అర్హులా?: - కొత్త విరిత
 

జీవితంలో కొంతమందిని ప్రేమిస్తాం… అది వేర్వేరు దశల్లో పుట్టే ఒక అందమైన భావన.ప్రేమించడానికి కారణాలున్నట్లే, కోపం తెప్పించడానికి కూడా కొంతమందికి కారణాలుంటాయి.
ప్రేమించిన వాళ్లకి మనసులో చోటిస్తాం, వాళ్లు ఆ స్థానానికి అర్హులని భావించి.మరి మనకి కోపం తెప్పించే వాళ్లకి కూడా మనసులో చోటివ్వాలా?
మన ప్రశాంతతను దోచుకునేంత ప్రాధాన్యత వాళ్లకి నిజంగా ఉందా?
వాళ్లు మన గురించి ఒక్క క్షణం ఆలోచించకపోయినా, మనం వాళ్ల గురించి గంటల తరబడి ఆలోచిస్తాం.వాళ్ల తప్పుకి శిక్ష వాళ్లకి కాదు, మన ప్రశాంతతకే పడుతుంది.కోపం కూడా ఒక రకమైన "ప్రాధాన్యతే" మనసులో వాళ్లకి ఇచ్చే మరో సీటే!
అయితే ప్రతి ఒక్కరికీ ఆ సీటు ఎందుకు రిజర్వ్ చేయాలి?కొంతమందిని క్షమించడం మనసుకు విముక్తి,వాళ్లను మర్చిపోవడం ఇంకా పెద్ద విముక్తి.ప్రతి సంబంధాన్ని కాపాడాల్సిన అవసరం లేదు… కొన్ని దూరాలను కాపాడుకోవాల్సి ఉంటుంది.
మనసు ఒక ఇల్లు అయితే, తలుపు ఎవరికైనా తెరవడం మంచితనం కాదు… విచక్షణ లేకపోవడం.మన ఆనందానికి విలువ తెలిసిన వాళ్లను దగ్గర ఉంచుకుందాం… మన ప్రశాంతతకు విలువ తెలియని వాళ్లను దూరంగా ఉంచుదాం.
ఎందుకంటే మన మనసులో స్థలం పరిమితం… దాన్ని కోపం కోసం అద్దెకు ఇవ్వడం మరీ ఖరీదైన వ్యవహారం!
మరి ఎవరికి చోటివ్వాలి, ఎవరిని బయటే ఉంచాలి అనేది…మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను.

కామెంట్‌లు