వెతక్కండి: - - యామిజాల జగదీశ్


నా రచనల్లో నేను లేను.
నా ప్రతి కవితలో ఒక ముఖాన్ని వెతుకుతారు. 
ప్రతి మాటలో ఒక పేరును వెతుకుతారు. 
ప్రతి బాధ వెనుక ఒక కథను ఊహించి చూస్తారు.
నేను లేని నా పంక్తుల్లో 
ఎవరో ఒకరి బాధ ఉండొచ్చు. 
ఎవరో ఒకరి ప్రేమ ఉండొచ్చు. ఎక్కడో
 ఎవరో కోల్పోయిన ఒక జీవితపు ఆనవాళ్లు మిగిలి ఉండొచ్చు.

కొన్నిసార్లు నేను రాసేది నా కథలు కాదు. 
నన్ను దాటివెళ్లే ఎందరో మనుషుల చెప్పుకోని కథల్ని.

నేను అనుభవించేది నా బాధల్ని మాత్రమే కాదు. 
నా జీవితంలో ఎప్పుడూ కలవని ఒక మనిషి కళ్లలోని కన్నీటిని కూడా.

అయినా, అన్ని ప్రేమలూ నావి కావు. అన్ని విరహాలూ 
నన్ను విడిచి వెళ్లిన వాళ్లవి కావు. అన్ని బాధలూ 
నా గాయాల నుంచి పుట్టినవి కావు.

నా రచనల్లో నేను లేను. కంటికి కనిపించే 
ప్రతిదాన్నీ రాసేయాలనే ఒక ఆగని మనసు మాత్రమే ఉంది.

అసలు, నా రచనలు నా జీవితాన్ని ఒప్పుకుంటూ చెప్పే వాంగ్మూలాలా ఏమిటి?

అందుకే, వెతకకండి. నా రచనల్లో నేను లేను.

కామెంట్‌లు