మనలో కర్ణుడు: - కొత్త విరిత


కత్తులు, బాణాలు, యుద్ధాలు… ఇవి వినగానే మనకు గుర్తొచ్చేది మహాభారతం.అందులోని కొన్ని పాత్రలు మాత్రం కథ ముగిసినా మనతోనే ఎల్లకాలం ఉండిపోతాయి. కర్ణుడిలా.

కర్ణుడు మహాభారతంలోని ఒక పాత్ర మాత్రమే కాదు… ఒక మనస్తత్వం.ఎంత ప్రతిభ ఉన్నా, గుర్తింపు కోసం జీవితాంతం ఎదురుచూసిన మనిషి.తిరస్కారం అతని మనసులో గాయంగా మిగిలింది. అదే గాయం అతన్ని ముందుకు నడిపించే ఇంధనంగా మారింది.“నేను ఎవరికీ తక్కువ కాదు” అని నిరూపించుకోవాలనే కోరిక అతన్ని నడిపించింది.
మనలోనూ ఒక కర్ణుడు ఉంటాడు.మన విలువను, మన గొప్పతనాన్ని గుర్తించమని ప్రపంచాన్ని కోరుతూనే ఉంటాడు.
మనకు మొదటిసారి అవకాశం ఇచ్చిన మేనేజర్‌ను, లేదా సంస్థను జీవితాంతం మర్చిపోని కర్ణుడు కూడా మనలోనే ఉంటాడు.కానీ కృతజ్ఞత కొన్నిసార్లు వాళ్లు చేసే తప్పులను కూడా సమర్థించేలా చేస్తుంది.“అతను నాకు అవసరమైన సమయంలో అండగా నిలిచాడు” అనే జ్ఞాపకం,“అతను ఇప్పుడు చేస్తున్నది సరైనదేనా?” అనే ప్రశ్నను మనలోనే చంపేస్తుంది.తిరస్కారం కొందరిలో లక్ష్యంగామారుతుంది.మరికొందరిలో కోపంగా, ప్రతీకారంగా మారుతుంది.విజయం వచ్చిన తర్వాత కూడా,మనల్ని తిరస్కరించిన వాళ్లను వెతుక్కుంటూ వెళ్లే మనస్తత్వం అదే.ఇలాంటి మనస్తత్వాన్ని కర్ణుడు మనకు చూపించాడు.ఇతరులకు ఇవ్వడంలో ముందుంటాం,కానీ అవసరమైనప్పుడు సహాయం అడగలేని కర్ణుడు కూడా మనలోనే ఉంటాడు.మనము ఎక్కడి నుంచి వచ్చామో తెలిసినా,మనకు నిజంగా ఎక్కడ విలువ ఉందో,ఎక్కడ మనకు చోటుందో తెలియని సమయంలో కూడా కర్ణుడు మనలో మేల్కొంటాడు.
ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే,మన నిర్ణయాలు నిజంగా మనవేనా?లేక మన గాయాలు, మనుషులు, పరిస్థితులు మనల్ని నడిపిస్తున్నాయా?కర్ణుడు పూర్తిగా మంచివాడు కాదు, పూర్తిగా చెడ్డవాడూ కాదు.అతనిలో దానం ఉంది, గర్వం ఉంది.ధైర్యం ఉంది,భయం ఉంది.విధేయత ఉంది,తప్పు తెలిసినా దాని నుంచి బయటపడలేని బంధం కూడా ఉంది.అందుకే కర్ణుడిని అర్థం చేసుకోవడం అంటే…మనలో ఉన్న భిన్నమైన స్వభావాలను అర్థం చేసుకోవడమే.గొప్ప ప్రతిభ ఉన్నా ప్రశంస కోసం ఎదురుచూసేవారిలో కర్ణుడు ఉన్నాడు.మనకు మేలు చేసిన వాళ్లు తప్పు చేసినా వారిని సమర్థించేవారిలో కర్ణుడు ఉన్నాడు.తమ విలువను నిరూపించుకోవడానికి జీవితమంతా పరుగెత్తేవారిలోనూ కర్ణుడు ఉన్నాడు.

కర్ణుడు గతంలో, మన పుస్తకాల్లో, సినిమా తెరమీద మాత్రమేజీవించిన వ్యక్తి కాదు,మనలోనే ఎక్కడో, ఇప్పటికీ జీవిస్తూనే ఉన్న ఒక మనస్తత్వం.
sst
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Excellent write up 💯 👍