పాత పుస్తకాల్ని పాడుచేసే పురుగుల్ని గబ్బిలాలు తింటాయి. అందుకే అక్కడి విలువైన పుస్తకాలకు అవే సహజమైన రక్షకులుగా మారాయి!
యూరప్‌లోనే అతి పురాతన విద్యాసంస్థల్లో ఒకటైన కోయింబ్రా విశ్వవిద్యాలయం నడిబొడ్డున జోవానినా లైబ్రరీ ఉంది. అద్భుతమైన బరోక్ శైలి నిర్మాణం, అందమైన చెక్క అరలు, అరుదైన పుస్తకాలతో ఈ గ్రంథాలయం ఓ అద్భుత ప్రపంచంలా కనిపిస్తుంది. అయితే దీని ప్రత్యేకత కేవలం అందమైన నిర్మాణం మాత్రమే కాదు. రెండొందల ఏళ్లకు పైగా అక్కడ గబ్బిలాల గుంపు నివసిస్తోందట!
రాత్రి కాగానే, చెక్క అరల మధ్య దాక్కున్న గబ్బిలాలు బయటకు వచ్చి గ్రంథాలయంలో ఎగురుతూ, పాత పుస్తకాల్ని పాడుచేసే పురుగుల్ని తింటాయి. ఇలా ఎలాంటి రసాయనాలూ వాడకుండా, పుస్తకాల్ని దెబ్బతీసే కీటకాల నుంచి అమూల్యమైన గ్రంథాల్ని కాపాడ టంలో ఇవి కీలక పాత్ర పోషిస్తు న్నాయి.
అయితే గబ్బిలాల వల్ల చెక్క బల్లల మీద, ఇతర వస్తువుల మీద రెట్టలు పడకుండా ఉండేందుకు సిబ్బంది ప్రతి రాత్రి చదివే బల్లలపై ప్రత్యేకమైన తోలును కప్పుతారు. తెల్లవారాక వాటిని తీసేసి, గ్రంథాలయాన్ని శుభ్రం చేస్తారు. ఆ తర్వాత మళ్లీ యథా విధిగా పుస్తక పఠనం కొనసాగుతుంది.
ఈ జోవానినా లైబ్రరీలో సుమారు 60,000 పుస్తకాలు ఉన్నాయి. వాటిలో అరుదైన రాతప్రతులు, 17వ, 18వ శతాబ్దాలకు చెందిన పుస్తకాలు, ఎంతో విలువైన చారిత్రక గ్రంథాలు ఉన్నాయి. ఇన్ని విలువైన పుస్తకాల్ని కాపాడటంలో గబ్బిలాలు కూడా తమ వంతు సాయం చేస్తున్నాయి. మనుషులు, ప్రకృతి కలిసి సాగిస్తున్న ఈ అరుదైన సహజీవనం ప్రపంచవ్యాప్తంగా సందర్శకుల్ని ఆశ్చర్యపరుస్తోంది.
పోర్చుగల్‌లోని కోయింబ్రా నగరానికి వెళ్తే, ఈ అద్భుతమైన గ్రంథాలయాన్ని తప్పక చూడాలి ! చరిత్ర, కళా వైభవం, ప్రకృతి కలిసి కనిపించే ఈ ప్రదేశం ఓ మధురమైన అనుభూతిని మిగులుస్తుందంటారు అక్కడికి వెళ్ళొచ్చిన వారు!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి