యశోదమ్మ, ప్రేమ, త్యాగం: - - యామిజాల జగదీశ్


 యశోదమ్మను విడిచి మథురకు బయలుదేరిన కృష్ణుడి… తల్లి ప్రేమకు, త్యాగానికి అద్దం పట్టే హృదయాన్ని కదిలించే వైనం.
బృందావనంలో ఆ ఉదయం ఏదో తెలియని విషాదం అలుముకుంది. నంద భవనంలో కన్నయ్య మథురకు వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నా యి.
నందుడు మౌనంగా కృష్ణుడి బట్టలు, ఆభరణాలు రథంలో సర్దుతున్నాడు. మరోవైపు యశోదమ్మ గుమ్మం దగ్గర తల వంచుకుని నిలబడి ఉంది. ఆమె కళ్ల నిండా కన్నీళ్లు… కానీ మనసులో ఉప్పొంగుతున్న బాధను మాటల్లో చెప్పలేకపోతోంది.
నందుడు ఆమెను ఓదారుస్తూ ఇలా అన్నాడు “యశోదా, ఎందుకంతలా బాధపడుతున్నావు? కృష్ణుడు ఎక్కడ ఉన్నా మన కన్నయ్యే.... కానీ కన్నయ్యను కన్న దేవకీదేవి, వసుదేవులు కూడా తమ బిడ్డ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు కదా! ఇప్పుడు అతన్ని తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లనిద్దాం.”
యశోదమ్మ కన్నీళ్లతో నిండిన కళ్లను పైకెత్తి చూస్తూ ఇలా అంది....
“స్వామీ, పదకొండేళ్లుగా గుండెలకు హత్తుకుని పెంచుకున్న బిడ్డ ఈ రోజు మనవాడు కాకుండా పోయాడా? నా మాతృప్రేమకు విలువ లేదా? కన్నతల్లి కాకపోయినా, నా ప్రాణంగా చూసుకు న్న అతనిపై నాకు ఎలాంటి హక్కూ లేదా?”
నందుడు మనసు కూడా కరిగిపోయిం ది.
ఆయన కన్నీళ్లను ఆపుకుంటూ ఇలా అన్నాడు..."యశోదా, తల్లి ప్రేమను వెలకట్టలేం. మనకు సంతానం కలగదేమోనని ఆశలు వదులుకున్న సమయంలో మన ఇంటికి ఈ కన్నయ్య వచ్చాడు. మన జీవితాల్లో ఆనందాన్ని నింపాడు. కానీ ఇప్పుడు అతన్ని వెళ్లనివ్వక తప్పదు.”
అయినా యశోదమ్మ కన్నీళ్లు ధారగా కారుతూనే ఉన్నాయి.
నందుడు చెప్పేది నిజమేనని ఆమెకు తెలుసు. కానీ ఓ తల్లి మనసు తన బిడ్డకు దూరమవ్వడాన్ని అంత తేలిగ్గా ఎలా అంగీకరిస్తుంది?
గొంతు వణుకుతుండగా ఆమె ఇలా అంది...“మీరు నన్ను ఏం అడుగుతున్నారో మీకు అర్థం కావడం లేదు. నా ప్రాణాన్ని నా నుంచి నేనే ఎలా దూరం చేసుకోగలను?”
నందుడు కూడా తన కన్నీళ్లను దాచు కుంటూ ఇలా అన్నాడు “యశోదా, నువ్వు దేవకికి తన బిడ్డను మాత్రమే తిరిగి ఇవ్వడం లేదు. ఎన్నో ఏళ్లుగా ఆమె ఎదురుచూస్తున్న మాతృసంతో షాన్ని కూడా ఆమెకు అందిస్తున్నావు. రాబోయే తరాలు నీ ప్రేమను, నీ త్యాగాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటా యి.”
యశోదమ్మ చేతులతో కన్నయ్య తిన్న చివరి వెన్నముద్దలు!
ఆ రోజు యశోదమ్మ వెన్నకుండను తీసుకుని కన్నయ్య దగ్గర కూర్చుంది.
తన చేతులతోనే కన్నయ్యకు వెన్న తినిపిస్తూ, పదే పదే అతని ముఖాన్ని చూస్తోంది. ఆ రూపాన్ని తన కళ్లలో శాశ్వతంగా దాచుకోవాలన్నట్టుగా అతన్ని చూస్తూనే ఉంది.
కృష్ణుడు అమాయకంగా అడిగాడు "అమ్మా, రోజూ వెన్న తింటున్నానని నన్ను తిడతావు కదా! ఈ రోజు మాత్రం నీ చేతులతోనే ఇంత వెన్న ఎందుకు తినిపిస్తున్నావు?”
యశోదమ్మ ఏదో చెప్పాలని ప్రయత్నించింది. కానీ కన్నీళ్లు ఆమె మాటలను ఆపేశాయి. మౌనంగానే కన్నయ్యకు వెన్న తినిపిస్తూ ఉండిపోయింది.
కన్నయ్య మళ్లీ అడిగాడు.
“అమ్మా, ఏం ఆలోచిస్తున్నావు?”
యశోదమ్మ తన కన్నీళ్లను ఆపుకుంటూ ఇలా అంది. "కన్నయ్యా, నువ్వు వెళ్లిపోతే నా ఆవులను ఎవరు మేపుతారు? నా వెన్నకుండలో వెన్నను ఎవరు తింటారు? నా ఇంటి ఆవరణలో నీ అల్లరి పనులు ఎవరు చేస్తారు?”
కృష్ణుడు మెల్లగా ఇలా అన్నాడు "కానీ అమ్మా, నా గురించి కూడా ఆలో చించు! అక్కడ నాకు నీ చేతులతో తినిపించినంత ప్రేమగా వెన్న ఎవరు తినిపిస్తారు?”
యశోదమ్మ కన్నయ్యను ముద్దుపెట్టు కుంటూ ఇలా అంది...
“అక్కడ నీ దేవకీ అమ్మ నీకు వెన్న తినిపిస్తుంది, కన్నయ్యా!”
కృష్ణుడు యశోదమ్మ తల్లి కళ్లలోకి చూస్తూ అడిగాడు.
“అమ్మా, కానీ నువ్వు నన్ను ప్రేమించి నంతగా నన్ను ఎవరు ప్రేమిస్తారు?”
ఆ ఒక్క మాటతో యశోదమ్మ తన బాధను ఇక ఆపుకోలేకపోయింది.
కన్నయ్యను గుండెలకు హత్తుకుని వెక్కి వెక్కి ఏడ్చింది.
ఆమె మనసులో ఒకటే మాట ప్రతిధ్వనిస్తోంది....
“కన్నా… నిన్ను ప్రేమించేవాళ్లు ఎంతోమంది ఉంటారు. కానీ నిన్ను తన ప్రాణంగా భావించి, తన సర్వస్వంగా చూసుకునే ఈ యశోదమ్మ మాత్రం ఎక్కడ దొరుకుతుంది నాన్నా?” 
బృందావనం ఎప్పటికీ మరిచిపోలేని ఆ వీడ్కోలు!
చివరికి కృష్ణుడిని రథం మీద కూర్చోబెట్టారు. అక్రూరుడితో పాటు నందుడు కూడా బయలుదేరేందుకు సిద్ధమయ్యారు.
యశోదమ్మ రథం వెనుక నిలబడి నందుడిని పదే పదే పిలుస్తోంది.
“ఏమండీ, దేవకికి ఓ మాట చెప్పండి. నా కన్నయ్య కాస్త అల్లరి చేస్తాడు. అంతమాత్రాన అతన్ని తిట్టి బాధపెట్ట వద్దని చెప్పండి!”
రథం మెల్లగా ముందుకు కదిలింది.
యశోదమ్మ మళ్లీ అంది.
“మరో మాట కూడా చెప్పండి. నా కన్నయ్యకు తాజా వెన్నంటే చాలా ఇష్టం. పాత వెన్న తినిపించవద్దని చెప్పండి!”
నందుడి కళ్లలో నీళ్లు తిరిగాయి. గుర్రాలను ముందుకు నడిపించారు. కానీ యశోదమ్మ గొంతు మాత్రం ఆయన చెవుల్లో మారుమోగుతూనే ఉంది.
“ఇంకో మాట! నా గారాలపట్టికి పెద్ద పెద్ద ముద్దలు పెట్టవద్దని చెప్పండి. గొంతులో అడ్డం పడతాయి. చిన్న చిన్న ముద్దలే తినిపించమనండి!”
ఇక నందుడికి వెనక్కి తిరిగి చూసే ధైర్యం కూడా లేకపోయింది.
రథం క్రమంగా దూరమవుతోంది. దుమ్ము మేఘాలు పైకి లేచాయి. చూస్తుండగానే కన్నయ్య రూపం యశోదమ్మ కళ్లకు కనిపించకుండా పోయింది.
ఆమె అక్కడే నేలపై కూర్చుండిపో యింది.
ఆమె హృదయంలో మిగిలింది ఒక్కటే ప్రార్థన.
“నా కన్నయ్యకు చెప్పండి… తన అమ్మను ఎప్పటికీ మర్చిపోవద్దని!” 
అటు రథంలో కన్నయ్య మనసులోని మౌనవేదన!
కన్నయ్య రథంలో కూర్చుని ఉన్నాడు.
రథం మథుర వైపు కదులుతోంది. కానీ అతని మనసు మాత్రం పదేపదే బృందావన వీధుల్లోకి వెళ్తోంది.
వెన్నకుండ తన కోసం ఎదురుచూసే ఆ ఇంటి ఆవరణ గుర్తుకొస్తోంది.
అమ్మ తిట్టులో కూడా ప్రేమ కనిపించే ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి.
ప్రపంచంలోని బాధలన్నీ మరిచిపోయేలా చేసే యశోదమ్మ ఒడిలోని వెచ్చదనం గుర్తుకొస్తోంది.
కన్నయ్య మౌనం ఇలా చెబుతున్నట్టుగా ఉంది…
“అమ్మా, ప్రపంచమంతా నన్ను దేవకీనందనుడని పిలుస్తుంది. కానీ నీ ఒడిలో గడిపిన ఆ చిన్ననాటి రోజులు నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి.
మథురలో నా కర్తవ్యం నాకోసం ఎదురుచూస్తోంది. కానీ నా బాల్యం మాత్రం బృందావనంలోనే ఉండి పోతుంది.
అమ్మా, నీ చేతి వెన్నను, నీ ప్రేమను, నీ చీరకొంగులో దొరికిన ఆ వెచ్చదనాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను!” 
కన్నయ్య మథురకు వెళ్తున్నాడు. కానీ అతనితో పాటు బృందావన జ్ఞాపకాలు, యశోదమ్మ చేతి వెన్న, ఆమె అపారమైన ప్రేమ కూడా ప్రయాణిస్తున్నాయి.
ఈ కథలోని అసలైన సందేశం...
తల్లి కావడం అంటే కేవలం జన్మనివ్వడం మాత్రమే కాదు… తన ప్రేమతో ఓ బిడ్డ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దడం కూడా!
దేవకీదేవి కృష్ణుడికి జన్మనిచ్చింది.
యశోదమ్మ తన మమతతో అతని బాల్యాన్ని అందంగా మలిచింది.
ఇద్దరి ప్రేమా అమూల్యమైనదే. ఒకరి ప్రేమను మరొకరితో పోల్చలేం.
అయితే యశోదమ్మ త్యాగం ప్రత్యేకమైనది. ఎందుకంటే, తన ప్రాణంగా పెంచుకున్న బిడ్డ తనకు దూరమవుతున్నా, అతని సంతోషం కోసం తన బాధను మనసులోనే దాచుకుంది.
అతన్ని ఆపాలని ఆమె మనసు ఎంతగా తపించినా, అతని జీవితంలో ముందున్న బాధ్యతలను అర్థం చేసుకుంది.
తన కన్నీళ్ల కంటే కన్నయ్య సంతోషానికే ఎక్కువ విలువ ఇచ్చింది.
కొన్ని బంధాలు హక్కుల వల్ల కాదు… త్యాగం వల్ల శాశ్వతంగా నిలిచిపో తాయి.
కొన్ని ప్రేమలు మాటల్లో చెప్పలేం… కన్నీళ్లలోనే బయటపడతాయి.
మరికొన్ని వీడ్కోళ్లు జీవితాంతం గుండెల్లో మిగిలిపోతాయి. బిడ్డ కొత్త ప్రయాణంలో ముందుకు సాగుతుంటే, తల్లి హృదయం మాత్రం అతని చిన్ననాటి జ్ఞాపకాల దగ్గరే ఆగిపోతుంది. 
కామెంట్‌లు