సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!
 422 వ రోజు: బలరాముని యాత్రా విశేషములు


జనమేజయుని కోరికపై వైశంపాయనుడు " జనమేజయా ! ఈ క్షేత్రమున చంద్రుడు స్నానమాచరించి తన క్షయరోగమును పోగొట్టుకున్నాడు. ఆ కథ వివరించెదను విను. దక్షప్రజాపతి తన కుమార్తెలైన ఇరవై ఏడు మందిని చంద్రునికి ఇచ్చి వివాహం చేసాడు. వారిలో అతి రూపవతి అయిన రోహిణి మీద మక్కువ చేత చంద్రుడు మిగిలిన వారిని నిర్లక్ష్యం చేసాడు. మిగిలిన కుమార్తెలు వ్యధ చెంది తమ బాధను తమ తండ్రికి చెప్పాడు. దక్షుడు చంద్రుడిని పిలిచి అందరినీ సమానంగా చూసుకోవడం ధర్మమని బుద్ధిమతి చెప్పి పంపించాడు. చంద్రుడు దక్షుని మాటను నిర్లక్ష్యం చేసాడు. దక్షుడు కుపితుడై చంద్రుడికి క్షయవ్యాధి పీడితుడవై పొమ్మని శపించాడు. చంద్రుని అందు కల ఓషధీ శక్తులు నశించి పోయి అతడు రోజు రోజుకు క్షీణించ సాగాడు. ఇదంతా తెలుసుకున్న దేవతలు చంద్రుడి వద్దకు వచ్చి కృశించి పోవడానికి కారణ ఏమిటని అడిగి తెలుసుకుని చంద్రుడిని తీసుకుని దక్షుని వద్దకు వెళ్ళారు. దేవతలు చంద్రుడిని శాపప్రభావం నుండి రక్షించమని వేడుకున్నారు. దక్షుడు వారి ప్రార్థనను మన్నించాడు. భార్యలంరనీ సమానంగా చూడాలని ఎప్పుడూ స్త్రీలనూ, బ్రాహ్మణులను అవమానించ కూడదని చంద్రుడిని కోరాడు. ఆ తరువాత చంద్రుడు సరస్వతీ సాగర సంగమ తీర్థంలో స్నానమాచరించి క్షయ వ్యాధిని పోగొట్టుకున్నాడు. అప్పటి నుండి చంద్రుడు ప్రతి అమావాస్యకు ఇక్కడ స్నానమాచరించి పౌర్ణమి వరకు వృద్ధి చెందుతూ 15 రోజుల పాటు వృద్ధిని 15 రోజులు క్షయాన్ని చెందసాగాడు.
చమసోద్భేదనం
బలరాముడు ప్రభాస తీర్థంలో స్నానమాచరించి చమసోద్భేదనం అనే తీర్ధమున ఒక రాత్రి విశ్రమించాడు. ఆ తీర్ధ విశేషమును చెప్తాను విను. త్రితుడు, ద్వితుడు, ఏకతుడు అనే ముగ్గురు ముని కుమారులు ఉన్నారు. ఆ ముని కుమారులు క్షత్రియులకు యజ్ఞదీక్ష ఇచ్చి గోవులను దానంగా పొంది ఇంటికి వస్తుండగా పెద్ద వారిద్దరూ మూడవ వాడైన త్రుతుడిని మోసగించి అతని గోవులను కూడా అపహరించాలని అనుకున్నారు. ఇంతలో ఒక తోడేలు వారిని తరమగా పరుగెత్తుతున్న త్రితుడు బెదిరి పాడుబడ్డ బావిలో పడ్డాడు. మిగిలిన ఇద్దరూ గోవులన్నిటినీ తోలుకుని ఇంటికి వెళ్ళారు. బావిలో పడ్డ త్రితుడికి దిక్కు తోచ లేదు. ఇందులో నుండి బయటపడటానికి యజ్ఞం చేసి సోమపానం చేయడమే మార్గమని ఎంచి సంకల్పం చేత మనసులోనే యజ్ఞం చేసాడు. ఆ యజ్ఞానికి దేవతలందరూ ఆహ్వానించబడి వచ్చి హవిస్సులు స్వీకరించారు. ప్రీతి చెందిన దేవతలు త్రితుడిని ఏదైనా వరం కోరుకొమ్మని అడిగారు. త్రితుడు సరస్వతీ నదిని ప్రార్థించి తనకు పుణ్యజలాలను ఇమ్మని కోరాడు. సరస్వతీ కరుణించి ఆ బావిని తన జలాలతో నింపింది. అప్పటి నుండి ఈ బావిలో నీటితో స్నానమాచరించిన వారికి యజ్ఞం చేసి సోమపానం చేసిన ఫలం లభిస్తుంది అని వరమిచ్చి దేవతలు వెళ్ళారు.
బలరాముని యాత్రలు
తరువాత బలరాముడు వినశన తీర్ధానికి వెళ్ళాడు. ఆ తీర్థం తక్కువ జాతి వారికి కనపడితే నశిస్తుంది. కనుక అది వినశనము అయ్యింది. ఆ తరువాత బలరాముడు అప్సరసలు నాట్యం చేసే భూమిక అనే తీర్థం చేరి దానిని సేవించాడు. ఆతరువాతబలరాముడు విశ్వావసుడు లాంటి గంధర్వులు తపస్సు చేసి తపస్సిద్ధి చెందిన గంధర్వ తీర్థం చెంతకు వెళ్ళాడు. అక్కడి నుండి బలరాముడు గర్గ క్షేత్రముకు వెళ్ళాడు. అక్కడ గర్గుడు చాలా కాలం నివసించాడు. శంఖ తీర్థం, నైసర్గికం, నాగదన్వానికి వెళ్ళాడు. నాగదన్వం వాసుకి నివసించిన ప్రదేశం. అది వాసుకి దేవతల చేత అభిషిక్తుడైన ప్రదేశం. అక్కడి నుండి బలరాముడు నైమిశారణ్యం వెళ్ళాడు. నైమిశారణ్యానికి సరస్వతీ నది చాలా దూరంలో ఉంది. అప్పుడు నైమిశారణ్య వాసులు ఒక క్రతువు ఆచరించి సరస్వతీ నదీమ తల్లి అనుగ్రహం పొంది ఆమెను తమ చెంత ప్రవహించమని కోరారు. సరస్వతీ నది వారి కోరిక మన్నించి తన గతి మార్చుకుని నైమిశారణ్య ప్రాంతంలో ప్రవహించ సాగింది.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి
కామెంట్‌లు