చిన్ననాటి మొండిపట్టు – కృష్ణుడిపై ప్రేమ
రాజస్థాన్‌లోని మార్వార్ ప్రాంతంలో ఉన్న కుడ్కీ గ్రామంలో మీరాబాయి జన్మించారు. చిన్నతనం నుంచే ఆమె ఎంతో చలాకీగా ఉండేది. శ్రీకృష్ణుడిపై అపారమైన ప్రేమతో, భక్తితో గడిపేది.
మీరాకు ఏడేళ్ల వయసున్నప్పుడు, ఒకసారి వారి ఇంటి ముందు నుంచి పెళ్లి ఊరేగింపు వెళ్తోంది. అది చూసిన మీరా ఆసక్తిగా తల్లిని అడిగింది “అమ్మా! నాకు పెళ్లి చేసుకునే వరుడు ఎవరు?” అని.
అప్పుడు తల్లి సరదాగా ఇంట్లో ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహాన్ని చూపిస్తూ, “అమ్మాయీ! గిరిధర గోపాలుడే నీ భర్త” అని చెప్పింది.
అంతే! ఆ క్షణం నుంచే మీరా శ్రీకృష్ణుడిని తన సర్వస్వంగా, తన భర్తగా భావించింది. పగలూ రాత్రీ కృష్ణుడి విగ్రహం ముందు పాటలు పాడుతూ, నాట్యం చేస్తూ తన భక్తిని చాటుకుంది.
చిత్తోర్లో వివాహం – సంసార జీవితంలో సంఘర్షణ
కాలం గడిచింది. మీరాబాయికి మేవార్ రాజు రాణా సాంగ కుమారుడైన కుంవర్ భోజ్‌రాజ్‌తో వివాహం జరిగింది.
మీరా రాజమహల్లో అడుగుపెట్టినా, ఆమె మనసు మాత్రం ఎప్పుడూ శ్రీకృష్ణుడి పాదాల దగ్గరే ఉండేది. పెళ్లయిన కొన్నేళ్లకే ఒక యుద్ధంలో భోజ్‌రాజ్ వీరమరణం పొందారు.
రాజపుత్రుల సంప్రదాయం ప్రకారం, మీరా కూడా భర్తతో పాటు సతీసహ గమనం చేయాలని కొందరు ఒత్తిడి తెచ్చారు. కానీ ఆమె అందుకు నిరాకరించింది.
“నా నిజమైన భర్త ఎన్నటికీ మరణించని అవినాశి కృష్ణుడు. అలాంటప్పుడు నేను విధవరాలిని ఎలా అవుతాను?” అని ప్రశ్నించింది.
ఆ తర్వాత మీరా రాజభోగాలన్నీ వదిలిపెట్టి, సాధువుల సాంగత్యంలో గడపసాగింది. దేవాలయాలకు వెళ్లి, లోకులేమనుకుంటారో అన్న భయం లేకుండా కృష్ణుడి కీర్తనలు పాడుతూ నాట్యం చేసేది.
విషపు గిన్నె – దైవ మహిమ
మీరా సాధువులతో కలిసిమెలిసి ఉండటం, లోకలజ్జను పట్టించు కోకుండా కృష్ణభక్తిలో మునిగిపోవడం రాజకుటుంబానికి నచ్చలేదు. భోజ్‌రాజ్ తమ్ముడైన రాణా విక్రమాదిత్యుడు ఆమెను చంపడానికి పలుమార్లు ప్రయత్నించాడని కథలు చెబుతాయి.
ఒకసారి రాణా మీరా కోసం ప్రాణాంతకమైన విషాన్ని ఒక గిన్నెలో పంపించాడు. దాన్ని పవిత్ర తీర్థమని చెప్పి తాగమన్నాడు.
మీరా చిరునవ్వుతో కృష్ణుడి నామాన్ని స్మరిస్తూ ఆ విషాన్ని తాగింది. కృష్ణుడి అనుగ్రహంతో ఆ విషం అమృతంగా మారిందనీ, ఆమెకు ఎలాంటి హానీ జరగలేదనీ భక్తులు విశ్వసిస్తారు.
మరోసారి ఒక బుట్టలో విషసర్పాన్ని పెట్టి ఆమెకు పంపించారు. కానీ మీరా ఆ బుట్టను తెరిచి చూడగానే, అందులోని పాము పూలమాలగా మారిందని కథనం.
ఈ సంఘటనలు మీరాబాయి అచంచలమైన కృష్ణభక్తికి నిదర్శనంగా భక్తుల కథల్లో నిలిచిపోయాయి.
ద్వారకకు ప్రయాణం – కృష్ణుడిలో ఐక్యం
రాణా పెడుతున్న బాధలు భరించలేక, తన ఆరాధ్య దైవమైన కృష్ణుడి పిలుపు తనకు వినిపిస్తోందని భావిం చిన మీరా మేవార్ను విడిచిపెట్టింది.
మొదట బృందావనానికి వెళ్లింది. ఆ తర్వాత జీవితపు చివరి రోజుల్లో గుజరాత్‌లోని ద్వారకకు చేరుకున్నాది. అక్కడ రణఛోడ్జీగా కొలిచే శ్రీకృష్ణుడి ఆలయంలో పూర్తిగా భక్తిలో మునిగిపోయింది.
మీరా చిత్తోర్ను విడిచివెళ్లిన తర్వాత అక్కడ కరువు, అశాంతి నెలకొన్నాయని కథ చెబుతుంది. తన తప్పు తెలుసుకున్న రాజు, ఆమెను తిరిగి తీసుకురావడానికి కొందరు బ్రాహ్మణులను ద్వారకకు పంపించాడు.
వారు మీరాను తిరిగి రావాలని కోరారు. కానీ మీరాకు కృష్ణుడిని విడిచి వెళ్లడం ఇష్టం లేదు. ఆమె ఎంతో భావోద్వేగానికి గురై, ఆలయంలోని గర్భగుడిలోకి వెళ్లింది. కృష్ణుడి విగ్రహం ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ తన చివరి కీర్తనను ఆలపించింది.
ఆ తర్వాత ఆమె శ్రీకృష్ణుడి విగ్రహంలో ఐక్యమైపోయినట్లు భక్తుల కథనం చెబుతుంది. ఆలయ తలుపులు తెరిచి చూసేసరికి, విగ్రహం ముఖం దగ్గర చిక్కుకున్న మీరా చీర కొంగు మాత్రమే కనిపించిందని చెబుతారు.
ఈ కథలోని అంతరార్థం
మీరాబాయి జీవితం మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది.
నిజమైన భక్తి అంటే కేవలం దేవుడిని పూజించడం కాదు. మనసంతా ఆ దైవానికే అంకితం చేయడం.
లోకుల మాటలు, రాజభోగాలు, కష్టాలు, చివరికి మరణభయం కూడా మీరా కృష్ణప్రేమను దూరం చేయలేకపోయాయి.
ఆమెకు కృష్ణుడే సర్వస్వం. ఆయన ప్రేమే ఆమె జీవితం. ఆయన స్మరణే ఆమెకు ఆనందం.
ప్రపంచమంతా మనల్ని ఒకవైపు లాగినా, మనసు నమ్మిన మార్గంలో ప్రేమతో, విశ్వాసంతో నడవాలనే సత్యాన్ని మీరాబాయి జీవితం మనకు గుర్తుచేస్తుంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి