మనల్ని అందరూ అర్థం చేసుకోవాలని ఆశించకూడదు.: - - యామిజాల జగదీశ్
 

ఒక ఇంటిని బయట నుంచి చూసినంత మాత్రాన ఆ ఇంట్లోని జీవితం మొత్తం అర్థం కాదు…మనిషి జీవితం కూడా అంతే.
ఒక చిన్న ఇంట్లో ఓ యువకుడు ఉండేవాడు.
ఆ ఇంటి కిటికీల్లో ఒకటి మాత్రం ఎప్పుడూ మూసే ఉండేది.
ఒకరోజు అతని స్నేహితుడు అడిగాడు:
“ఈ కిటికీని ఎప్పుడూ ఎందుకు మూసే ఉంచుతావు?”
యువకుడు చిరునవ్వుతో అన్నాడు:
“ఆ కిటికీ తెరిస్తే…
ఎదురింటి వాళ్లు లోపలికి తొంగి చూస్తారు.”
స్నేహితుడు నవ్వుతూ అన్నాడు:
“చూస్తే చూడనివ్వు. అందులో అంత భయమేముంది?”
యువకుడు కాసేపు మౌనంగా ఉండి చెప్పాడు :
“వాళ్లు నా ఇంట్లో కనిపించిన దాన్ని చూసి నా ఇంటి గురించి ఏదైనా అనుకోవచ్చు. కానీ ఆ ఒక్క చూపుతో నా జీవితం మొత్తం ఎలా ఉంటుందో తీర్పు చెప్పకూడదనేదే నా భయం.”
స్నేహితుడు అతని మాటలను విని మౌనంగా ఉండిపోయాడు.
ఎంత చిన్న మాట…
కానీ అందులో జీవితానికి సంబంధించిన ఓ పెద్ద నిజం ఉంది.
మనిషిని బయట కనిపించే కొద్దిపాటి విషయాలను బట్టి
పూర్తిగా అర్థం చేసుకోవడం సాధ్యం కాదు.
ఎవరి జీవితంలో ఏం జరుగుతుందో
వాళ్లకు మాత్రమే పూర్తిగా తెలుసు.
వాళ్లు ఎందుకు మౌనంగా ఉన్నారో…
ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారో…
ఎందుకు కొంతమందికి దూరంగా ఉంటున్నారో…
ఎందుకు కొన్ని విషయాలకు “వద్దు” అంటున్నారో…
బయట నుంచి చూసేవారికి తెలియకపోవచ్చు.
అయినా మనం చాలాసార్లు
చూసిన కొద్దిపాటి దాన్ని బట్టి
మనిషి గురించి ఓ అభిప్రాయం ఏర్పరుచుకుంటాం.
అదే మన గురించి కూడా జరుగుతుంది.
ఎవరైనా మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటే వెంటనే మనసులో కలత మొదలవుతుంది.
“నేను అలా కాదు…”
“నా ఉద్దేశం అది కాదు…”
“నన్ను ఒకసారి పూర్తిగా అర్థం చేసుకుంటే…”
అని మనల్ని మనమే సమర్థించుకోవడం మొదలుపెడతాం.
కానీ జీవితంలో ఒక దశకు వచ్చాక
మనకు అర్థమయ్యే గొప్ప నిజం ఇదే:
అందరూ మిమ్మల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. 
మీ ఇంటి కిటికీ నుంచి
వాళ్లకు కనిపించింది కొంత మాత్రమే.
మీ జీవితంలో మీరు నడిచిన దారి…
మీరు భరించిన బాధ…
మీరు చేసిన త్యాగాలు…
మీ మనసులో దాచుకున్న కథ…
అవి మీకు మాత్రమే తెలుసు.
అందుకే ప్రతి ఒక్కరి చూపుకు
మీ జీవితాన్ని సమర్థించుకుంటూ తిరగాల్సిన అవసరం లేదు.
కామెంట్‌లు