*కర్ణుడి దానగుణానికి శ్రీకృష్ణుడు ఇచ్చిన వరాలు!*: -- యామిజాల జగదీశ్


 అది మహాభారత యుద్ధం జరుగుతున్న సమయం. అర్జునుడు, కర్ణుడు మధ్య భీకర పోరు సాగుతోంది. ఆ సమయంలో కర్ణుడి రథచక్రం భూమిలో కూరుకుపోయింది.
అప్పుడు కర్ణుడు భీష్మ పితామహుడు రూపొందించిన యుద్ధ నియమాలను గుర్తుచేస్తూ అర్జునుడితో ఇలా అన్నాడు.
"అర్జునా! నేను నా రథచక్రాన్ని బయటకు తీసేంతవరకు నాపై దాడి చేయకూడదు. ఇది యుద్ధ నియమం" అని చెప్పాడు.
ఆ మాటలు విన్న అర్జునుడు బాణం వేయకుండా ఆగిపోయాడు.
అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో,
"అర్జునా! ఎందుకు ఆగిపోయావు? బాణం వేయి!" అని చెప్పాడు.
దానికి అర్జునుడు, "యుద్ధ నియమా లకు విరుద్ధంగా నేను ఎలా బాణం వేయగలను?" అని అడిగాడు.
అప్పుడు శ్రీకృష్ణుడు అతడికి గతంలో జరిగిన సంఘటనలను గుర్తుచేస్తూ ఇలా అన్నాడు "అర్జునా! అభిమన్యుడు ఒక్కడే యుద్ధం చేస్తున్నప్పుడు ఎంతోమంది కలిసి అతడిపై దాడి చేశారు. అప్పుడు యుద్ధ నియమాలు గుర్తుకు రాలేదా? నిండు సభలో ద్రౌపదిని అవమానించి నప్పుడు ఆ నియమాలు ఏమయ్యా యి? అప్పుడు ధర్మం గుర్తుకు రాలేదా? ఇప్పుడు మాత్రం తనకు ఆపద వచ్చినప్పుడు యుద్ధ నియమాలను గుర్తుచేస్తున్నాడు కర్ణుడు!"
ఈ మాటలు విన్న అర్జునుడికి కోపం వచ్చింది. వెంటనే శివుడు ప్రసాదించిన అస్త్రాన్ని కర్ణుడిపై ప్రయోగించాడు. ఆ బాణం దెబ్బకు కర్ణుడు మృత్యువుకు చేరువయ్యాడు.
**కర్ణుడి దానగుణాన్ని పరీక్షించిన శ్రీకృష్ణుడు**
కర్ణుడు మరణం కోసం ఎదురుచూస్తున్న సమయంలో శ్రీకృష్ణుడు అతడిని పరీక్షించాలని అనుకున్నాడు.
ఒక విప్రుడి రూపంలో కర్ణుడి దగ్గరకు వెళ్లి ఇలా అడిగాడు.
"కర్ణా! నా కుమార్తెకు పెళ్లి జరుగు తోంది. కానీ ఆమెకు కానుకగా ఇవ్వ డానికి నా దగ్గర బంగారం లేదు. నాకు కొంత బంగారం దానం చేయగలవా?"
అప్పుడు కర్ణుడు, "నా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు. నీకు నేనేం దానం చేయగలను?" అని చెప్పాడు.
అప్పుడు ఆ బ్రాహ్మణుడు, "నీ నోటిలో బంగారు పన్ను ఉంది కదా! దాన్ని నాకు దానం చేయి" అని అడిగాడు.
దానికి కర్ణుడు, "నువ్వు ఒక రాయితో నా పంటిని కొట్టి తీసుకో" అని చెప్పాడు.
అయితే ఆ బ్రాహ్మణుడు అందుకు ఒప్పుకోలేదు. "దానం చేసేవాడివి నువ్వే కదా! దానం నువ్వే చేయాలి" అని అన్నాడు.
వెంటనే కర్ణుడు తన పక్కనే ఉన్న రాయిని తీసుకుని, దానితో తన బంగారు పంటిని పగలగొట్టి బ్రాహ్మణుడికి ఇచ్చాడు.
అప్పుడు ఆ బ్రాహ్మణుడు, "ఈ పన్ను రక్తంతో తడిసిపోయింది. ఇది అపవిత్రంగా ఉంది. ముందు శుభ్రం చేసి ఇవ్వు" అని అన్నాడు.
వెంటనే కర్ణుడు తన విల్లును తీసుకుని భూమిపైకి ఒక బాణం వేశాడు. ఆ బాణం తగిలిన చోట నుంచి గంగాజలం వేగంగా పైకి ఉబికి వచ్చింది.
ఆ నీటితో తన బంగారు పంటిని శుభ్రం చేసి బ్రాహ్మణుడికి అందిస్తూ, "ఇప్పుడు ఇది శుభ్రంగా ఉంది. తీసుకోండి" అని చెప్పాడు.
అప్పుడు శ్రీకృష్ణుడు తన నిజరూపంలో ప్రత్యక్షమయ్యాడు.
కర్ణుడి దానగుణానికి సంతోషించి ఇలా అన్నాడు. "కర్ణా! నువ్వు బాణంతో పుట్టించిన ఈ గంగాజలం యుగయుగాల పాటు నీ గొప్పతనాన్ని చాటిచెబుతుంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి ఉన్నంతకాలం మూడు లోకాలలో నీ దానశీలతను అందరూ కొనియాడు తారు. నీతో సమానమైన గొప్ప దాన శూరుడు ఈ ప్రపంచంలో ఇంతవరకు పుట్టలేదు. ఇకపై కూడా పుట్టడు" అని ఆశీర్వదించాడు.
**కర్ణుడు కోరిన మూడు వరాలు**
ఆ తర్వాత శ్రీకృష్ణుడు కర్ణుడితో,
"కర్ణా! నన్ను ఏదైనా వరం కోరుకోవచ్చు" అని చెప్పాడు.
అప్పుడు కర్ణుడు ఇలా కోరాడు.
"స్వామీ! పేద కుటుంబంలో సూతపుత్రుడిగా పుట్టిన కారణంగా నా జీవితంలో ఎన్నో అన్యాయాలు, అవమానాలు ఎదుర్కొన్నాను. మీరు మరోసారి భూమిపై అవతరించిన ప్పుడు వెనుకబడిన వర్గాల ప్రజల జీవితాలు మెరుగుపడేందుకు కృషి చేయాలి. ఇదే నా మొదటి కోరిక.
రెండో వరంగా, మీరు మరోసారి భూమిపై జన్మించినప్పుడు నా రాజ్యంలోనే పుట్టాలి.
మూడో వరంగా, నా అంత్యక్రియలు ఇంతకుముందు ఎవరినీ దహనం చేయని పవిత్రమైన నేలపై జరగాలి" అని కోరాడు.
**కర్ణుడి అంత్యక్రియలకు దొరికిన ఒక్క అంగుళం నేల!**
కర్ణుడి చివరి కోరికను తీర్చడానికి శ్రీకృష్ణుడు భూమి అంతా వెతికాడని కథనం.
గతంలో ఎవరినీ దహనం చేయని స్థలం కోసం వెతికినా అలాంటి నేల ఎక్కడా దొరకలేదు.
చాలాసేపు వెతికిన తర్వాత గుజరాత్‌లోని సూరత్ నగరంలో తాపీ నది ఒడ్డున ఒక్క అంగుళం నేల మాత్రమే అలాంటి ప్రదేశంగా కనిపించిందట. అయితే అంత చిన్న స్థలంలో కర్ణుడి దేహాన్ని ఉంచడం సాధ్యం కాదు. అప్పుడు శ్రీకృష్ణుడు ముందుగా ఆ నేలపై ఒక బాణాన్ని ఉంచి, దానిపై కర్ణుడి దేహాన్ని ఉంచి అంత్యక్రియలు నిర్వహించాడని చెబుతారు. ఈ ప్రదేశాన్నే ఇప్పుడు ప్రజలు **తులసీబడి ఆలయం** పేరుతో గుర్తిస్తున్నారు.
**కర్ణుడి అంత్యక్రియల గురించి పాండవుల సందేహం**
తాపీ నది ఒడ్డున కర్ణుడి అంత్యక్రియలు పూర్తయ్యాక, ఆ నేల ఇంతకుముందు ఎవరినీ దహనం చేయని ప్రదేశమేనా అని పాండవులకు సందేహం కలిగింది.
అప్పుడు శ్రీకృష్ణుడు కర్ణుడిని ప్రత్యక్షం చేసి, అతడి ద్వారా ఆకాశవాణి రూపంలో ఇలా చెప్పించాడట.
"నేను సూర్యభగవానుడి కుమారుడిని. అశ్వినీ దేవతలు నా సోదరులు. తాపీ నది నా సోదరి. నా అంత్యక్రియలు గతంలో ఎవరినీ దహనం చేయని పవిత్రమైన నేలపైనే జరిగాయి" అని కర్ణుడు చెప్పాడు.
అప్పుడు పాండవులు,
"స్వామీ! ఈ విషయం మాకు తెలిసింది. కానీ రాబోయే తరాలకు ఈ విషయం ఎలా తెలుస్తుంది?" అని అడిగారు.
అప్పుడు శ్రీకృష్ణుడు, "ఇక్కడ మూడు ఆకులున్న ఒక మర్రిచెట్టు ఉంటుంది. ఆ మూడు ఆకులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకగా నిలుస్తాయి" అని చెప్పాడట.
**మూడు ఆకులతో ఉన్న మర్రిచెట్టు ప్రత్యేకత!**
ఇక్కడ మూడు ఆకుల మర్రిచెట్టు పేరుతో ఒక ఆలయం ఉంది. ఆ ఆలయ ప్రాంగణంలో వేల సంవత్స రాల నాటి మర్రిచెట్టు ఉందని చెబుతారు.
ఆ చెట్టుకు ఇప్పటివరకు కేవలం మూడు ఆకులు మాత్రమే వచ్చాయని, అవి కూడా ఇప్పటికీ పచ్చగా ఉంటాయని స్థానికుల నమ్మకం.
ఇక్కడ ఎవరైనా నిజమైన విశ్వాసంతో మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే వారి కోరిక తప్పకుండా నెరవేరుతుందని భక్తులు నమ్ముతారు.
**మరణం అంచున ఉన్న సమయంలో కూడా తన దగ్గర ఉన్న చివరి వస్తువును దానం చేసిన కర్ణుడి దానగుణం ఎంతో గొప్పది.**
**దానశీలతకు మారుపేరుగా నిలిచిన కర్ణుడి కథ తరతరాల పాటు గుర్తుండిపోతుంది!** 
కామెంట్‌లు