ప్రాణ రక్షకులు:- డా.సి వసుంధర చెన్నై


దేశప్రజ చాలామటుకు హాయిగా నిద్రించనూ 
కమ్మగా భుజించి తృప్తి జెందనూ
కారణ భూతులిద్దరే ఇద్దరు!!
వారే....  సైనికుడు, సైరికుడు

భూమి పుట్టుక తోనే 
స్వార్థం పడగ విప్పింది
పదివేల శేషుల పగల పడగల నీడన 
బ్రతికే మనిషికి ప్రతిక్షణం మరణ భయం
అందుకు అవతరించింది
ఎప్పుడో ఓ దుర్ముహూర్తాన 
రక్షక భట సందోహం
దేశ రక్షణ పేరున
మన దేశ బిడ్డలకే మరణ శాసనం
బుద్ద భగవానుని శాంతి ప్రవచనాలు అటకెక్కాయి
అగ్ని గుండంలా మారిన ప్రపంచంలో
సమిధలుగా మారేవారి పేరే
 "వీర జవానులు", 
 "దేశ రక్షకులు" , "త్యాగధనులు" పర్యాయ పదాలు 

పూర్వకాలంలో కొత్వాల్  
రక్షణ శాఖాధికారి
బ్రిటిష్ వారు1861 లో రూపొందించిన పోలీస్ శాఖ ప్రజా పరిరక్షణకు పట్టుకొమ్మ 

పోలీస్ వ్యవస్థ నిర్వహణ 
రాష్ట్రాలదే బాధ్యత 
రాజకీయాలు అరాచకీయాలుగా రూపుదాల్చే కొద్దీ 
పోలీసుల ఉసురుకు 
బిగుసుకుంది ఉచ్చు
ఉదర పోషణార్ధం 
తప్పనిసరి చట్ట విరుద్ధాలు
కాదని ఎదురు తిరిగితే ప్రయాణమే!
గమ్యం ఇంటిముఖమో? ఇంద్రుని లోకమో?

నేరస్తులు, సైబర్ నేరాలూ పెరిగినంత వేగంగా 
పోలీస్ శాఖలో కొత్త ఆలోచనలు, 
ఆయుధాలు పెరగని కారణాన 
నేర నిరోధక చర్యలు చచ్చుబడ్డాయి.
నేరగాళ్ల క్రూరత్వాన్ని అడ్డుకుని 
అడ్డుపడి అసువులు బాసే
 రక్షక భటులు, అధికారులు ఎందరో!!

ముందు నుయ్యి , వెనక గొయ్యన్నట్లు 
చస్తూ బ్రతుకుతూ బ్రతికీ ....
చివరకు మరణించే పోలీసులు అమరవీరులే
వారికి నిత్యమూ ఘటించాలి శ్రద్ధాంజలి

ప్రజా రక్షణ పోలీసు వ్యవస్థ ప్రధమ కర్తవ్యం 
రాజకీయ మేఘాలు కమ్ముకోకుండా ఉన్నప్పుడే
రక్షణ శాఖ రక్షింప బడుతుంది
 బాధ్యతాయుతంగా  రక్షణ  ప్రజలకు కల్పిస్తుంది  
మొత్తంగా చూస్తే పోలీసులు......
 విధి నిర్వహణలో అసువులు బాసినా , 
నిర్బంధ పరిస్థితుల్లో అసువులు వీడినా  
 అమర వీరులే!! సందేహం లేదు,
వారికి నిత్యం  వందనాలు అర్పించడం 
పోలీసు నిధికి సహాయ సహకారాలందివ్వడం 
ప్రజల కనీస కర్తవ్యం. 
      @@@##@@@
కామెంట్‌లు