భాగవతం తృతీయ స్కంధం
అపారమైన శక్తి ఉన్నంత మాత్రాన అది లోకకల్యాణానికి ఉపయోగపడుతుందని చెప్పలేం. ఆ శక్తికి వివేకం, సంయమనం, ధర్మబద్ధమైన లక్ష్యం తోడైనప్పుడే సృష్టికి మేలు జరుగుతుంది. శ్రీమద్భాగవతంలోని తృతీయ స్కంధం, ద్వాదశ అధ్యాయంలో మైత్రేయ మహర్షి విదురునికి వివరించిన బ్రహ్మరుద్రుల సంవాదం ఈ సత్యాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తుంది.
సృష్టికార్యాన్ని చేపట్టిన బ్రహ్మదేవుడు తన మనస్సు నుంచి సనకుడు, సనందనుడు, సనాతనుడు, సనత్కుమారుడు అనే నలుగురు మహర్షులను సృష్టించాడు. సంతానోత్పత్తి ద్వారా సృష్టిని విస్తరించాలని వారిని ఆదేశించాడు. అయితే పరమాత్మ ధ్యానం, ఆత్మజ్ఞానం, మోక్షసాధనలకే అంకితమైన సనకాదులు ఆ ఆజ్ఞను అంగీకరించలేదు. వారి నిరాకరణతో బ్రహ్మలో క్రోధం ఉద్భవించింది. దానిని నియంత్రించేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆయన కనుబొమ్మల మధ్య నుంచి నీలలోహిత వర్ణంలో ఒక బాలుడు ఆవిర్భవించాడు. రోదిస్తున్న ఆ బాలునికి బ్రహ్మ 'రుద్రుడు' అని నామకరణం చేశాడు.
అనంతరం రుద్రునికి పదకొండు నామాలు, పదకొండు నివాసస్థానాలు, పదకొండు మంది సహధర్మచారిణులను నిర్దేశించి, సంతానాన్ని సృష్టించమని ఆదేశించాడు. బ్రహ్మ ఆజ్ఞను స్వీకరించిన రుద్రుడు తనతో సమానమైన బలం, రూపం, ఉగ్రస్వభావం కలిగిన అనేకమంది సంతానాన్ని సృష్టించాడు. వారు అపరిమితంగా విస్తరించి విశ్వమంతటా వ్యాపించారు. వారి ఉగ్రత్వం ఎంత తీవ్రంగా ఉందంటే, నేత్రాల నుంచి వెలువడుతున్న అగ్నిజ్వాలలు దిక్కులన్నింటినీ దహించసాగాయి. ఆ జ్వాలలు బ్రహ్మదేవునికీ ముప్పుగా పరిణమించాయి.
తాను అప్పగించిన సృష్టికార్యం విధ్వంసానికి దారితీస్తుండటాన్ని గమనించిన బ్రహ్మ వెంటనే రుద్రుని నిలువరించాడు. ఇటువంటి ఉగ్రస్వభావం కలిగిన జీవులను ఇకపై సృష్టించవద్దని ఆదేశించాడు. ఇక్కడ బ్రహ్మ రుద్రుని శక్తిని తిరస్కరించలేదు. ఆ శక్తి లోకకల్యాణానికి అనుకూలంగా పరిణమించాలని ఆకాంక్షించాడు. సృష్టి విస్తరణతోపాటు సమస్త జీవరాశుల రక్షణ కూడా అత్యంత ముఖ్యమని తెలియజేశాడు.
అనంతరం రుద్రునికి తపస్సు చేయమని ఉపదేశించాడు. తపస్సు వల్ల రుద్రునికి శ్రేయస్సు కలగడమే కాకుండా, సమస్త జీవులకు సుఖశాంతులు లభిస్తాయని వివరించాడు. తపస్సు ద్వారా శక్తిని నియంత్రించుకొని, సృష్టికార్యాన్ని సమర్థంగా నిర్వహించగలవని సూచించాడు.
బ్రహ్మ ఉపదేశంలోని అత్యంత విశిష్టమైన అంశం పరమాత్మ సాక్షాత్కారానికి తపస్సు ప్రధాన సాధనమని తెలియజేయడం. ఇంద్రియాలకు అతీతుడై, సమస్త జీవుల హృదయాలలో అంతర్యామిగా నివసించే పరమాత్మను కేవలం బాహ్యదృష్టితో గ్రహించడం సాధ్యం కాదు. తపస్సు ద్వారా అంతఃకరణం పరిశుద్ధమైనప్పుడే పరమాత్మ దివ్యజ్యోతిని అనుభవించగల ఆధ్యాత్మిక అర్హత కలుగుతుంది.
తపస్సు అంటే కేవలం అరణ్యాలకు వెళ్లి కఠిన నియమాలు ఆచరించడం మాత్రమే కాదు. మనస్సును నిగ్రహించడం, ఇంద్రియాలను నియంత్రించడం, కోరికలను పరిమితం చేసుకోవడం, అహంకారాన్ని విడిచిపెట్టడం కూడా తపస్సులో భాగాలే. క్రోధాన్ని సహనంగా, ఆవేశాన్ని ఆత్మసంయమనంగా మార్చుకోవడమే దాని అంతరార్థం.
బ్రహ్మ ఉపదేశాన్ని వినయంతో స్వీకరించిన రుద్రుడు ఆయనకు ప్రదక్షిణం చేసి, తపస్సు కోసం అరణ్యానికి వెళ్లాడు. అనంతరం బ్రహ్మ సృష్టి విస్తరణ కోసం మరీచి, అత్రి తదితర మహర్షులను సృష్టించాడు. ఈ విధంగా రుద్రుని ఉగ్రసృష్టిని నిలువరించడం, ఆయనను తపస్సు వైపు మళ్లించడం, సృష్టికార్యాన్ని మరొక విధంగా కొనసాగించడం అనే మూడు పరిణామాలు ఈ ఘట్టంలో కనిపిస్తాయి.
ఈ భాగవత వృత్తాంతం మానవ జీవితానికి అమూల్యమైన సందేశాన్నిస్తుంది. జ్ఞానం, సంపద, అధికారం, సామర్థ్యం ఉన్నప్పటికీ ఆత్మనిగ్రహం లేకపోతే అవి అశాంతికి కారణమవుతాయి. వివేకంతో కూడిన శక్తి మాత్రమే వ్యక్తికీ, సమాజానికీ శ్రేయస్సును కలిగిస్తుంది.
బాహ్య ప్రపంచాన్ని జయించడం కంటే అంతరంగాన్ని జయించడం గొప్ప విజయం. క్రోధాన్ని జయించినవాడు శాంతిని పొందుతాడు. తపస్సుతో చిత్తశుద్ధిని సాధించినవాడు పరమాత్మ తత్త్వాన్ని గ్రహించగలడు. ఇదే బ్రహ్మ రుద్రునికి బోధించిన మహోన్నత ఆధ్యాత్మిక సత్యం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి