మౌనానికి తోడు ఏకాంతం : - - తమిళ మూలం - బాలకుమరన్-అనుసృజన - యామిజాల జగదీశ్

 

 ఇంటిని వదిలి పారిపోవడమా? కాదు.
అభిప్రాయం చెప్పకుండా ఉండటం. ఏదో ఒక అభిప్రాయం ఏర్పరచుకోవాల నుకునే మనసును నెమ్మదిగా శాంతింపజేయడం.
“రూపాయి నోట్లు చెల్లవంటున్నారు కదా, దాని గురించి మీరేమనుకుంటున్నారు సార్?” అని ఎవరైనా అడిగితే మాట్లాడకండి.
“అయ్యో, ఇది జీవితానికి సంబంధించిన సమస్య కాదా?” కాదు.
ఈ ప్రపంచం ఇలాంటివి ఎన్నో చూసింది. మనసులో పుట్టుకొచ్చే పదిహేను, ఇరవై అభిప్రాయాలను మొదట్లోనే పక్కన పెట్టేయండి. మనసు నెమ్మదిగా నిశ్చలమవుతుంది.
మనుషులతో కలవడం తగ్గుతుంది. అందరూ మిమ్మల్ని మొండివాడని, రాయిలాంటి మనిషని తిట్టొచ్చు. వాటిని ఖండించాల్సిన అవసరం లేదు. నేను ఈ పార్టీకి చెందినవాడిని, ఈ సిద్ధాంతాన్ని నమ్ముతాను, ఈ కులం, ఈ మతం — ఇలాంటి గుర్తింపులన్నీ క్రమంగా వెనక్కి వెళ్లిపోతాయి.
మనసులో ప్రేమ పొంగి నిలుస్తుంది. ప్రేమకు, ప్రశాంతతకు విడదీయలేని బంధం ఉంది.
ఇక్కడ ఒకరిపై సంపూర్ణమైన శ్రద్ధ మొదలవుతుంది. “నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అని మీ భార్యతో ఎంతో నిజాయితీగా చెబుతారు. ఎందుకంటే ఆమె గురించి మీకెలాంటి అభిప్రాయమూ ఉండదు. ఆమె కూడా మీతో పాటు ప్రయాణిస్తున్న ఒక తోటి ప్రయాణికురాలు మాత్రమే. అంతే.
ఈ భావన కూడా క్రమంగా రాలిపోతుంది.
ఎవరి నుంచీ ఏమీ ఆశించని స్థితి వస్తుంది. ఉన్నదాన్ని ఉన్నట్టుగా అంగీకరించే స్థితి అది. మనలోని ఎత్తుగడలు, మాయోపాయాలు చచ్చిపోయినప్పుడు ఆ స్థితి వస్తుంది.
“ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి. ఆచరణలోకి రావు” అంటారా?
వస్తాయి. తప్పకుండా వస్తాయి. ఈ జన్మలో కాకపోతే రేపో, మరో జన్మలోనో వస్తాయి. మనం చివరకు చేరాల్సిన గమ్యం వైపు ప్రయాణించక తప్పదు.
ఏకాంతాన్ని అనుభవించారా? అందులో ఒక సారం ఉంది, అమ్మా!
ఏమిటా ఏకాంతపు సారం?
తనను తాను తెలుసుకోవడం.
మనసు ఆలోచనలతో నిండిపోయి పెద్ద గందరగోళంగా మారిపోవచ్చు. అలా గీతలు, రాతలతో నిండిపోయిన పలక మీద కొత్తగా ఏమీ రాయలేం.
అదే పలక శుభ్రంగా ఉంటే, దానిమీద పెట్టిన చిన్న చుక్క కూడా స్పష్టంగా కనిపిస్తుంది.
అలాగే, అభిప్రాయాలు లేని మనసు ఎదుటి మనిషిని క్షణంలోనే గుర్తించగలదు. అతడిని ఉన్నట్టుగా అంగీకరించగలదు.
ఎదురుగా ఉన్న మనిషినే కాదు, ఎన్నో జన్మలుగా మనలో పేరుకుపోయిన సంస్కారాలు కూడా మన ముందు ప్రత్యక్షమవుతాయి.
“మునుపటి జన్మలో నేను హిరణ్యకశిపుడిని. నా అహంకారాన్ని, క్రూరత్వాన్ని తొలగించడానికి వచ్చిన నరసింహుడివి నువ్వు” అని గుర్తిస్తుంది ఆ మనసు. ఆ సత్యాన్ని తెలుసుకుని నమస్కరిస్తుంది.
ఆ తర్వాతి అడుగు ఏమిటో కూడా అర్థమవుతుంది.
ఇక జీవించడం సులభమవుతుంది.
మంచివాళ్లు ఇలాగే జీవించారు.
==============================

కామెంట్‌లు