హెచ్. ఎం. టీ మాజీ ఉద్యోగుల “నవమ సమ్మేళనం”
 తరగని ఉత్సాహం - ఏటికేడు పెరుగుతున్న సంఖ్యాబలం
 


2015 సంవత్సరం అక్టోబర్ 2 వ తేదీ మహాత్మా గాంధీ జయంతి రోజున “హెచ్. ఎం. టీ. మాజీ ఉద్యోగుల సంస్థ” ఆధ్వర్యంలో  కేవలం 15 మంది ఉత్సాహవంతులతో ప్రారంభమైన “హెచ్. ఎం. టీ. మాజీ ఉద్యోగుల సమ్మేళనం”, ఏ ఏటికాయేడు వృద్ధి చెందుతూ, పాల్గొంటున్నవారి సంఖ్య వందల్లోకి మారిపోయింది. 
  కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసిన 2020, 2021 సంవత్సరాలలో మినహాయిస్తే, ప్రతి సంవత్సరం ఈ వేడుక క్రమం తప్పకుండా అక్టోబర్ 2 వ తేదీనే జరుగుతోంది. గత సంవత్సరం మాత్రం అక్టోబర్ 2 వ తేదీ “విజయదశమి” పర్వదినం కావడం మూలాన ఈ వార్షిక సమ్మేళనం తేదీని అక్టోబర్ 12 వ తేదీకి మార్చారు. హైదరాబాద్ బేగంపేట పాత ఎయిర్ పోర్ట్ రోడ్డు ప్రక్కనే ఉన్న హోటల్ రమదా వెనుక వైపు ఉన్న “ఫ్యామిలీ వరల్డ్” ఈ సమ్మేళనానికి వేదిక. ఈ తొమ్మిది సమ్మేళనాల వేదికలో మాత్రం ఏ మార్పు లేదు. 
సమ్మేళనం ప్రారంభించిన కొత్తలో హెచ్. ఎం. టీ., హైదరాబాద్ కు చెందిన మిషన్ టూల్స్, ప్రెస్ డివిజన్, లాంప్ డివిజన్, వాచ్ కేస్ డివిజన్, సీ. ఎం. ఎఫ్. ఐ, ట్రాక్టర్ డివిజన్ మాజీ ఉద్యోగులు మాత్రమే హాజరయ్యేవారు. తరువాతి సంవత్సరాలలో హెచ్. ఎం. టీ. బేరింగ్స్, హెచ్. ఎం. టీ. ప్రాగా యూనిట్ల మిత్రులు కూడా సమ్మేళనంలో పాల్గొంటున్నారు.   
ఈ సంవత్సరం కూడా అక్టోబర్ 2 వ తేదీ ఉదయం 10 గంటలనుంచే హెచ్. ఎం. టీ మాజీ ఉద్యోగులు తొమ్మిదవ సమ్మేళన వేదికకు రావడం ప్రారంభమయ్యింది. వయసు పెరుగుతున్నా ఏమాత్రం తరగని ఉత్సాహం, చిరునవ్వులు, పలకరింపులు, ఆలింగనాలు, నవ్వులు, కేరింతలతో వేదిక ప్రాంతమంతా కోలాహలంగా మారిపోయింది.. కొందరు కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వామితో కలసి వచ్చారు. అక్కడకు వచ్చిన వారిలో దాదాపు అందరూ డెబ్భై ఏళ్లు, ఆ పై బడిన వారే. ఉరకలు వేసే యవ్వన ఉత్సాహం అంతా అక్కడే ప్రోగు పడినటట్లుగా ఉంది అక్కడి వాతావరణం. 
ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు, పొరుగు రాష్ట్రాల నుంచి, దేశవిదేశాల నుంచీ కూడా కొంత మంది హెచ్. ఎం. టీ. మాజీ ఉద్యోగులు విచ్చేసి ఎంతో ఆనందంగా సమయాన్ని గడిపారు. 
ఈ సంవత్సరం మహిళా ఉద్యోగినుల సంఖ్య కూడా బాగా పెరిగింది. వారి రాకతో సమ్మేళనం మరింత కాంతివంతంగా మారి పోయింది. వారంతా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ, కుటుంబ విషయాలు పరస్పరం చెప్పుకుంటూ చిరునవ్వులు చిందిస్తూ  ఎంతో ఆనందంగా గడిపారు.  
ఉదయం పదిన్నర దాటే సరికి సమ్మేళన ప్రాంగణం పూర్తిగా నిండిపోయింది. ఎటు చూసినా జనమే జనం. నిర్వాహకుల కళ్ళలో చెప్పలేని ఆనందం. 
పదకొండు దాటిన తరువాత సభా కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఈ నాటి సమ్మేళనానికి హెచ్. ఎం. టీ. ప్రాగా మాజీ మానేజింగ్ డైరెక్టర్ రామ్ సుధీర్ సతీ సమేతంగానూ, మెషీన్ టూల్స్ మాజీ జనరల్ మేనేజర్ ఏ. వీ. నర్సింగరావు లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. సమావేశం ప్రారంభమయ్యింది. 
ముందుగా సమావేశ మందిరానికి వామ భాగంలో ఏర్పాటు చేయబడిన చిరు వేదిక వద్దకు అతిధులు, నిర్వాహకులు చేరుకున్నారు. అక్కడ గత సంవత్సరం అక్టోబర్ నుండి ఈ సంవత్సరం సెప్టెంబర్ చివరి వరకు మనల్ని వదిలి శాశ్వతంగా దూరమైన మాజీ ఉద్యోగుల చిత్ర పటాలు, వారి పేర్లు, పని చేసిన డిపార్ట్మెంట్ వివరాలు, మరణించిన తేదీ పొందు పరిచారు. అతిథులు దీప ప్రజ్వలన చేసారు. అందరూ వినమ్రంగా లేచి నిలబడి తమ మిత్రులను స్మరించుకుంటూ మౌనం పాటించారు. ఆ రెండు నిమిషాలు ఆ ప్రాంగణమంతా అత్యంత నిశ్శబ్దంగా మారిపోయింది. హృదయాలు భారం అయ్యాయి. 
అనంతరం “హెచ్. ఎం. టీ. మాజీ ఉద్యోగుల సంస్థ” అధ్యక్షులు జి. వీ. నరసింహమూర్తి సమావేశానికి అధ్యక్షత వహించారు, సభికులకు స్వాగతం పలికారు. ప్రధాన కార్యదర్శి ఎన్. వీ. మహేష్ తమ కార్యదర్శి నివేదికలో గత పదకొండు సంవత్సరాలుగా సంస్థ కార్యకలాపాలను వివరించారు. సంస్థ ఆర్ధిక కార్యదర్శి సి. హెచ్. నాగలింగం సంస్థ యొక్క గత సంవత్సరపు జమా ఖర్చులు, బ్యాంక్, నగదు నిల్వల సమగ్ర నివేదికను, ఈ సంవత్సరపు ముసాయిదా నివేదికను సమావేశానికి వివరించారు. ప్రధాన కార్యదర్శి నివేదికను, ఆర్ధిక నివేదికను సభికులు కరతాళ ధ్వనులతో ఆమోదించారు.  
అనంతరం రామ్ సుధీర్, ఏ. వీ. నర్సింగరావులు మాట్లాడుతూ తాము సంస్థలో ఉన్నత బాధ్యతలు నిర్వహిస్తున్న రోజులను గుర్తు చేసుకున్నారు. ఈ సమ్మేళనానికి రావడం చాలా ఆనందం కలిగించిందని వారన్నారు. 
హెచ్. ఎం. టీ మాజీ ఉద్యోగి, ప్రస్తుతం ‘డైనమిక్ టూల్స్ ప్రైవేట్ లిమిటెడ్’ ఫౌండర్ & ఎం. డీ. జి. ఆర్ సూర్యరాజ్ ఆర్ధిక వితరణతో ముద్రణ చేయబడిన “మెంబర్స్ డైరెక్టరీ” ని రాం సుధీర్ ఆవిష్కరించారు. ఈ డైరెక్టరీ లో దాదాపు తొమ్మిది వందల మంది మాజీ ఉద్యోగుల పేరు, ఫోటో, చిరునామా, ఫోన్ నంబర్, ఈ- మెయిల్ ఐడీ, ఉద్యోగించిన వివరాలు పొందుపరచి సమగ్రంగా తయారు చేశారు. అనంతరం ఈ డైరెక్టరీని సమ్మేళనానికి విచ్చేసిన మాజీ ఉద్యోగులకు అందజేశారు. 
రామ్ సుధీర్, నరసింగరావు, సూర్యరాజ్ లను నిర్వహకులు ఉచిత రీతిన సన్మానించారు. 
ఈ సమావేశ కార్యక్రమాన్ని సంస్థ ముఖ్య సమన్వయకర్త పోణంగి బాలభాస్కరరావు చక్కని సమన్వయంతో నిర్వహించారు. ఆయనకు శ్రీమతి ఏ. రామలక్ష్మి, శ్రీమతి ఎం. కనకమహాలక్ష్మి, శ్రీమతి నిర్మల గార్లు చక్కటి సహకారం అందించి సభాకార్యక్రమం విజయవంతం చేశారు. 
అనంతరం ఎనభై ఐదేళ్లు పూర్తిచేసుకుని ఉత్సాహంగా వేడుకకు వచ్చిన దాదాపు పదిహేను మంది సూపర్ సీనియర్ లకు నిర్వాహకులు శాలువలు కప్పి సన్మానించారు. ఇంకా ఈ కార్యక్రమానికి ఆర్థిక వితరణ చేసిన వారిని కూడా ఉచిత రీతిన సన్మా నించారు. 
ఈ సమ్మేళన కార్యక్రమం ప్రారంభం నుండి ముగింపు వరకు “Lders TV” – (YouTube Channel) ప్రతినిధి బి.డి.ఎల్. సత్యనారాయణ ఈ కార్యక్రమాన్ని వీడియో చిత్రీకరణ చేయడంతో పాటు, తుమ్మా బాలగంగాధరరావు సహకారంతో, పలువురు సీనియర్ ఉద్యోగులు, రంగస్థల, టీవీ నటులు, ఇతర కళాకారుల అభిప్రాయాలను, అనుభవాలను చిత్రీకరించి, వారిలో నూతన ఉత్సాహాన్ని నింపారు.
సమావేశం ముగిసిన అనంతరం మాజీ ఉద్యోగులు యూనిట్ల వారీగా, డివిజన్ల వారీగా మిత్రులతో కలసి ఆనందంగా ఫోటోలు దిగారు. అప్పటికి సమయం పన్నెండున్న దాటిపోయింది. అందరూ సీనియర్ సిటిజన్లు కావడం వలన భోజన ఏర్పాట్లు సిద్ధం అయినాయి. అందరూ పాత మిత్రులతో కబుర్లు చెప్పుకుంటూ చక్కటి శాకాహార విందు భోజనం ఆరగించారు. 
ఈ కార్యక్రమ విజయవంతానికి సంస్థ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా కృషి చేశారు. 
వ్యవస్థాపకుడు సి. వెంకటరావు, అధ్యక్షుడు జి. వీ. నరసింహమూర్తి, ముఖ్య ఉపాధ్యక్షుడు ఏ. సోమయ్య, ఉపాధ్యక్షుడు ఎస్. బలవీర్ సింగ్, ప్రధాన కార్యదర్శి ఎన్. వీ. మహేష్, ముఖ్య సమన్వయకర్త పి. బాలాభాస్కరరావు, ఆర్థిక కార్యదర్శి సిహెచ్. నాగలింగం చక్కని ప్రణాళికతో కార్యక్రమాన్ని నడిపించారు. 
సిహెచ్. మోహనరావు, ఏ. కృష్ణమోహన రావు, గురుబచ్చన్ సింగ్, టి. పార్థసారధి, ఏ. కామేశ్వరరావు, ఎం. తిరుమాలప్ప, బి. వి. నరసింహమూర్తి, కె. మంగపతిరావు, జి. వి. సూర్యనారాయణ, శ్రీమతి ఏ. రామలక్ష్మి, సిహెచ్. అప్పారావు, సిహెచ్. కోటేశ్వరరావు, శ్రీమతి ఎం. కనకమహాలక్ష్మి, సిహెచ్. ఆనంతరాములు, బి.ఎం. శ్రీనివాస్, కె. రామదాస్ లు చక్కటి సమన్వయ సహకారం అందించారు. 
కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆనందంగా నేటి కార్యక్రమాన్ని నెమరు వేసుకున్నారు. గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరం ఎక్కువ మంది హాజరయ్యారని, మహిళలు ఎప్పుడూ లేనంతగా ఈసారి వచ్చారని కార్యక్రమ చాలా విజయవంతం అయిందని చెప్పుకుంటూ ఇంటిదారి పట్టారు. నివేదిక: తుమ్మా బాలగంగాధరరావు 
కామెంట్‌లు