ఎవరీ నర్తకీ నటరాజ్?!;-- యామిజాల జగదీశ్
 డిఎంకె పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు ప్రకటనలు రోజూ వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో వెలువడిన ఓ ప్రకటన అందరీ దృష్టినీ ఆకర్షిస్తోంది. అది నర్తకి నటరాజ్ నియామకానికి సంబంధించిన ప్రకటన. "తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ రాష్ట్ర అభివృద్ధి విధాన మండలిని (SDPC)   పునర్నిర్మిస్తూ అందులో నర్తకీ నటరాజ్ కి సభ్యత్వాన్నిస్తున్నాం" అన్నదే ఆ ప్రకటన. 
ఇంతకూ ఈ నర్తకీ నటరాజ్ ఎవరు?
చూడగానే భరతనాట్య కళాకారిణిగా అన్పించే నర్తకీ నటరాజ్ ఓ ట్రాన్స్ జెండర్! తమిళంలో వీరిని తిరునంగై అంటారు. ఈ పదాన్ని సృష్టించింది తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి.
సమాజంలో నర్తకీ నటరాజ్ కి అంత సులభంగా ఓ ఆమోదముద్ర లభించలేదు. ఎన్నో కష్టాలు నష్టాలు చవిచూసిన తర్వాత ఈరోజు సమాజంలో ఓ గౌరవప్రదమైన హోదా పొందారు నర్తకి నటరాజ్.
మదురై జిల్లాలో సకల వసతులతో తులతూగుతున్న కుటుంబంలోనే పుట్టారు నర్తకి నటరాజ్. తొలి రోజుల్లో నటరాజ్ గానే ఆందరూ చెప్పుకునేవారు. కానీ తన శరీరనిర్మాణంలోని తేడాను గ్రహించిన నటరాజ్ తన పదో ఏట కుటుంబసభ్యులకు తన పరిస్థితిని తెలిపారు. ఆ మాట కుటుంబసభ్యులను కలచివేసింది. ఆందోళన పరచింది. అవమానంగా భావించారు. కొట్టారు. తిట్టారు. మగాడిలా ప్రవర్తించమని ఒత్తిడి చేశారు. మగాళ్ళతో కలిసి ఆట్లాడమని చెప్పేవారు. దాంతో నటరాజ్ మనసు గాయపడింది. మానసికంగా నలిగిపోవలసివచ్చింది. ఇంట్లో పరిస్థితులు సానుకూలంగా లేవని గ్రహించిన నటరాజ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు.
 
బంధువులెవరూ పట్టించుకోకపోవడంతో ఏం చేయాలో తెలియని అయోమయస్థితిలో ఓ అండ దొరికింది. ఆ బంధం ఓ గొప్ప స్నేహబంధం.శక్తి అనే వ్యక్తి నర్తకి నటరాజ్ జీవితానికో దారి చూపారు. ఈ ఇద్దరినీ సమాజం నానా మాటాలంటూనే ఉంది. దూరంగా ఉంచింది. కొన్ని రోజులైతే నీళ్ళు తాగి గడపాల్సి వచ్చింది. అన్నం పెట్టే వాళ్ళు లేరు. అయితే ఇద్దరిలోనూ మానసిక స్థయిర్యం మాత్రం సడలలేదు. నటరాజ్ కి కళ తోడైంది.
చిన్నప్పటి నుంచే నటరాజ్ కి భరతనాట్యమంటే ఇష్టం. వైజయంతి మాల నాట్యమంటే ప్రాణం. స్క్రీన్ మీద చూస్తూ నాట్యం అభ్యసించిన నటరాజ. ఆలయాలలో, ఇతర ఉత్సవాలలో నాట్యం చేస్తూ వచ్చారు. ఈ కార్యక్రమాలతో లభించిన డబ్బులతో కిందామీదా పడి జీవితాన్ని సాగిస్తూ వచ్చారు. తనెలాగైనా ఓ నర్తకిగా గుర్తింపు పాందాలని ఆ దిశలో కృషి చేసారు. కిట్టప్ప పిళ్ళయ్ అనే ఆయన గురించీ చెవినపడింది. ఈ కిట్టప్ప ఎవరో కాదు. వైజయంతిమాలాకి నాట్యం నేర్పిన గురువుగారు. తంజావూరుకి చెందినవారు. వెంటనే ఇద్దరూ కలిసి తంజావూరు వెళ్ళారు. కిట్టప్పను కలవడానికి ప్రయత్నించారు. కాని సాధ్యంకాలేదు. అయినా తమ ప్రయత్నం మానలేదు. కానీ ఏవీ కలసిరాకున్నా నటరాజ్ నిరుత్సాహం చెందలేదు. 
ఈ దశలో అనుకోని సంఘటన జరిగింది.
కిట్టప్ప నుంచి కబురందింది. బెంగుళూరు వెళ్ళి వైజయుతిమాలా నాట్యకార్యక్రమాన్ని చూడటానికి వెళ్ళారు. నర్తకి నటరాజ్ ఆనందానికి పట్టపగ్గాల్లేవు. కిట్టప్ప తనకు నాట్యం నేర్పడానికి అంగీకరించినట్టే భావించారు. కానీ జరిగింది వేరు. కిట్టప్ప నాట్యం గురించి ఏమీ మాట్లాడలేదు.
దక్షిణ భారత దేశంలో జరిగిన వివిధ నాట్యకార్యక్రమాల వివరాలను కిట్టప్ప నర్తకి నటరాజ్ కి పంపారు. నాట్యప్రదర్శనలను చూడటానికి అవకాశమిస్తూ వచ్చారు. కిట్టప్ప ఎందుకలా చేస్తున్నారో అర్థం కాలేదు. అయినా ఆయనను ఎందుకూ ఏమిటీ అని ప్రశ్నించలేదు. 
ఆర్థికంగా దక్షిణ భారతదేశమంతటా ప్రయాణించడం శ్రమతో కూడుకున్నప్పటికీ ఎట్లాగో డబ్బును సమకూర్చుకుంటూ కిట్టప్ప చెప్పిన నాట్యప్రదర్శనలను చూస్తూ వచ్చారు నర్తకీ నటరాజ్. చివరకు ఓరోజు కిట్టప్ప పిళ్ళయ్ నటరాజ్ ని పిలిచి నాట్యం నేర్పడం మొదలుపెట్టారు. నటరాజ్ కల పండింది. అయినా సమస్య ఉంటూనే ఉంది. సంప్రదాయబద్ధమైన భరతనాట్యాన్ని ఓ ట్రాన్స్ జెండర్ చేయడమేమిటీ అనే వ్యతిరేకత మొదలైంది. అవమానాలు ఎదురయ్యాయి. అయితే ఈ అడ్డంకులను అధిగమిస్తూ వచ్చిన నర్తకీ నటరాజ్ ఏడాది కల్లా నాట్యం నేర్చుకున్నారు. 1983లో మేయర్ సమక్షంలో నర్తకీ నటరాజ్ అరంగేట్రం జరిగింది. ఆ తర్వాత అనేక చోట్ల నాట్యప్రదర్శనలిస్తూ వచ్చిన నర్తకీ నటరాజ్
కి విదేశాల నుంచీ ప్రశంసలు వచ్చాయి. సంగ కాల పాటలను ఆధారం చేసుకుని నర్తకీ నటరాజ్ నాట్యమాడటం మొదలుపెట్టారు. 2007లో తమిళనాడు ప్రభుత్వం నుంచి కళైమామణి బిరుదును పొందిన నర్తకీ నటరాజ్ ను సంగీత నాటక అకాడమీ ఘనంగా సన్మినించింది. 2019లో భారత ప్రభుత్వం "పద్మశ్రీ"తో సత్కరించింది.
మన దేశంలో ఓ ట్రాన్స్ జెండర్ ఈ అవార్డు అందుకోవడం ఇదే మొదటిసారి.
తంజావూరు నాట్య భావ తీరులో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న నర్తకీ నటరాజ్ తన మిత్రులు శక్తిభాస్కరుతో కలిసి చెన్నై, మదురైలలో వెల్లియంబలం నాట్య కళా కేంద్రాలను ఏర్పాటు చేసి నాట్యంలో శిక్షణా తరగతులను నిర్వహించడం విశేషం. దేశ విదేశాలకు చెందిన వారెందరో ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. ఈ నాట్య విద్యాలయానికి అమెరికా, ఇంగ్లండ్, కెనడాలలోనూ నాట్య శాఖలున్నాయి. 
కామెంట్‌లు