కురుక్షేత్ర యుద్ధం తొమ్మిది రోజులు గడిచిపోయింది. ప్రతి రోజూ పాండవ సైన్యం భారీ నష్టాలను చవిచూస్తోంది. దీనికి ప్రధాన కారణం ఒక్కరే — భీష్మ పితామహుడు.
వయసు పైబడినా, యుద్ధరంగంలో యువ వీరుడిలా పోరాడుతూ వేలాది మంది యోధులను ఓడిస్తున్నారు. ఆయన విల్లు చేతిలో ఉన్నంతసేపు ఎదురుగా నిలబడి పోరాడటం ఎవరికీ సాధ్యం కావడం లేదు.
భీష్ముడి పరాక్రమాన్ని చూసి పాండవులందరూ ఆందోళనలో మునిగిపోయారు.
“భీష్మ పితామహుడు యుద్ధంలో ఉన్నంతకాలం మనం విజయం సాధించలేం” అనే విషయం అందరికీ స్పష్టమైంది.
ఆ రాత్రి శ్రీకృష్ణుడు పాండవులను వెంటబెట్టుకుని భీష్ముడి శిబిరానికి వెళ్లాడు. శత్రుపక్షంలో ఉన్నప్పటికీ, భీష్ముడు వారందరినీ ఎంతో ప్రేమగా ఆహ్వానించాడు.
అప్పుడు ధర్మరాజు బాధతో భీష్ముడిని ఇలా అడిగాడు.
“తాతయ్యా! మిమ్మల్ని ఓడించడం మా వల్ల కావడం లేదు. ఈ యుద్ధంలో మేము ఎలా గెలవాలి? ఈ పోరాటం ఎప్పుడు ముగుస్తుంది?”
భీష్ముడు చిరునవ్వుతో సమాధానమి చ్చాడు.
“నా చేతిలో ఆయుధం ఉన్నంతవరకు నన్ను ఓడించడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ నేను ఒక స్త్రీపై గానీ, స్త్రీగా పుట్టి తరువాత పురుషుడిగా మారిన వ్యక్తిపై గానీ ఆయుధం ఎత్తను. శిఖండిని నా ఎదురుగా నిలబెట్టండి. అతని వెనుక నుంచి అర్జునుడు బాణాలు సంధిస్తే, నేను అతనితో యుద్ధం చేయను.”
తనను ఓడించడానికి ఉపయోగపడే మార్గాన్ని భీష్ముడే స్వయంగా వారికి చెప్పాడు.
మరుసటి రోజు యుద్ధం ప్రారంభ మైంది. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఒక ముఖ్యమైన మాట చెప్పాడు.
“అర్జునా! శిఖండిని భీష్ముడికి ఎదురుగా నిలబెట్టు. అతని వెనుక నుంచి నువ్వు బాణాలు సంధించు. ఇదే మనకు సరైన అవకాశం.”
యుద్ధరంగంలో శిఖండి భీష్ముడికి ఎదురుగా నిలిచాడు. శిఖండిని చూడగానే భీష్ముడు తన విల్లును కిందకు దించాడు.
“శిఖండిపై నేను ఆయుధం ఎత్తను” అని నిర్ణయించుకుని, ఎదురుదాడి చేయకుండా ఆగిపోయాడు.
అదే సరైన సమయమని శ్రీకృష్ణుడు గ్రహించాడు.
“అర్జునా! ఇదే సమయం. ఇక ఆలస్యం చేయకు. ఇది నీ వ్యక్తిగత విజయం కోసం కాదు. ధర్మాన్ని నిలబెట్టడం కోసం!” అని ప్రోత్సహిం చాడు.
కృష్ణుడి మాటలు విన్న అర్జునుడు తన మనసును దృఢం చేసు కున్నాడు. గాండీవాన్ని ఎత్తి, వరుసగా బాణాలు సంధించడం ప్రారంభించాడు.
అర్జునుడి బాణాలు వర్షంలా భీష్ముడిని తాకాయి. లెక్కలేనన్ని బాణాలు ఆయన శరీరాన్ని గాయపరిచాయి. చివరకు భీష్ముడు రథం నుంచి కిందకు జారిపోయాడు.
అయితే ఆయన శరీరం నేలను తాకలేదు. అర్జునుడు సంధించిన బాణాలే ఆయనకు ఆధారంగా నిలిచాయి. అలా భీష్ముడు అంపశయ్యపై విశ్రమించాడు.
భీష్ముడికి తన ఇష్టప్రకారం ప్రాణాలు విడిచే వరం ఉంది. దీనినే ఇచ్ఛా మృత్యువు అంటారు. అందుకే ఆయన వెంటనే ప్రాణాలు విడవలేదు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు అంపశయ్యపైనే ఉండాలని నిర్ణయించుకున్నాడు.
ఆ సమయంలో ధర్మరాజుకు ధర్మం, రాజనీతి, మంచి పాలన, జీవిత విలువల గురించి ఎన్నో గొప్ప విషయాలను బోధించాడు. తన అనుభవసారాన్ని పాండవులకు అందించిన తరువాతే ప్రాణాలు విడిచాడు.
ఆ ఒక్క రాత్రి శ్రీకృష్ణుడు చెప్పిన వ్యూహం లేకపోయి ఉంటే, భీష్ముడిని ఓడించడం పాండవులకు మరింత కష్టమయ్యేది. ఆయన అజేయమైన పరాక్రమం కొనసాగి ఉంటే, కురుక్షేత్ర యుద్ధం ఫలితం మరోలా మారే అవకాశం కూడా ఉండేది.
విజయం సాధించడానికి శారీరక బలం ఒక్కటే సరిపోదు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే తెలివి, పరిస్థితులను అర్థం చేసుకునే నేర్పు, లక్ష్యాన్ని చేరుకోవాలనే పట్టుదల కూడా అవసరం.
బలంతో సాధించలేనిది బుద్ధితో సాధించవచ్చు. ధర్మాన్ని నిలబెట్టే విజ్ఞతే నిజమైన విజయానికి మార్గం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి