బృందావన పవిత్ర భూమిలో మాటలకు అందని ఒక అద్భుతమైన ప్రేమ ఎప్పటికీ సజీవమే. అక్కడి మట్టిలోనూ ప్రేమే, చెట్ల నీడలోనూ ప్రేమే, యమునమ్మ అలలలోనూ ప్రేమే. అన్నింటికన్నా మిన్నగా శ్రీరాధమ్మ హృదయంలో ప్రేమే సజీవ రూపం దాల్చి కొలువై ఉంటుంది.
శ్రీరాధమ్మ వంశదైవం సూర్యభగవానుడని చెబుతారు. అందుకే శ్రీజీ ప్రతిరోజూ తెల్లవారుజామున సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించేవారు. ఆమె చేతుల నుంచి జాలువారే ప్రతి నీటిబొట్టులోనూ కేవలం నీరే కాదు, అపారమైన భక్తి, శ్రద్ధ, సంస్కారం నిండి ఉండేవి.
ఒకరోజు జరిగిన సంఘటన ఇది.
తెల్లవారుజామున వేళ. ఆకాశమంతా సూర్యుని లేత ఎరుపు కాంతితో నిండిపోతోంది. బృందావన వీధుల్లో పిల్లగాలి మెల్లగా వీస్తోంది. పక్షులు మధురంగా కిలకిలరావాలు చేస్తున్నాయి. పరిసరాలన్నీ ఎంతో ప్రశాంతంగా ఉన్నాయి.
శ్రీరాధమ్మ చేతిలో నీటితో నిండిన పాత్రను పట్టుకుని నిలబడి ఉన్నారు.
కానీ ఆ రోజు ఒక విచిత్రం జరిగింది.
రాధమ్మ సూర్యునికి ఎదురుగా నిలబడి అర్ఘ్యం సమర్పించలేదు. పశ్చిమ దిశవైపు తిరిగి నీటిని సమర్పించసాగారు.
అది చూసిన ఆమె ప్రియసఖి లలితాదేవి ఆశ్చర్యపోయారు.
చిరునవ్వుతో ఇలా అన్నారు.
“స్వామినీజీ! ఈరోజు మీకేమైంది? సూర్యభగవానుడు తూర్పు దిశలో ఉన్నారు కదా! మీరు మాత్రం పశ్చిమ దిశవైపు తిరిగి నీటిని సమర్పిస్తున్నారు. ఏమిటి సంగతి? ప్రేమలో పడి మీ ధ్యాస ఎక్కడైనా తప్పిపోయిందా?”
రాధమ్మ కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నారు.
ఆమె పెదవులపై చిరునవ్వు మెరిసింది. కళ్లలో కరుణ సముద్రంలా పొంగిపొర్లుతోంది.
లలితాదేవి మళ్లీ అడిగారు.
“ మీరు ప్రతిరోజూ సూర్యభగవాను డిని ఆరాధిస్తారు కదా! మరి ఈరోజు పశ్చిమ దిశలో నీటిని ఎందుకు సమర్పిస్తున్నారు?”
శ్రీరాధమ్మ కళ్లలో నీళ్లు తిరిగాయి.
ఎంతో మృదువైన స్వరంతో ఇలా అన్నారు.
“లలితే! అమాయకురాలిని నేను కాదు… నువ్వే!”
ఆ మాట విని లలితాదేవి ఆశ్చర్యంగా ఆమెవైపు చూశారు.
రాధమ్మ పశ్చిమ దిశవైపు చూస్తూ ఇలా చెప్పారు.
“లలితే! తూర్పు దిశలో ఉన్న సూర్యభగవానుడు మన వంశదైవం. ఆయనను పూజించడం, గౌరవించడం మన ధర్మం. కానీ ఈ నీటిని మాత్రం నేను పశ్చిమ దిశలో ఉన్న నా సూర్యుడికి సమర్పిస్తున్నాను.”
లలితాదేవికి ఆ మాటల అర్థం కాలేదు.
“పశ్చిమ దిశలో ఉన్న సూర్యుడా? స్వామినీజీ! మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు!” అని అడిగారు.
శ్రీరాధమ్మ కళ్ల నుంచి ప్రేమాశ్రువులు జారసాగాయి.
మెల్లగా ఇలా అన్నారు.
“లలితే! నా దృష్టిలో నా శ్యామసుందరుడే సూర్యుడు. సూర్యుడు ఈ లోకానికి వెలుగునిస్తాడు కదా! అలాగే నా శ్యామసుందరుడు నా హృదయానికి ప్రేమవెలుగును ప్రసాదిస్తాడు.”
ఆ తర్వాత నందగావ్ ఉన్న దిశవైపు చూపిస్తూ ఇలా అన్నారు.
“చూడు లలితే! నందగావ్ పశ్చిమ దిశలో ఉంది. నందభవనం కూడా అటువైపే ఉంది. నా శ్యామసుందరు డు కూడా అక్కడే ఉన్నాడు కదా!”
ఇలా చెబుతుండగానే రాధమ్మ గొంతు ప్రేమతో పూడుకుపోయింది.
తన చేతిలో మిగిలిన నీటిని ఎంతో ఆప్యాయంగా పశ్చిమ దిశవైపు సమర్పిస్తూ ఇలా అన్నారు.
“ఈ నీటిని నేను కేవలం సూర్యభగవానుడికి సమర్పించడం లేదు. నా హృదయానికి సూర్యుడైన ఆ శ్యామసుందరుడికి సమర్పిస్తున్నాను. ఈ చిన్న అర్ఘ్యం నా ప్రియతముడి మృదువైన పాదాలను చేరితే చాలు. నాకు అంతకంటే ఇంకేమీ అక్కర్లేదు.”
లలితాదేవి మాటలు రాకుండా రాధమ్మవైపు చూస్తూ ఉండిపోయారు.
రాధమ్మ మళ్లీ ఇలా అన్నారు.
“లలితే! మన శ్యామ ఎంత అల్లరివాడో నీకు తెలుసు కదా! ఒక్కోసారి గోపబాలురతో కలిసి పరుగులు తీస్తాడు. మరోసారి ఆవుల వెంట అడవుల్లోకి వెళ్లిపోతాడు. ఇంకోసారి మురళి వాయిస్తూ అందరినీ మైమరపింపజేస్తాడు. మనమంతా చేసే ఫిర్యాదులను విని చిరునవ్వులు చిందిస్తుంటాడు.”
ఆమె కళ్లలో వాత్సల్యం ఉప్పొంగింది.
“మనమంతా ఆయనతో ఎన్నెన్నో లీలలు చేయిస్తుంటాం. ఒక్కోసారి అలుగుతాం, మరోసారి బతిమాలుతాం, ఇంకోసారి ఆటపట్టిస్తాం. ఇలా మన శ్యామసుందుడిని ఎంతగా అలసిపోయేలా చేస్తున్నామో కదా!”
రాధమ్మ కళ్ల నుంచి కన్నీళ్లు ధారగా ప్రవహించాయి.
ఆమె మళ్లీ ఇలా అన్నారు.
“ఈరోజు ఎందుకో నా మనసులో ఒక ఆలోచన కలిగింది. నా శ్యాముడి పాదాలకు కూడా కాస్త చల్లదనం అందితే ఎంత బాగుంటుందో అనిపించింది. అందుకే ఈ నీరు ఆయన పాదాలను చేరాలనే ప్రేమభావంతో పశ్చిమ దిశవైపు అర్ఘ్యం సమర్పిస్తున్నాను.”
లలితాదేవి కళ్లూ చెమ్మగిల్లాయి.
ఆ క్షణంలో ఆమెకు అర్థమైంది. రాధమ్మ చేస్తున్నది సాధారణమైన జలార్పణం కాదు.
అది ప్రేమతో సమర్పించిన అర్ఘ్యం!
తన సంతోషం కోసం ఎలాంటి కోరికా లేని ప్రేమకు అది నిదర్శనం. ప్రియమైనవారి సంతోషమే తన సంతోషంగా భావించే ప్రేమకు అది ప్రతిరూపం. భగవంతుడిని ఏదో ఒకటి కావాలని అడగడం కాదు, ఆయన అలసటను కూడా తనదిగా భావించేంతటి ప్రేమ అది.
ఇదే శ్రీరాధమ్మ ప్రేమ!
రాధమ్మకు కృష్ణుడు కేవలం భగవంతుడు మాత్రమే కాదు.
ఆయనే ఆమె ప్రాణం. ఆయనే ఆమె జీవితం. ఆయనే ఆమె హృదయం. ఆయనే ప్రేమకు అంతిమ సత్యం.
కృష్ణుడి సంతోషమే ఆమె సంతోషం. ఆయనకు కలిగే బాధే ఆమెకు కలిగే బాధ.
అందుకే రాధమ్మ ప్రేమ ఈ లోకంలోని సాధారణ ప్రేమకు పూర్తిగా భిన్నమైనదిగా భావిస్తారు. అక్కడ ‘నేను’ అనే భావం కరిగిపోతుంది. చివరికి ‘నువ్వు’ అనే భావమే మిగులుతుంది.
రాధమ్మ ప్రేమ మనకు నేర్పే గొప్ప పాఠం
ప్రేమ అంటే మన కోసం ఏదో ఒకటి కోరుకోవడం కాదు.
ప్రేమ అంటే మనం ప్రేమించే వారి సంతోషంలోనే మన సంతోషాన్ని వెతుక్కోవడం.
రాధమ్మ పశ్చిమ దిశవైపు నీటిని సమర్పించడం ద్వారా లోకానికి ఒక గొప్ప రహస్యాన్ని తెలియజేసినట్లయింది.
భగవంతుడిని చేరుకోవాలంటే పూజా విధానాలు తెలుసుకోవడం ఒక్కటే సరిపోదు. మనకంటే ముందుగా ఆయనను తలచుకునే ప్రేమభావం మన హృదయంలో ఉండాలి.
ఎలాంటి స్వార్థం లేకుండా అలాంటి ప్రేమ మనసులో మేల్కొన్నప్పుడు, ప్రతి దిశా బృందావనంగా మారుతుంది. ప్రతి నీటిబొట్టూ చరణామృతంలా పవిత్రమవుతుంది. మన ప్రతి శ్వాసలోనూ…
“రాధే… రాధే…”
అనే నామమే ప్రతిధ్వనిస్తుంది.
మా హృదయాల్లోనూ ఇలాంటి నిష్కల్మషమైన ప్రేమను మేల్కొలుపమ్మా రాధమ్మా!
మా గురించి తక్కువగా ఆలోచించి, మీ శ్యామసుందుడి సంతోషం గురించి ఎక్కువగా ఆలోచించే మనసును మాకు ప్రసాదించమ్మా రాధమ్మా!
మా భక్తిలో నటన ఉండకూడదు. అహంకారం ఉండకూడదు. స్వార్థం ఉండకూడదు.
మీ పాదధూళిని పొందాలనే నిజమైన తపన మాత్రమే మా హృదయాల్లో నిండిపోవాలమ్మా!
రాధమ్మ లేని కృష్ణుడు అసంపూర్ణుడు అని చెబుతారు. కానీ కృష్ణుడు లేకుండా రాధమ్మ ప్రేమ అసంపూర్ణం కాదు.
ఎందుకంటే…
శ్రీరాధమ్మ హృదయంలో శ్రీకృష్ణుడు ఎప్పటికీ సంపూర్ణంగా కొలువై ఉంటాడు!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి