రఘురాముని కళత్రము
పతియే తన లోకము
సహనము ఆమె బలము
కౌసల్యానందన ప్రాణసఖి!!
వీడి అంతఃపురము
పతితో వనవాసము
పంచవటిలో నివాసము
అతివలకామె ఆదర్శము
కౌసల్యానందన ప్రాణసఖి!!
శ్రీరాముని సహచరి
సౌమిత్రి మాట మీరి
ధరణిజ దాటెను గిరి
చేరె అశోకవనికి నారి
కౌసల్యానందన ప్రాణసఖి!!
రావణుని మాయ అని
సీత నమ్మక హనుమని
రాముని ఉంగరమును కని
నొసగె తన చూడామణిని
కౌసల్యానందన ప్రాణసఖి!!
రావణాసురుని సంహారం
అయోధ్యకు సీత ఆగమనం
నగరిలో రజకుడి వాచాలం
మిథిలేశ్వరికి అంటె కళంకం
కౌసల్యానందన ప్రాణసఖి!!
ఆదికవి ఆశ్రయము
మైధిలికి ఆశ్రమము
లవకుశులకు జననము
శ్రీరామునికై నిరీక్షణము
కౌసల్యానందన ప్రాణసఖి!!
లవకుశులను జానకి
అప్పగించెను పతికి
నిందలతో అలసి తుదకి
చేరెను అవని ఒడికి
కౌసల్యానందన ప్రాణసఖి!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి