కృష్ణ భక్తుడైన సర్దార్ జీ ప్రేమకథ : - - యామిజాల జగదీశ్


 పంజాబ్‌లోని అమృత్‌సర్ నగరంలో సర్దార్ హర్‌జీత్ సింగ్‌జీ నివసించే వారు. తలపై ఎత్తుగా కట్టిన నీలిరంగు పగిడీ, ముఖంలో తేజస్సు, నోట నిత్యం వాహెగురు నామస్మరణ, హృదయంలో శ్రీకృష్ణుడిపై అంతులేని ప్రేమ! ఆయన భక్తిని చూస్తే గొప్ప భక్తుల మనసులు సైతం భక్తితో నిండిపోయేవి.
ఆయన ఇంట్లో శ్రీ గురు గ్రంథ్ సాహిబ్‌కు ఎంతో గౌరవం ఉండేది. ఆయన హృదయంలో మాత్రం శ్రీకృష్ణుడి వేణుగానం ఎప్పుడూ మధురంగా వినిపిస్తుండేది.
చాలా మంది ఆయనను తరచూ ఒక ప్రశ్న అడిగేవారు.
“సర్దార్ జీ, మీరు సిక్కు మతానికి చెందినవారు కదా! మరి శ్రీకృష్ణుడిని ఇంతగా ఎందుకు ఆరాధిస్తారు?”
హర్‌జీత్ సింగ్‌జీ చిరునవ్వుతో ఇలా చెప్పేవారు.
“సోదరా! ప్రేమకు మతంతో సంబంధం లేదు. ఏ దైవనామం పలికితే మన కళ్లలో నీళ్లు తిరుగుతాయో, ఆ నామంలో భగవంతుడి కృప ఉందని అర్థం చేసుకోవాలి. నేను వాహెగురు అన్నా, గోవిందా అన్నా, నా తల వాలేది ఆ ఒక్క పరమాత్మ ముందే!”
అలా చెబుతున్నప్పుడు ఆయన కళ్లలో నీళ్లు తిరిగేవి. పెదవులపై నుంచి మధురమైన మాటలు వెలువడేవి.
“వాహెగురు కూడా నావాడే, సాంవరియా కూడా నావాడే! పేర్లు ఎన్నో ఉన్నా, నా దైవం మాత్రం ఒక్కడే!”
కానీ ఆయన భక్తికి అసలైన పరీక్ష ఇంకా ముందే ఉంది.
గురుబాణీలో వినిపించిన గోవిందుడి నామం
ఒకరోజు హర్‌జీత్ సింగ్‌జీ గురుద్వారాలో కూర్చుని శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ పఠనం వింటున్నారు.
ఆ సమయంలో గ్రంథీ సింగ్‌జీ, శ్రీ గురు గ్రంథ్ సాహిబ్‌లోని అంగం 6లో ఉన్న గురునానక్ దేవ్‌జీ వాక్యాన్ని చదివారు... గోపికలు, గోవిందుడు కూడా ఆ పరమాత్మ మహిమను వర్ణిస్తారు.
ఆ వాక్యం వినగానే హర్‌జీత్ సింగ్‌జీ కళ్ల నుంచి కన్నీళ్లు ధారగా కారాయి.
రెండు చేతులూ జోడించి మనసారా ప్రార్థించారు.
“ఓ నా సద్గు రూ! ఈ రోజు నా హృదయం ఆనందంతో నిండిపోయింది. నా చెవుల్లో గురుబాణీ మధురంగా వినిపిస్తోంది. నా మనసులో నా సాంవరియా రూపం మెదులుతోంది. ఎవరినీ ద్వేషించని మనసు నాకు ప్రసాదించు. ఎవరి హృదయాన్నీ బాధపెట్టకుండా జీవించేలా దీవించు. ప్రతి ప్రాణిలో నీ వెలుగును చూసే జ్ఞానం ఇవ్వు.”
ఆ రోజు నుంచి ఆయన భక్తిలో మరింత లోతు పెరిగింది.
గురుద్వారాలో సేవ చేసేవారు. ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టేవారు. ఇంటికి తిరిగొచ్చాక తన చిన్న కృష్ణుడి విగ్రహం ముందు కూర్చుని ప్రేమగా ఇలా చెప్పేవారు.
“శ్యామ్ ప్రియా! ఈ రోజు నీ పేరు మీద ఒక ఆకలితో ఉన్నవారికి రొట్టె పెట్టాను. నా సేవలో ఏదైనా లోపం ఉంటే నన్ను క్షమించు.”
ఆయనకు భక్తి అంటే కేవలం పూజలు చేయడం కాదు. ప్రతి ప్రాణికి సేవ చేయడం!
ఆకలితో ఉన్న బాలుడి నవ్వులో కనిపించిన కృష్ణుడు
అమృత్‌సర్ సమీపంలోని ఓ చిన్న గ్రామంలో హర్‌జీత్ సింగ్‌జీకి ధాన్యపు దుకాణం ఉండేది.
ఒక చలికాలపు రాత్రి ఓ పేద కుటుంబం ఆయన దుకాణానికి వచ్చింది. ఆ ఇంట్లో కొన్ని రోజులుగా పొయ్యి వెలగలేదు. పిల్లలకు తినడానికి ఏమీ లేదు.
ఆ కుటుంబ పెద్ద ఎంతో సంకోచంతో అడిగాడు.
“సర్దార్ జీ, పిల్లల కోసం కొంచెం పిండి కావాలి. ప్రస్తుతం నా దగ్గర డబ్బులు లేవు. కూలి డబ్బులు రాగానే మీకు తిరిగి ఇచ్చేస్తాను.”
హర్‌జీత్ సింగ్‌జీ ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. వెంటనే పిండి బస్తా తీసుకుని ఆ కుటుంబం ఇంటికి వెళ్లి ఇచ్చారు.
ఆ వ్యక్తి కృతజ్ఞతతో ఇలా అన్నాడు...
“సర్దార్ జీ, మీరు చేసిన ఈ సహాయాన్ని జీవితాంతం మర్చిపోలేను.”
హర్‌జీత్ సింగ్‌జీ అతని భుజంపై చేయి వేసి ప్రేమగా చెప్పారు.
“నాకు కృతజ్ఞతలు చెప్పొద్దు. ఏదో ఒక రోజు నా ఇంట్లో ధాన్యం లేకపోయి, నీ ఇంట్లో ఉంటే నువ్వు నాకు భోజనం పెట్టు. మనమంతా ఆ ఒక్క పరమాత్మ బిడ్డలమే!”
ఆ రాత్రి ఇంటికి తిరిగొచ్చిన ఆయన, తన కృష్ణుడి విగ్రహం ముందు కూర్చున్నారు.
కళ్లు మూసుకున్నారు. హృదయంలో కృష్ణుడిని చూడాలన్న ఆరాటం ఉప్పొంగింది.
“కన్న య్యా! నిన్ను వెతుక్కుంటూ బృందావనం రావడానికి నాకు వీలుకావడం లేదు. వయసు పెరుగుతోంది. శరీరం కూడా మునుపటిలా సహకరించడం లేదు. కనీసం కలలోనైనా నీ వేణుగానం వినిపించవా?”
ఆ రాత్రి ఆయనకు ఓ అద్భుతమైన కల వచ్చింది.
యమునా నది ఒడ్డున ఓ నల్లని కుర్రవాడు వేణువు ఊదుతున్నాడు. తలపై నెమలిపింఛం, ముఖంలో చిరునవ్వు, కళ్లలో అంతులేని కరుణ!
ఆ బాలుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు.
“హర్‌జీత్! నువ్వు నన్ను బృందావనంలో వెతుకుతున్నావు. కానీ నిన్న ఆకలితో ఉన్న ఆ బిడ్డకు రొట్టె దొరికినప్పుడు అతని ముఖంలో కనిపించిన చిరునవ్వు కూడా నేనే కదా!”
ఆ మాటలు వినగానే సర్దార్ జీ ఆ బాలుడి పాదాలను పట్టుకున్నారు.
“నా శ్యామా! నువ్వు నాకు దర్శనమిచ్చావు!”
అంతలోనే ఆయనకు మెలకువ వచ్చింది.
గదిలో నిశ్శబ్దం అలుముకుంది. ఎదురుగా కృష్ణుడి విగ్రహం కనిపిస్తోంది. ఆయన కళ్ల నుంచి మాత్రం కన్నీళ్లు ఆగడం లేదు.
చాలాసేపు చేతులు జోడించి అలాగే కూర్చున్నారు.
ఆ రోజు ఆయనకు ఓ గొప్ప సత్యం అర్థమైంది.
భగవంతుడిపై భక్తి, మనుషులకు చేసే సేవ రెండూ వేర్వేరు కావు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడంలోనూ, బాధలో ఉన్నవారిని ఆదుకోవడంలోనూ భగవంతుడిని చూడవచ్చు.
గురుబాణీలో కృష్ణుడి ప్రస్తావన
కాలం గడిచింది. హర్‌జీత్ సింగ్‌జీ కృష్ణభక్తి గురించి చుట్టుపక్కల గ్రామాల్లో కూడా తెలిసింది.
ఒకరోజు కొందరు ఆయన దగ్గరకు వచ్చారు. వారిలో ఒకరు ఇలా అడిగారు.
“సర్దార్ జీ, కృష్ణుడు మీ హృదయంలో ఉన్నాడని చెబుతున్నారు కదా! మరి మీరు కృష్ణుడిని ఏ రూపంలో చూస్తారు?”
హర్‌జీత్ సింగ్‌జీ వినయంగా సమాధానం ఇచ్చారు.
“నాకు కృష్ణుడంటే ప్రేమను నేర్పించే ఆ సాంవరియా. బలహీనులను కాపాడాలనే స్ఫూర్తినిచ్చే గోపాలుడు. ఆయనను తలచుకుంటే మనసు నిర్మలంగా మారుతుంది. ఆయనే నా గోవిందుడు!”
తర్వాత శ్రీ గురు గ్రంథ్ సాహిబ్‌లోని అంగం 338లో ఉన్న భగత్ కబీర్‌జీ వాణిలోని భావాన్ని వారికి వివరించారు - భగత్ కబీర్‌జీ, నందుడి ఇంట శ్రీకృష్ణుడు అవతరించిన విషయాన్ని భక్తి సందర్భంలో ప్రస్తావిస్తారు.
హర్‌జీత్ సింగ్‌జీ ఇలా చెప్పారు.
“సోదరులారా! నా సద్గు రువు వాణిలో కూడా కృష్ణుడి కథ ప్రస్తావన ఉంది. ఆ వాణిని నేను ఎంతో భక్తితో స్వీకరిస్తాను. కానీ నా భక్తి ఉద్దేశం ఎవరితోనైనా వాదించడం కాదు. నా మనసులో ప్రేమ పెరగాలి, అహంకారం తగ్గాలి. నేను కోరుకునేది అంతే!”
ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి. భావోద్వేగంతో ఇలా అన్నారు.
“నేను మరొకరి నమ్మకాన్ని అవమానించిన రోజున నా భక్తి అసంపూర్ణమవుతుంది. నా శ్యాముడిని చేరుకునే దారి ప్రేమతోనే మొదలవుతుంది.”
ఆయన మాటలు విన్నవారంతా మౌనంగా ఉండిపోయారు.
 బృందావనంలో సాంవరియా దర్శనం
చాలా ఏళ్లుగా హర్‌జీత్ సింగ్‌జీకి బృందావనం వెళ్లాలనే కోరిక ఉండేది.
ఒకరోజు తన కుటుంబ సభ్యులతో ఇలా అన్నారు.
“ఈసారి నేను నా సాంవరియా ధామానికి వెళ్తాను. జీవితంలో ఎన్నో చూశాను. ఇప్పుడు నా కన్నయ్య లీలలు సాగించిన పవిత్ర భూమిని చూడాలని ఉంది.”
కుటుంబ సభ్యులతో కలిసి ఆయన బృందావనం చేరుకున్నారు.
గుళ్లలో గంటలు మోగుతున్నాయి. వీధులన్నీ ‘రాధే రాధే’ నామస్మరణతో మారుమోగుతున్నాయి. దుకాణాల్లో ఠాకూర్ జీ కిరీటాలు అందంగా అలంకరించి ఉన్నాయి. భక్తులంతా ఆనందంతో ఆలయాల వైపు వెళ్తున్నారు.
తలపై పగిడీతో హర్‌జీత్ సింగ్‌జీ నెమ్మదిగా బాంకే బిహారీ ఆలయం వైపు నడిచారు.
దైవదర్శనం చేసుకునే సమయం వచ్చింది.
శ్రీ బాంకే బిహారీ జీ అందమైన ముఖాన్ని చూడగానే ఆయన అడుగులు అక్కడే ఆగిపోయాయి.
పెదవులు వణికాయి.
“ఓ నా శ్యామా! నేను వచ్చేశాను!”
ఆయన కళ్ల నుంచి జారిన కన్నీళ్లు పొడవాటి గడ్డం మీదుగా కుర్తాపై పడుతున్నాయి.
రెండు చేతులూ జోడించి ప్రార్థించారు.
“నా ప్రభూ! నాకు ధనం వద్దు. నా కుటుంబానికి గొప్ప గొప్ప సుఖాలు కావాలని కూడా కోరుకోవడం లేదు. నా హృదయంలో నీపై ప్రేమ ఎప్పటికీ తగ్గకుండా చూడు. నా చేతులు సేవ చేస్తూనే ఉండాలి. నా మాటలు ఎవరినీ బాధపెట్టకూడదు. నా మనసులో నీ జ్ఞాపకం ఎప్పుడూ నిలిచి ఉండాలి!”
అదే సమయంలో ఓ చిన్న బాలుడు తన తల్లి చేయి పట్టుకుని ఆయన పక్క నుంచి వెళ్తున్నాడు.
ఆ బాలుడు సర్దార్ జీ వైపు చూసి చిరునవ్వుతో అడిగాడు.
“బాబాజీ! మీరు ఎందుకు ఏడుస్తున్నారు? బిహారీ జీ ఇక్కడే ఉన్నారుగా!”
హర్‌జీత్ సింగ్‌జీ ఆ బాలుడి ముఖంలోకి చూశారు.
ఆ చిన్నారి కళ్లలో ఏదో వింత వెలుగు కనిపించింది.
ఆయన ప్రేమగా అడిగారు.
“బాబూ, నీ పేరేంటి?”
బాలుడు చిరునవ్వు నవ్వి, తన తల్లి చేయి పట్టుకుని జనంలో ముందుకు వెళ్లిపోయాడు.
హర్‌జీత్ సింగ్‌జీ అతని వెనుక కొన్ని అడుగులు వేశారు. కానీ ఆ బాలుడు ఎక్కడా కనిపించలేదు.
ఆయన మళ్లీ ఆలయం వైపు చూశారు. పెదవులపై నుంచి ఒక మాట వెలువడింది.
“శ్యామా... నువ్వేనా అది?”
తర్వాత అక్కడే కూర్చుని చాలాసేపు కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఆ రోజు నుంచి బృందావనం ఆయనకు కేవలం ఓ పుణ్యక్షేత్రం కాదు. జీవితాంతం హృదయంలో దాచుకునే ప్రేమానుభూతిగా మారిపోయింది.
స్వచ్ఛమైన భక్తి అంటే ఏమిటి?
బృందావనం నుంచి తిరిగొచ్చాక కూడా హర్‌జీత్ సింగ్‌జీ మునుపటిలాగే సేవ చేస్తూ జీవించారు.
ఒకరోజు ఓ యువకుడు ఆయన దగ్గరకు వచ్చాడు.
“సర్దార్ జీ! నేను కూడా భగవంతుడిని ప్రేమించాలనుకుంటున్నాను. నిజమైన భక్తి ఎలా లభిస్తుంది? దయచేసి నాకు చెప్పండి.”
హర్‌జీత్ సింగ్‌జీ అతన్ని పక్కన కూర్చోబెట్టుకున్నారు.
తర్వాత శ్రీ గురు గ్రంథ్ సాహిబ్‌లోని అంగం ఉన్న ఈ వాక్యం... గోవిందుడి నామస్మరణతో మనిషి ముఖం తేజోవంతమవుతుంది. అతనికి గౌరవం లభిస్తుంది...
సర్దార్ జీ ఆ యువకుడికి ఇలా వివరించారు.
“బాబూ! భగవంతుడి నామాన్ని నోటితో పలకడం మాత్రమే సరిపోదు. మనస్ఫూర్తిగా స్మరించాలి. దేవుడి పేరు చెబుతూ ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టకపోతే, బాధలో ఉన్నవారికి అండగా నిలబడకపోతే, ఇతరులను తక్కువగా చూస్తే మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.”
మరికొన్ని మాటలు చెప్పారు.
“నువ్వు ఏ పేరుతో నీ దేవుడిని పిలిచినా, ఆ నామంపై నిజమైన విశ్వాసం ఉంచు. నీ మతాన్ని గౌరవించు. ఇతరుల మతాన్ని కూడా గౌరవించు. అహంకారాన్ని వదిలేయి. సేవను అలవాటు చేసుకో. మనసు నిండా ప్రేమను పెంచుకో.”
ఆ యువకుడు ఆయన పాదాలకు నమస్కరించబోయాడు.
కానీ హర్‌జీత్ సింగ్‌జీ అతన్ని ఆపి ప్రేమగా కౌగిలించుకున్నారు.
“నా సోదరా! దేవుడి ముందు తల వంచడం ఎంత ముఖ్యమో, బాధలో ఉన్నవారి కన్నీళ్లు తుడవడానికి తల వంచడం కూడా అంతే ముఖ్యం. అదే నా భక్తి సంపాదించిన అసలైన సంపద!”
వాహెగురు నామంలోనూ, శ్యాముడి ప్రేమలోనూ...
హర్‌జీత్ సింగ్‌జీ తన ఠాకూర్ జీ ముందు కూర్చున్న ప్రతిసారీ ఆయన కళ్లు కన్నీటితో నిండిపోయేవని చెబుతారు.
ఒకవైపు ఆయన జీవితంలో గురుబాణీ వాణి, మరోవైపు శ్రీకృష్ణుడిపై అంతులేని ప్రేమ!
రెండు చేతులూ జోడించి ఇలా ప్రార్థించేవారు.
“ఓ వాహెగురూ! ఓ నా గోవిందా! నా హృదయంలో ఎవరూ పరాయివారిగా అనిపించకుండా ప్రేమను నింపండి. నా పగిడీ గౌరవం నా ప్రవర్తనలో కనిపించాలి. నా కృష్ణభక్తి నా పనుల్లో కనిపించాలి!”
తర్వాత మెల్లగా ఓ భక్తిగీతం ఆలపించేవారు.
“నా తలపై గురువు కృప ఉండాలి,
నా హృదయంలో శ్యాముడి ప్రేమ నిలవాలి.
సేవలోనే నా జీవితం గడవాలి,
ప్రతి శ్వాసలో ప్రభువు నామం వినిపించాలి!”
ఎవరైనా ఆయనను ఇలా అడిగేవారు.
“సర్దార్ జీ! మీకు భగవంతుడు ఎక్కడ కనిపిస్తాడు?”
ఆయన చిరునవ్వుతో సమాధానం చెప్పేవారు.
“నేను గురుబాణీ విన్నప్పుడు నా తల భక్తితో వంగుతుంది. నా శ్యాముడి రూపాన్ని చూసినప్పుడు నా కళ్లు ప్రేమతో నిండిపోతాయి. బాధలో ఉన్నవారికి సహాయం చేసినప్పుడు మాత్రం నా మనసు ఒకటే చెబుతుంది. ఈ రోజు నా ప్రభువు నాకు తన సేవ చేసే అవకాశం ఇచ్చాడు!”
హర్‌జీత్ సింగ్‌జీ నమ్మకం ఒక్కటే.
నిజమైన భక్తుడు అంటే కేవలం తన ఇష్టదైవం పేరు పలికేవాడు కాదు. తన వల్ల మరొకరి ముఖంలో చిరునవ్వు పూయించేవాడు.
ఎందుకంటే భక్తిలో ప్రేమ ఉండాలి. సేవ ఉండాలి. ప్రతి మనిషి పట్ల గౌరవం ఉండాలి.
మతాలు వేరైనా ప్రేమ ఒక్కటే. దైవనామాలు వేరైనా పరమాత్మ ఒక్కడే. నిజమైన భక్తి మనిషిని మనిషికి దగ్గర చేస్తుంది.
కామెంట్‌లు