తొలి మహిళా ఇంజనీర్ అయ్యలసోమయాజుల లలిత: (1919 - 1979)- ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ - ( పుష్యమి)-సెయింట్ లూయిస్ -అమెరికా
  

ఆత్మవిశ్వాసం, ధృఢ సంకల్పము ఉంటే అవరోధాలు ఎన్ని ఎదురైనా సాధించలేనిది ఏదీ లేదని స్వామి వివేకానంద చెప్పిన దానికి ప్రతీక మన తెలుగింటి ఆడపడుచు భారతదేశపు తొలి మహిళా ఇంజనీర్ అయ్యల సోమయాజుల లలిత.
     మద్రాసు లో సాధారణ ద్రావిడ బ్రాహ్మణ కుటుంబంలో ఎనిమిదవ సంతానంలో ఐదవ సంతానంగా జన్మించి ఆనాటి సామాజిక పరిస్థితుల ప్రకారం పాఠశాలలో చదువుతుండగానే పదిహేనవ ఏట  వివాహమై కొన్నాళ్ళు చదువు సాగిన  ఆ తరువాత ఆటంకం ఏర్పడి 17వ ఏట కుమార్తె శ్యామలకు జన్మనిచ్చిన నాలుగవ నెలలోనే భర్త మరణంతో కృంగిపోక తండ్రి పప్పు సుబ్బారావు సోదరుల సహాయంతో క్వీన్ మేరీ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి తండ్రి పనిచేస్తున్న ఇంజనీరింగ్ కాలేజీలోనే 
బ్రిటీష్ ప్రభుత్వపు అనుమతితో 1940లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశించారు .యాజమాన్యం ఇతర విద్యార్థుల మద్దతుతో వందలాది అబ్బాయిలు ఉన్న కాలేజీలో ఆమె ఒక్కతే స్త్రీ అయినా అసౌకర్యం లేక అత్యున్నత శ్రేణిలో   1943లో ఉత్తీర్ణురాలై 
 మొదట జమాల్ పూర్ రైల్వే వర్క్ షాప్ లో ఒక సంవత్సరం అప్రెంటిస్ షిప్ తో శిక్షణను పూర్తి చేసారు తరువాత సిమ్లాలోని స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ లో పనిచేశారు ఆమె పొగలేని ఓవెన్, సంగీత వాయిద్యాల  పరిశోధనలో తండ్రికి సహాయం చేశారు కలకత్తాలోని బ్రిటిష్ సంస్థ అసోసియేటెడ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ లో చేరి అతి పెద్ద డ్యాం అయిన భాక్రా నంగల్ డ్యాం, ట్రాన్స్మిషన్ లైన్లు, సబ్ స్టేషన్ లేఅవుట్ ల రూపకల్పనలో  సహ  ఇంజనీర్లతో ఎన్ని అవరోధాలు ఎదురైనా సమర్ధవంతంగా పనిచేశారు. ఇంజనీర్ లలిత 1953లో ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్   లండన్ కౌన్సిల్ లో అసోసియేట్ మెంబర్ గా తరువాత 1966 లో పూర్తిస్థాయి సభ్యురాలిగా ఎన్నికైనారు .
1964లో న్యూయార్క్ లోని జరిగిన మొదటి అంతర్జాతీయ మహిళా ఇంజనీర్లు శాస్త్రవేత్తల (IC WES) సదస్సుకు హాజరైన భారతదేశపు మహిళా ఇంజనీరు లలిత ఒక్కరే  ఆ సమావేశంలో 35 దేశాల నుంచి 500 మంది మహిళా ఇంజనీర్లు పాల్గొన్నారు తిరిగి వస్తూ బ్రిటన్ లో AEI కంపెనీని సందర్శించిన విషయాన్ని ప్రముఖ వార్తాపత్రికలు అయిన టైమ్స్ ఆఫ్ ఇండియా ,ఇండియన్ ఎలక్ట్రికల్ న్యూస్, ఫెమీనా ,వంటి పత్రికలకు ఇంటర్వ్యూ ఇచ్చి ఆనాడే స్త్రీలు సాంకేతిక విద్య నేర్చుకోవడం లోని ప్రాముఖ్యతను తెలియజేశారు. బ్రిటిష్ ఫ్యాక్టరీలను సందర్శించిన తొలి మహిళ ఇంజనీర్ అని పత్రికలలో వార్తాకథనాలు రావడం తెలుగు వారికే కాక భారతీయులందరికీ గర్వకారణం తరువాత 1967లో రెండో అంతర్జాతీయ మహిళా ఇంజనీర్ల సమావేశానికి మరో ఐదుగురు భారతీయ మహిళలు హాజరవడం స్త్రీలందరికీ సాంకేతిక విద్య ప్రధానంగా ఇంజనీరింగ్ పట్ల ఆసక్తి కలగడానికి కారణం మన తొలి భారత మహిళా ఇంజనీర్ అయ్యల సోమయాజుల లలితయే .
  వృత్తి యే దైవంగా భావించి చిన్నతనంలోనే భర్త మరణించిన వివాహం చేసుకోక కుమార్తె శ్యామలను  ఆంధ్రప్రదేశ్ లో అప్పటి  విశాఖ జిల్లాలోని అనకాపల్లి పట్టణంలో వేదుల చేనులు  గారికి ఇవ్వడం ఆమె కూడా ఉన్నత చదువులు చదివి   60 సంవత్సరాలయి   అమెరికాలో కాలిఫోర్నియాలో స్థిరపడటం జరిగింది . 89 సంవత్సరాల శ్యామల మాటలలో తన తల్లి ఎందరికోస్ఫూర్తి అని వృత్తినే దైవంగా చేసుకుని 30 సంవత్సరాలు పనిచేసి అరువది సంవత్సరాల వయస్సులో బ్రెయిన్   ఎన్యూరిజం కారణంగా 1979లో శ్రీరామచంద్రుని దరి చేరినా నేడు  ఇంజనీరింగ్ చదివిన  మరియు చదువుతున్న భారతీయ మహిళలందరికీ స్పూర్తి యని చెప్పారు అందుకే ఆత్మవిశ్వాసం దృఢ సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చునన్న దానికి ప్రతీకయే మన భారతదేశపు తొలి మహిళా ఇంజనీర్ అయ్యలసోమయాజుల లలిత.
.................................
కామెంట్‌లు