లోపల సేఫ్టీ మ్యాట్స్ ఉన్నాయి. ఏం తగల్లేదు ఆ అబ్బాయికి. పిల్లలందరూ నవ్వుకున్నారు. 
  ఏంటో ఈ పిల్లలు! చక్కగా ఆ ఎంట్రెన్స్ వేపు వచ్చి తీసుకోవచ్చు కదా! సరయిన దారిలో నడవకుండా, ఈ వెధవ సాహసాలు ఎందుకు? అని గొణుక్కున్నా. సర్లే అనూ, అందులో ఏం ఫన్ ఉంది? నీలాగా అరవయిలో ఉన్నారా వాళ్ళు? పిల్లలు అలా ఉంటేనే మజా! హా… వాళ్ళ మజా, పెద్దవాళ్ళకు సజా! అనుకుంటూ ముందుకి నడిచా. 
మొన్న, ఆటోలో వచ్చేటప్పుడు, ఏం చేసాడు ఆటో డ్రైవర్?  నేను గమనించే లోగా, ఆటో టక్కున రాంగ్ రూట్ లో ఇంటి వేపు తిప్పాడు. ఏయ్ బాబూ, ఇదేంటి అంటుంటే, యూటర్న్ దూరంగా ఉంది, అంటూ స్పీడుగా దూసుకొచ్చి కమ్యునిటీ గేటు ముందు ఆపాడు. ఏంటయ్యా ఇది? ఇది సేఫ్ కాదు, అని నేను కోప్పడితే, ట్రాఫిక్ లేదులే అమ్మా, ఏం కాదు, ఊరికే భయపడతారు మీ పెద్దోళ్ళు, అంటూ నాకే పాఠం చెప్పాడు. బాబూ, పొరపాటు చేసి, ఏదయినా జరిగితే, తరువాత అందరం ఏడవాలి. రాంగ్ రూట్లు ఎప్పుడూ ప్రమాదమే. జాగ్రత్తగా ఉండాలి కదా! అని కోప్పడ్డా! వచ్చేసిన తరువాత ఏం చెయ్యలేను కానీ, అతనికి రేటింగ్ మాత్రం రెండు స్టార్లే ఇచ్చా. 
అయినా పెద్దవాళ్ళు మాత్రం కరెక్ట్ గా నడుస్తారా ఏంటి? మొన్నటిదాకా, గణపతి పండల్  దర్శనాల దగ్గర, ప్రసాదాల  దగ్గర ఎంతమంది క్యూలు జంప్ చెయ్యలేదు? లేదులే, ఇక్కడ అంతా ఎడ్యుకేటెడ్ కమ్యునిటీ. అలా ఏం జరగలేదు. 
అవునా, గుర్తు తెచ్చుకో. అమ్మో! క్యూ  చాలా ఉంది, అని పక్కనుంచి ముందుకి వెళ్ళిపోయి, ఒక అరటిపండు తీసుకుని వెళ్లిపోలేదూ నువ్వు? అవును, ఒక మూడు రోజులు పారాయణంకి వచ్చినప్పుడు, అది మధ్యాహ్నం వేళ. ఇంట్లో భోజనాల పని ఉంది. అయినా నేనేం ప్రసాదాలు అన్నీ తీసుకోలేదు కదా! ఏదో ప్రసాదం అసలు తీసుకోకుండా వెళ్ళకూడదని, ఎవరినీ డిస్టర్బ్ చెయ్యకుండా, అలా ఒక పండు తీసుకుని వెళ్ళిపోయాను. అదే మరి,  సరయిన దారిలో వెళ్ళకపోవటం అంటే అని చెప్పింది మనసు. అదేం కాదులే! అప్పుడప్పుడూ అవసరాన్ని బట్టి  తప్పవు మరి.
అంతే అంటావా? అలా అవసరాన్ని బట్టీ, సమయాభావాన్ని బట్టే, అన్ని చోట్లా సరయిన మార్గాల్లో వెళ్ళకుండా షార్ట్ కట్స్ ఎన్నుకుంటారు. ఆఫీసు పనుల్లో, ఓట్లలో, సీట్లలో, రోడ్డు మీద డ్రైవింగులలో, ఒకటేమిటి అన్ని చోట్లా అదే జరుగుతుంది.
చిన్న విషయం తప్పు కానప్పుడు, పెద్ద విషయం ఎలా తప్పు? అయినా చిన్నది, పెద్దదీ అని ఎవరు నిర్ణయించాలి? అంటూ ప్రశ్నించసాగింది మనసు. ఏయ్, కాసేపు నోరు ముయ్యి నువ్వు. ఏంటో అంతా గందరగోళం ప్రశ్నలు వేస్తావు. హాయిగా రిలాక్సింగ్ మూడ్ లో నడవనివ్వవు! ఖాళీగా ఉంటే చాలు, ఓ అంటూ కుమ్మేస్తావు! అంటూ తల విదిలించేసి ముందుకి నడిచాను. 
అలా నడుస్తూ వెళ్తుండగా, ఒక పెట్ పేరెంట్, తన చిన్న కుక్క పిల్లని, చెయిన్ పట్టుకుని, బేస్మెంట్ నుండి పట్టుకుని వస్తున్నాడు. బేస్మెంట్ లోకి ఆ వేపు నుంచి వెహికిల్స్ వెళ్ళకుండా, ఒక ఐరన్ గ్రిల్ అడ్డంగా పెట్టి ఉంది. ఆ పేరెంట్, గ్రిల్ పక్కనే ఉన్న చిన్న దారినుంచి  దాన్ని బయటకు తీసుకొస్తుంటే, అది మాత్రం, ఆ దారిలో రాకుండా ఆ గ్రిల్ లోంచి దూరి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుంది. 
భలే కుక్క! దీనికి కూడా సరయిన మార్గం వద్దా! మ్...మ్...మ్… ఇదీ చిన్నపిల్లే కదా, అనుకుంటూ ఆ కుక్క  పిల్లనే ముచ్చటగా చూస్తూ, నా దారి నేను చూసుకోకుండా నడిచాను. అలా నడుస్తూ, ఎత్తుగా ఉన్న నేల తట్టుకుని, ఒక్కసారిగా ముందుకి పడబోయాను. కాస్త నిలదొక్కుకుని, నిలబడి చూద్దును కదా, చక్కని రోడ్డంతా వదిలిపెట్టి, నేను ఒక మూలగా నడుస్తున్నా. అక్కడ నేల కాస్త ఎగుడుదిగుడుగా ఉంది. 
అది చూడగానే, చక్కనీ…రా...జా…మార్గములుండగా…., అంటూ, త్యాగరాజు కీర్తన పాడేసింది మనసు.
కామెంట్‌లు