మానసిక స్థితి:---సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,ధర్మపురి. మొబైల్: 9908554535.

  ఒక నిరుద్యోగి ఒక ఆఫీసుకు వెళ్లి ఆ మేనేజర్ ను ఉద్యోగం ఇవ్వమని  బ్రతిమాలాడు .అప్పటికే ఆయన తన  అధికారులచే చీవాట్లు తిని ఉన్నాడు . ఆయన మనసు ఏం బాగాలేదు  .ఈ నిరుద్యోగి అభ్యర్థనను అతడు పట్టించుకోలేదు .
        అప్పుడు ఆ నిరుద్యోగి తిరిగి "సార్ !మీ ఆఫీసులో నాకు ఒక ఒక ఉద్యోగం ఇవ్వండి .చేస్తాను "అని అన్నాడు. వెంటనే మేనేజర్ కోప్పడి "ఉద్యోగం లేదు.సద్యోగం లేదు. ఇక్కడినుండి  వెళ్ళు "అని కసిరాడు. చేసేది లేక ఆ నిరుద్యోగి బయటకు వచ్చాడు.
         అతడు ఆ పట్టణంలోని తన మిత్రుని కలిసి జరిగినదంతా చెప్పాడు. అప్పుడు ఆ స్నేహితుడు అతనితో "నేను నీకు ఉద్యోగం ఇప్పిస్తాను పద "అని అన్నాడు .వెంటనే నిరుద్యోగి ఆనందంతో" ఉద్యోగమా! నిజంగానా" అని అన్నాడు. " అవును. నిజమే. అదీ ఆ ఆఫీస్ లోనే నీకు ఉద్యోగం ఇప్పిస్తాను. కావాలంటే చూడు నా తడాఖా" అని అన్నాడు ."అసాధ్యం రా. ఆ మేనేజర్ చాలా కోపిష్టి. ఆయన నన్ను చూస్తే ఉద్యోగం ఇమ్మన్నా  ఇవ్వడు"  అని అన్నాడు. "అదేం కాదులే .నేను వెళ్లి మాట్లాడిన తర్వాత నీవు రా "అని అన్నాడు మిత్రుడు. సరేనన్నాడు ఆ నిరుద్యోగి .
           ఆ మిత్రుడు ఆఫీస్ లోపలికి ప్రవేశించి మేనేజర్ తో "సార్! మీకు ఓ శుభవార్త. త్వరలో మీకు ప్రమోషన్ వస్తుందట. నాకు మా నాన్నగారి ద్వారా ఈ సంగతి తెలిసింది .అంతేకాదు .త్వరలో మీకు అవార్డు కూడా ఇస్తారట .మా నాన్నగారు చెప్పారు "అని అన్నాడు. అది విన్న మేనేజర్ ఉబ్బితబ్బిబ్బయ్యాడు ."నిజంగా! మీ నాన్న చెబితే ఖచ్చితంగా కరెక్టే .ఆయన చాలా పెద్ద ఆఫీసర్ . ఆయన  చెప్పిన  తర్వాత దానికి తిరుగులేదు "అని అన్నాడు.
          అప్పుడు ఆ నిరుద్యోగి ప్రవేశించి" సార్! నాకు ఉద్యోగం ఇవ్వరూ"అని అన్నాడు. అప్పుడు నిరుద్యోగి మిత్రుడు మాట్లాడుతూ "సార్! ఇతడు  నా మిత్రుడు. నన్ను కలవకుండా పొరపాటుగా మొదట మీ దగ్గరికి వచ్చాడు. మీ మంచితనం గురించి వాడికి తెలియదు . మీ ఆఫీసులో ఖాళీగా ఉంటే ఒక ఉద్యోగం ఇప్పించరూ"అని అన్నాడు .వెంటనే ఆ మేనేజర్ "తప్పకుండా బాబూ! రేపు వచ్చి జాయిన్ అవ్వు" అని ఆ నిరుద్యోగితో  అన్నాడు .అది విన్న నిరుద్యోగి చాలా సంతోషించి మిత్రునితో పాటు బయటకు వచ్చాడు .
        "ఒరేయ్ !రేపు నిజం ఆయనకు తెలిస్తే నా ఉద్యోగం గోవిందా "అని అన్నాడు . "అలాంటిదేం లేదు. ఆయనకు ప్రమోషన్ రాదు. అవార్డు అంతకన్నా రాదు .నీకు ఉద్యోగం ఇవ్వాలని ఆయన మానసిక స్థితి సంతోషంగా ఉండాలని ఆ కబురు చెప్పాను. ఒకవేళ అతనికి కోపం ఉన్నా ఆ వార్త చెప్పిన నాపై ఉంటుంది తప్ప నీ పైన కాదు .మా నాన్న ఇంకొక డిపార్ట్ మెంట్ లో పెద్ద ఆఫీసర్ .వారి దగ్గర ఖాళీ లేదని అన్నాడు. లేకపోతే నీకు అక్కడనే ఉద్యోగం ఇప్పించే వాడిని. నీ ఉద్యోగానికేం ఢోకా లేదు "అని నవ్వుతూ అన్నాడు. ఆ మాటలు విని నిరుద్యోగి సంతోషించి మర్నాడే ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు.
            అందుకే మనసు సంతోషంగా ఉన్నప్పుడు మనిషి ఏమి అడిగినా ఆ సంతోషంలో లేదనకుండా ఇస్తాడు.