*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ద్వితీయ (సతీ) ఖండము-(0172)*
 *కార్తీకదామోదర మీనాక్షీ సుందరేశ్వరుల అనుగ్రహం పరమేశ్వర ఆత్మబంధువులు అందరకీ కలగాలని ప్రార్ధిస్తూ......*
🪔🪷🪔🪷🪔🪷🪔🪷🪔
బ్రహ్మ, నారద సంవాదంలో.....
 *దేవతలు, బ్రహ్మ కైలాసమునకు వెళ్ళి - పరమేశ్వరుని స్తుతి చేయడం - దేవతలకు, దక్షునికి వరమొసగుట - యజ్ఞ మండపము నకు వెళ్ళి దక్షుని సజీవుని చేయుట - అందరితోనూ ఆ స్వామి స్తుతింపబడుట*
*నారదా! వేదములను అనుసరించే వాడు, చరాచరములకు భర్త, దయాళువు అయిన మహాదేవుని మాటలు విన్న తరువాత ఆ సదాశివుని వెంట అందరమూ కనఖల నగరమందు వున్న దక్షుని యజ్ఞ శాలకు వెళ్ళాము. అక్కడ, వీరభద్రుడు చేసిన కరాళ నృత్యం ఫలితంగా స్వాహా, స్వధా, తుష్టి, ధృతి, సరస్వతి, పితరులు, అగ్ని, యక్ష గంధర్వులు అక్కడే వున్నారు. కొంతమంది గాయాలతో, మరికొందరు ప్రాణాలు కోల్పోయి పడి వున్నారు. ఆ యజ్ఞ స్థితిని చూచిన మహాదేవుడు, వీరభద్రుని చూచి "కొంచెం సమయములోనే ఇంత విధ్వంసం చేసావు కదా! దక్షుని అహంకారమునకు  చాలా గొప్ప దండన విధించావు. నీవు దక్షుని నా వద్దకు తొందరగా తీసుకుని రావలసినది" అని చెప్పారు సదాశివుడు. త్వర త్వరగా తల తెగి పడివున్న దక్షుని మొండెమును రుద్రుని ముందుకు తీసుకు వచ్చాడు, వీరభద్రుడు. "దక్షుని తల యేది" వీరభద్రా! "అగ్ని కి ఆహుతి చేసాను" మహాస్వామీ అన్నాడు.*
*రుద్రదేవుడు, బ్రహ్మ చేత పూర్తి కావలసిన యజ్ఞ కార్యక్రమం పూర్తి చేయించాడు. తరువాత, శివుని ఆజ్ఞ మేరకు, యజ్ఞ పశువు అయిన మేక తలను దక్షుని మొండెమునకు అమర్చబడింది. శివుని చల్లని చూపల వల్ల దక్షుని లో ప్రాణవాయువు మరల ప్రసరించింది. తన ఎదురుగా ఉన్న లోకసంరక్షకుడు అయిన శివుని రూపము చూసిన దక్షుడు అతనిని కీర్తించాలి అనుకున్నాడు, కానీ తన మూర్ఖత్వం వల్ల కోల్పోయిన కూతురు ఉమ గుర్తుకు వచ్చింది. బాధతో సదాశివుని కీర్తించలేకపోయాడు, దక్షుడు. కొంతసేపటికి తేరుకుని, అభయంకరుని, సర్వరక్షకుని కీర్తించాడు.*
*మహాదేవా! కరుణామయా! మీరు ముందుగా సృష్టి చేసిన బ్రాహ్మణులను నేను నాకున్న గర్వము వలన దూషించాను. మీరు గొల్లవాడు ఆవులమందను కాపాడేటట్టు, సాధువులైన బ్రాహ్మణులను కాపాడుతూ వుంటారు అనే విషయం మరచి పోయి వ్యవహరించాను. నేను చేసిన తప్పు లను మన్నించి, మమ్మల్ని కాపాడటానికి మీరు ఇక్కడికి వచ్చారు. భక్తవత్సలా! దీన బంధో! మీది కానిది ఏదీ మావద్ద లేదు. మిమ్మల్ని గుర్తించి కీర్తించే శక్తి మాకు లేదు. మీరే కరుణించి మమ్మల్ని కాపాడాలి, కాటికాపరీ! అని దక్షుడు కీర్తనలు చేసాడు.*
*లోకకళ్యాణకారకుడు, మహాప్రభువు అయిన మహేశ్వరుడు సంతుష్టుడు అయ్యారు. విష్ణు దేవుడు, బ్రహ్మ నైన నేను, మిగిలిన దేవీ దేవతలు, మహర్షులు, మునులు, యక్ష గంధర్వులు కూడా ఆ దేవదేవుని కీర్తించారు.*

*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు