నా తప్పులు...:- - యామిజాల జగదీశ్
 

గత నిర్ణయాలపై నిశ్శబ్ద సమీక్ష
జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, 
కేవలం విజయాలు మాత్రమే గుర్తుకురావు. 
కొందరు మనుషులు,
 కొన్ని నిర్ణయాలు, 
కొన్ని మాటలు, 
కొన్ని మౌనాలు... 
వీటన్నింటి మధ్య 
మన తప్పులు కూడా నిలదీస్తాయి
కొన్ని తప్పులు చేసినప్పుడు 
అవి తప్పులని అనిపించలేదు. 
ఆ సమయంలో అవే సరైనవే అనుకున్నాను
నా భావాలు సరైనవని 
నమ్మాను. 
నా కోపం న్యాయమైనది 
అనుకున్నాను. 
కొన్నిసార్లు నా బాధనే పూర్తి నిజం అని భావించాను
ఎవరైనా నన్ను బాధపెట్టినప్పుడు, వాళ్లతో అనకూడని మాటలు అనే ఉంటాను
నన్ను ప్రేమించిన ఒక వ్యక్తి ఎప్పుడూ నాతోనే ఉంటాడనే ధీమాతో నిర్లక్ష్యం చేసి ఉండవచ్చు.
నన్ను నిజంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన ఒకరితో మాట్లాడే సమయంలో మౌనంగా ఉండి ఉండవచ్చు.
క్షమాపణ చెప్పాల్సిన చోట పట్టుదలతో ఉండి ఉండవచ్చు.
ఆ పట్టుదలే ఆత్మగౌరవం అని పొరబడి ఉండవచ్చు.
కొన్నిసార్లు నా తప్పును 
ఒప్పుకోవడం కంటే, 
నా పనిని సమర్థించుకోవడానికి కారణాలు వెతికి ఉండొచ్చు
కానీ 
కాలం గడిచాక అర్థమవుతోంది...
ప్రతి తప్పు వెనుక 
ఒక చెడ్డ మనిషి ఉండాల్సిన అవసరం లేదు. 
కొన్ని తప్పుల వెనుక అవగాహన లేని ఒక మనిషి ఉండవచ్చు. 
తొందరపడిన మనస్సు ఉండవచ్చు.
గాయపడిన మనస్సు ఉండవచ్చు.
 భయపడిన మనస్సు ఉండవచ్చు.
అందుకే నా తప్పులను దాచాల్సిన అవసరం లేదు.
అలాగే, చేసిన ప్రతి తప్పు కోసం జీవితాంతం నన్ను నేనే శిక్షించుకోవలసిన పని కూడా లేదు.
తప్పు తెలుసుకోవడం నేరభావంలో మునిగిపోవడానికి కాదు. అదే తప్పు మళ్లీ చేయకుండా జాగ్రత్తపడటం
ఎవరికైనా క్షమాపణ చెప్పాల్సి వస్తే చెప్పవచ్చు. 
సరిదిద్దుకోవాల్సిన సరిదిద్దుకోవచ్చు. 
పోగొట్టుకున్న నమ్మకాన్ని వెంటనే తిరిగి పొందలేకపోయినా, నా మార్పు నిజమైనది అని నా పనుల ద్వారా చూపించవచ్చు.
కొన్ని తప్పులకు క్షమాపణ దొరకకపోవచ్చు. 
కొన్ని సంబంధాలు మళ్లీ తిరిగి రాకపోవచ్చు. 
కొన్ని కథలకు మనం కొత్త ముగింపు రాయలేను
కానీ దాని నుంచి ఒక మంచి మనిషిగా బయటకు రావచ్చు.
నా బాధను ఒప్పుకోవడం కోలుకోవడం.
నా తప్పును ఒప్పుకోవడం ఎదుగుదల.
అదే తప్పు నుంచి నేర్చుకోవడం మార్పు.
నేను చేసిన తప్పులు నా పూర్తి గుర్తింపు కాదు.
కానీ వాటి నుంచి నేను ఏమి నేర్చుకున్నాను అనేదే, ఈరోజు నేనూ ఎవరో మెల్లగా నిర్ణయిస్తుంది.
కామెంట్‌లు