అక్క ఇంటికి పండుగకు రుక్కు వచ్చింది. అక్కడ ఇద్దరూ ప్రొద్దున్నే చిక్కగా కల్లాపి జల్లి, చూడ చక్కని ముగ్గులు వేశారు. అక్కడే కూర్చున్న రుక్కు వాళ్ళ అమ్మమ్మ పచ్చి వక్కలు నమలలేక అవస్థ పడుతూ... కాస్త ముక్కలుగా చేసి ఇమ్మని రుక్కుని అడిగితే...ఆ వక్కలన్నీ చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇచ్చింది. వాళ్ళ అక్క దర్జీ దగ్గరికి వెళ్ళి బట్టలు తెమ్మని చెప్పిందని రుక్కు తన అక్క బాబుకి కుట్టిన ముక్కు పొడుం రంగు క్రొత్త చొక్కా, లాగు అడిగితే కుట్టి ఉంచానని ఎంచక్కా కాగితంలో టక్కున చుట్టి ఇస్తే అవి పుచ్చుకొని ఇంటికి చక్కా వచ్చింది. రుక్కును చూసి పరిగెత్తుకు వస్తూ...బొక్క బోర్లా పడి గుక్క పట్టి ఏడుస్తున్న అక్కా వాళ్ళ బాబును రుక్కు ఎత్తుకుని వాడి చెక్కిలిపై కన్నీరు తుడిచి చక్కలిగింతలు పెట్టి నవ్వించి, వాడితో దాగుడుమూతలు ఆడుతూ... గోడ ప్రక్కన నక్కితే కనుక్కోలేక వాడు బిక్క మొహం వేస్తే ఫక్కున నవ్వి, వాడిని చంకన ఎక్కించుకుని రహదారిలో ఆ ప్రక్క ఈ ప్రక్క తిప్పి ఎండకి ఉక్కపోతగా ఉందని ఇంటికొచ్చి మూడు రెక్కలున్న పంకా వేసి వాడిని పక్క మీద పడుకోబెట్టింది. "పండుగకి చెక్కలు చేశాను తిందువుగాని రా" అని రుక్కు వాళ్ళ అక్క రుక్కుకు పళ్ళెంలో చెక్కలు పెట్టి ఇస్తే ఒక్కటి కూడా వదలకుండా భలే రుచిగా ఉన్నాయని నోటి నిండా బొక్కుకుని తింటుంటే పొలమారి, ప్రక్కనే చెంబులో ఉన్న నీళ్ళు పెద్ద పెద్ద గుక్కలు త్రాగింది. సాయంత్రం రుక్కు జుట్టు చిక్కులు తీసిన వాళ్ళ అక్క చక్కగా పూలజడ వేసి, చుక్కల పరికిణి జాకెట్టు తొడిగి దిష్టి తగలకుండా అరచేతిలో కాటుకతో చిన్న చుక్క పెట్టింది. పండుగకి అందరూ చక్కగా ముస్తాబయ్యి సాయంత్రం పక్కనే ఉన్న దేవాలయంలో చూడ చక్కగా ముస్తాబైన అమ్మవారిని దర్శించుకుని పంతులుగారు ఇచ్చిన ప్రసాదం కొబ్బరి ముక్కలు, చక్కెరకేళి అరటిపండు తీసుకుని అక్కడే ఉన్న చెక్క బల్ల మీద కాసేపు కూర్చుని, అక్కడికి వచ్చిన తెలిసిన భక్తులతో ఎక్కడలేని కబుర్లు చెప్పుకుని ఇంటికి చేరారు.
######################################

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి