రాధమ్మ భక్తుడు గోవింద దాస్: - - యామిజాల జగదీశ్
 

బర్సానాలో గోవింద దాస్ అనే భక్తుడు నివసించేవాడు. ఆయనకు మునియా అనే ఒక్కగానొక్క కుమార్తె ఉండేది. గోవింద దాస్ ప్రతిరోజూ తన పనులన్నీ ముగించుకుని, సాయంత్రం మందిరానికి వెళ్లి రాధమ్మను దర్శించుకునేవాడు. అక్కడ నివసించే సాధువులకు సేవలు చేస్తూ, వారితో ఆధ్యాత్మిక విషయాలపై చర్చిస్తూ ఆనందంగా గడిపేవాడు.
ఒకరోజు వృద్ధుడైన ఓ సాధువు, తన సామాన్లు మోసేందుకు సాయం చేయమని, తనతో పాటు నందగావ్‌కు రావాలని గోవింద దాస్‌ను కోరాడు. ఆయన ఎంతో సంతోషంగా అంగీకరించాడు. మరుసటి రోజు తెల్లవారుజామునే సాధువు సామాన్లతో పాటు స్వామివారి విగ్రహం ఉన్న పెట్టెను కూడా మోస్తూ, చెప్పులు లేకుండానే ఆయన వెంట బయలుదేరాడు.
వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా సాధువు దారిలో పలుమార్లు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. అందువల్ల నందగావ్ చేరుకోవడం ఆలస్యమైంది. అక్కడికి చేరుకున్నాక, కాసేపు విశ్రాంతి తీసుకుని భోజనం చేసి వెళ్లమని సాధువు గోవింద దాస్‌ను కోరాడు. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించాడు.
“బర్సానాలో వృషభాను మహారాజు కుమార్తెగా జన్మించిన నా ప్రాణప్రియు రాలు రాధారాణి, నందగావ్‌లో వివాహం చేసుకుని నివసిస్తోంది. అలాంటప్పుడు ఈ ఊరిలో కనీసం నీళ్లు తాగినా అది నాకు పాపమే అవుతుంది” అని గోవింద దాస్ అన్నాడు.
ఆయనకు రాధారాణిపై ఉన్న అపారమైన ప్రేమను, అచంచలమైన భక్తిని చూసి ఆ వృద్ధ సాధువు కళ్లలో ఆనందభాష్పాలు ఉబికాయి.
తిరుగు ప్రయాణంలో మండుతున్న ఎండ, వేడెక్కిన ఇసుకను తట్టుకోలేక గోవింద దాస్ ఒక చెట్టు నీడలో స్పృహ తప్పి పడిపోయాడు. తన భక్తుడి దీనస్థితిని చూసిన శ్రీకృష్ణుడు, అతన్ని ఎలా కాపాడాలో తెలియక రాధారాణి వద్దకు వెళ్లి జరిగినదంతా వివరించాడు.
తన ప్రియభక్తుడి బాధను చూడలేని రాధారాణి, మునియా రూపాన్ని ధరించి, ఆహారం, నీరు తీసుకుని గోవింద దాస్ వద్దకు చేరుకుంది.
“నాన్నా! లేవండి. ముందు కాస్త నీళ్లు తాగండి. ఈ ఆహారం తీసుకుని ఆకలి తీర్చుకోండి” అంటూ ఆయనను లేపి, స్వయంగా నీళ్లు తాగించి, భోజనం చేయించింది.
ఆ తరువాత, “నాన్నా! ఇంటికి అతిథులు వచ్చారు. మీరు త్వరగా ఇంటికి రండి” అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
కాసేపటికి తేరుకున్న గోవింద దాస్, ఎలాగోలా ఇంటికి చేరుకున్నాడు. తన ప్రాణాలను కాపాడిన కుమార్తెపై అపారమైన ప్రేమతో ఆమె పాదాలపై పడి కృతజ్ఞతలు చెప్పాడు.
అయితే మునియా ఆశ్చర్యంగా, “నాన్నా! నేనెక్కడికీ వెళ్లలేదు. ఇంటికి అతిథులు కూడా ఎవరూ రాలేదు” అని చెప్పింది.
ఆ మాటలు విన్న గోవింద దాస్ ఒక్కసారిగా నిశ్చేష్టుడయ్యాడు. వెంటనే ఆయనకు అసలు విషయం అర్థమైంది.
తన ప్రాణప్రియురాలైన రాధారాణే, తన భక్తుడి ప్రాణాలను కాపాడేందుకు కుమార్తె మునియా రూపంలో వచ్చి, ఆహారం పెట్టి, నీళ్లు తాగించిందని గ్రహించాడు.
ఆయన కళ్ల నుంచి ధారగా కన్నీళ్లు ప్రవహించాయి.
“అమ్మా రాధారాణీ! నా కారణంగా నువ్వు ఇంతటి మండుటెండలో కష్టపడాల్సి వచ్చిందా తల్లీ! నువ్వే వచ్చావని గుర్తించలేకపోయానే! నా ప్రాణాలను కాపాడేందుకు నువ్వే స్వయంగా వచ్చావు. నీ అపారమైన కరుణకు నేను ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను తల్లీ!” అంటూ గోవింద దాస్ హృదయం ద్రవించిపోయింది.
తన భక్తుడి కోసం స్వయంగా వచ్చి సేవ చేసిన రాధారాణి ప్రేమను తలచుకుంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఆ రోజు నుంచి గోవింద దాస్ జీవితం పూర్తిగా మారిపోయింది.
తన ప్రాణాలను కాపాడిన ఆరాధ్య దేవత రాధారాణిని మరోసారి దర్శిం చుకునే క్షణం కోసం ఎదురుచూస్తూ, ఆమె దివ్యస్మరణలోనే తన జీవితాన్ని గడపసాగాడు.
రాధారాణి కరుణకు హద్దుల్లేవు. ఆమెను హృదయపూర్వకంగా ప్రేమించే భక్తుడి కోసం, అవసరమైతే స్వయంగా వచ్చి సేవ చేయడానికి కూడా ఆమె వెనుకాడదు.
కామెంట్‌లు