కానరాకున్నవి ఆ సుందర వనాలు: - బి.ఉషారాణి- Govt టీచర్-మంచిర్యాల


కాకులు దూరని కారడవులు
చీమలు దూరని చిట్టడవులు
చందమామ కథలై మిగిలాయా

కనిపిస్తే గొడ్డలి పట్టి
నరుడెక్కడ నరికేస్తాడోనని
అందనంత దూరం వెళ్లి
చుక్కల లోకాన్ని చేరి
చందమామ గూటిలో దాగాయా

ఆనాటి వనాలు అందానికి ఆనవాళ్లు
ఋషులు తపస్సుకు పవిత్ర నిలయాలు
శిష్యులు విద్యనభ్యసించే గురుకులాలు
వానప్రస్థ జీవనానికి అనువైన ప్రదేశాలు

మనిషి జీవితంలో  అంతర్భాగమై
వనదేవతలు కొలువైన ఆలయాలై
రవి కిరణం సైతం చొరబడలేని తావులై
ఓ వెలుగు వెలిగి విరాజిల్లినవి

సెలయేళ్ళ గలగలలు
లేళ్ళు కుందేళ్ల పరుగులు
సింహగర్జనలు పులి గాండ్రింపులు
ఏనుగు ఘీంకారాలు పక్షుల కువకువలు
వీటన్నింటి సమ్మేళనమై
జీవవైవిధ్యం వెల్లివిరిసి
అందంగా అలరారేవి ఆనాటి అడవులు

నేడెమో...
అటవీ విస్తీర్ణపు లెక్కల్లో తప్ప
కంటినిండా కనులారా వీక్షించేందుకు
కానరాకున్నవి ఆ సుందర వనాలు
కామెంట్‌లు