సర్కస్ లో పనిచేసే గ్రీనీ అనే అందమైన చిలుక సైకిల్ తో సర్కస్ చేయించడానికి రోజూ తన యజమాని చిత్రహింసలు పెడుతూ ఉండడంతో ఒకరోజు అతని కళ్ళు కప్పి తనకు చాలా ఇష్టమైన సైకిల్ తో సహా పారిపోయి అడవికి వచ్చేసింది. ఆ అడవిలో తను ఇంతకు మునుపు ఎన్నడూ ఎరుగని స్వేచ్ఛని అనుభవిస్తోంది.
చిలుకను చూసిన చిన్ను అనే కోతి ప్రక్కనే ఉన్న కుక్కుటేష్ అనే కోడితో "ఏయ్! సైకిల్ పై వెళుతున్న ఆ అందాల చిలుకను చూడు, ఇంతకు మునుపు ఎప్పుడూ మనం దానిని ఇక్కడ చూడలేదు. అడవికి క్రొత్తగా వచ్చింది అనుకుంటా!" అంది. "అవును, ఆ సైకిల్ భలేగా ఉంది కదూ!" సైకిల్ వంక ఆసక్తిగా చూస్తూ అంది కుక్కుటేష్. "పద! తనని పరిచయం చేసుకుందాం" అని చిన్ను, కుక్కుటేష్ గ్రీనీ దగ్గరికి వెళ్ళాయి. ఉల్లాసంగా సైకిల్ తొక్కుతున్న గ్రీని వాటిని చూసి ఆగింది. "ఏయ్ అందాల భామ! నీ పేరేంటి?"అడిగింది చిన్ను కోతి."నా పేరు గ్రీనీ!" తన అందాన్ని పొగడడంతో మురిసిపోతూ రెక్కలు టపటపలాడిస్తూ చెప్పింది గ్రీని. "ఈ సైకిల్ నీకు ఎక్కడది?"అడిగింది కుక్కుటేష్ కోడి."ఇది నాదే! ఇంతకు మునుపు సర్కస్ లో పనిచేశాను, అప్పుడు రోజు ఇది తొక్కేదాన్ని, ఇదంటే నాకు ప్రాణం! అందుకే తెచ్చేసుకున్నాను" అంది గ్రీని. "అరే నువ్వు సర్కస్ లో పని చేశావా? మరి ఎందుకు వచ్చేసావు?"వాకబు చేస్తూ అడిగింది చిన్ను కోతి. "అక్కడ నాకేం నచ్చలేదు, అందుకే వచ్చేసాను!" తన అందమైన రెక్కల్ని ముక్కుతో పోడుచుకుంటూ.. వగలు పోతూ "సరే నేను వెళతాను!" అని వాళ్ళకి చెప్పి సైకిల్ పైన వెళ్ళిపోయింది గ్రీని.
రోజూ తనకి కావలసిన పండ్లు సైకిల్ ముందు ఉన్న బుట్టలో వేసుకొని సైకిల్ తొక్కుతూ... ఆనందంగా తింటూ అడవిలో తిరుగుతోంది గ్రీని. బన్నీ అనే కుందేలు గ్రీని సైకిల్ ని చూసి చాలా ఆశపడి "గ్రీనీ! ఒక్కసారి నీ సైకిల్ ఇవ్వవా! నేను తొక్కి ఇస్తాను" అని అడిగింది. "అమ్మో! ఇది నా ప్రాణం, నేను ఎవ్వరికీ ఇవ్వను" అంది గ్రీని. అక్కడే ఉన్న కూర్మారావు అనే తాబేలు" గ్రీనీ! ఒక్కసారి తొక్కడానికి ఇవ్వు పాపం! బన్నీ ఆశగా అడుగుతోంది !"అంది. "ఆహా! నేను ఇవ్వను" నిర్మొహమాటంగా అంది గ్రీని."చూడు గ్రీనీ! మనం అందరం ఒకే చోట ఉండే వాళ్ళం! స్నేహంగా ఉండాలి, అన్నీ పంచుకోవాలి. నువ్వు క్రొత్తగా వచ్చావు కనుక చెప్తున్నాను, అలా ఇవ్వను అనకూడదు" పెద్దరికంతో నచ్చచెబుతూ అంది కూర్మారావు. అయినా గ్రీని మొండిగా.. "నేను ఇవ్వనంటే ఇవ్వను అంతే!" అని నిక్కచ్చిగా చెప్పి సైకిల్ వేగంగా తొక్కుకుంటూ వెళ్ళిపోయింది. "చూడు కూర్మా రావు మామ! తను అందగత్తెనన్న పొగరు, నీ మాట కూడా లెక్క చేయలేదు" కినుకగా అంది బన్నీ. "పోనీలే! క్రొత్తగా వచ్చింది, పైగా చిన్నపిల్ల! నెమ్మది మీద అదే తెలుసుకుంటుంది" నచ్చ చెబుతూ అంది కూర్మారావు.
ఒకరోజు అడవిలో బాగా వాన కురిసింది. ఉదయమే సైకిల్ మీద బయలుదేరిన గ్రీనీ కొంత దూరం వెళ్ళగానే అక్కడ బాగా బురదగా ఉండడంతో తన సైకిల్ తో సహా ఆ బురదలో ఇరుక్కుపోయింది. బురదలోంచి గ్రీని తన సైకిల్ ని బయటికి లాగేందుకు చాలా ప్రయత్నించింది కానీ తన వల్ల కాలేదు. ఏం చేయాలో తోచక ఏడుస్తూ కూర్చుంది. కొమ్మపై ఊగుతూ పళ్ళని తింటున్న చిన్ను కోతి గ్రీని ఏడవడం గమనించి గబగబా దాని దగ్గరకు వచ్చి "ఏమైంది సుందరీ!ఎందుకు ఏడుస్తున్నావ్? ఏడ్చి నీ బుజ్జిముక్కు చూడు ఇంకా ఎఱ్ఱగా ఎలా కందిపోయిందో!" ఉండ బట్టలేక మురిపంగా అడిగింది. చిన్నుని చూసిన గ్రీని ఏడుస్తూ "చిన్ను బావా! నా సైకిల్ బురదలో కూరుకుపోయింది, దాన్ని బయటకు లాగడానికి నా శక్తి చాలడం లేదు, దయచేసి నాకు సహాయం చేయవా!" దీనంగా అడిగింది.
అప్పుడే అక్కడికి వచ్చిన బన్నీ కుందేలు "వద్దు చిన్నూ బావ! ఈ అడవిలో జంతువులు, పక్షులు అందరం ఒకరికొకరు సహకరించుకుంటూ ఒక్కటిగా చాలా స్నేహంగా ఉంటాము. అది మన అడవి నియమాలు ఎప్పుడూ పాటించలేదు. నేను ఒకే ఒక్కసారి తన సైకిల్ ఇవ్వమని అడిగినా ఇవ్వలేదు, దానికి సాయం చేయకు" అక్కసుతో గ్రీనీ వంక చూస్తూ అంది. ఈ గొడవలకి అక్కడకు చేరిన మిగతా పక్షులు, జంతువులు ఏడుస్తున్న గ్రీనీని చూసి జాలిపడ్డాయి. అక్కడ ఉన్న మృగరాజు బన్నీ వంకచుస్తూ"తప్పు బన్నీ! అలా మాట్లాడకూడదు, మనకు శత్రువైనా సరే! ఆపదలో ఉండి శరణు కోరితే సహాయం చేయడం మన ధర్మం! అడవికి రాజుగా నేను చెబుతున్నాను, గ్రీనీకి సహాయం చేయండి" ఆజ్ఞాపిస్తూ అంది.
మృగరాజు ఆజ్ఞ మేరకు చిన్ను కోతి గ్రీనీ సైకిల్ ని బురదలోంచి బయటకు లాగి ఇచ్చింది. సైకిల్ బయటకు రాగానే గ్రీనీ సంతోషంగా రెక్కలు ఆడిస్తూ.. కన్నీరు తుడుచుకుని "అడవిలోని మిత్రులు అందరూ నన్ను క్షమించండి! నా తప్పు నేను తెలుసుకున్నాను, మన దగ్గర ఉన్నది నలుగురితో పంచుకుంటే వచ్చే ఆనందం, మనకు చేతనైన సహాయం పరులకు చేయడంలో ఉన్న తృప్తి ఇప్పుడు నాకు అర్థం అయింది. ఇకమీదట మీతో కలిసిమెలిసి ఉంటాను" తన ప్రవర్తనకు సిగ్గుపడుతూ పశ్చాతాపంతో అంది.
అప్పటి నుంచి గ్రీని తన సైకిల్ ని ముచ్చటపడి అడిగిన వాళ్ళకి ఇస్తూ, తనకు చేతనైనంత సహాయం చేస్తూ, ఆ అడవిలో అందరితో కలసి మెలసి ఉంటోంది.
################################3
నీతి : శతృవైన ఆపదలో శరణు కోరితే
సహాయం చేయడం మన ధర్మం.
.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి